పామాయిల్‌ ఫ్యాక్టరీలో ఇంటిదొంగ

ABN , First Publish Date - 2020-10-22T07:13:26+05:30 IST

బ్యాంకు డిపాజిట్‌ నకిలీ రశీదులు సృష్టించి ఓ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రూ.8.38 లక్షలు కాజేశాడు. ఈ సంఘటన అప్పారావుపేట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

పామాయిల్‌ ఫ్యాక్టరీలో ఇంటిదొంగ

నకిలీ రశీదులతో రూ. 8 లక్షలు స్వాహా

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి చేతివాటం

ఏడాది తరువాత ఆడిట్‌లో వెలుగులోకి

విషయం బయటకు పొక్కకుండా గోప్యత

అధికారుల తీరుపై అనుమానాలు


అశ్వారావుపేట/దమ్మపేట, అక్టోబర్‌ 21: బ్యాంకు డిపాజిట్‌ నకిలీ రశీదులు సృష్టించి ఓ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రూ.8.38 లక్షలు కాజేశాడు. ఈ సంఘటన అప్పారావుపేట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయిల్‌ఫెడ్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆడిట్‌లో ఏడాది తరువాత ఈ సంఘటన వెలుగుచూడటం గమనార్హం. దమ్మపేట మండలంలోని అప్పారావుపేట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలో నీరకుండ బుచ్చిబాబు అనే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అకౌంట్‌ విభాగంలో సహాయకుడిగా పని చేస్తున్నాడు. గత ఏడాది డిసెంబరులో బ్యాంకులో జమ చేసినట్టు నకిలీ రశీదులను సృష్టించి ఆయిల్‌ఫెడ్‌కు సంబంధించిన రూ.8.38 లక్షలను కాజేశాడు. కొద్ది రోజుల క్రితం ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆడిట్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ రశీదులు సృష్టించి లెక్కల్లో చూపిస్తే ఎందుకు గుర్తించలేదంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్థానిక అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అధికారులు చెప్పినట్టు అతి నమ్మకంపైన జరిగిందా మరేదైనా కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అ వుతున్నాయి. ఈ సంఘటన జరిగి వారం కావస్తున్నప్పటికీ గోప్యంగా ఉంచడం గమనార్హం. దీనిపై అప్పారావుపేట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇప్పటికే సొమ్మును రికవరీ చేశామని, ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించి, దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-10-22T07:13:26+05:30 IST