నూనె నిల్‌... టేస్ట్‌ ఫుల్‌!

ABN , First Publish Date - 2020-08-29T05:30:00+05:30 IST

వంటలో నూనె తక్కువ వాడాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ ఆయిల్‌ ఫ్రై చేస్తేనే

నూనె నిల్‌... టేస్ట్‌ ఫుల్‌!

వంటలో నూనె తక్కువ వాడాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ ఆయిల్‌ ఫ్రై చేస్తేనే 

కూర రుచిగా ఉంటుంది అనుకుంటారు చాలామంది. అయితే ఒక్క చుక్క నూనె

 వేయకుండానే  పోహా కట్‌లెట్‌, చికెన్‌ మసాలా కర్రీ, ఫిష్‌ కర్రీ, ఆలూ బాల్స్‌, పనీర్‌ టిక్కా  వంటి రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. ఈ టేస్టీ రుచులను మీరూ ట్రై చేయండి.






చికెన్‌ మసాలా కర్రీ

కావలసినవి

చికెన్‌ - అరకేజీ, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - మూడు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, వెనిగర్‌ - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి - రెండు టీస్పూన్లు, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, పెరుగు - పావుకేజీ, సిమ్లామిర్చి పొడి - అర టీస్పూన్‌, కొత్తిమీర - కొద్దిగా. 

తయారీ

 చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగిన ఉల్లిపాయలు వేసి కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టాలి.

 తరువాత మరొక పాత్రలో పెరుగు తీసుకుని అందులో పచ్చిమిర్చి, వెనిగర్‌, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరంమసాలా, సిమ్లా మిర్చి పొడి వేసి బాగా కలపాలి.

 ఇప్పుడు పెరుగు మిశ్రమాన్ని చికెన్‌ ముక్కలపై పోయాలి.

 స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక చికెన్‌ వేసి వేగించాలి. మసాలా ముక్కలకు బాగా పట్టుకునే వరకు వేగించుకోవాలి.

 తగినంత ఉప్పు వేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.





ఫిష్‌ కర్రీ

కావలసినవి

చేపలు - అరకేజీ, చింతపండు రసం - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటోలు - రెండు, కొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, పసుపు - ఒక టీస్పూన్‌, కారం - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, కరివేపాకు - కొద్దిగా. 


తయారీ

 చేప ముక్కలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి.

 తరువాత ఆ పాత్రలో చింతపండు రసం పోసి కాసేపు పక్కన పెట్టుకోవాలి.

 తరిగిన ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు వేయాలి. 

 కొబ్బరి తురుము, పసుపు వేసి కలపాలి. పచ్చిమిర్చి వేయాలి. కొద్దిగా నీళ్లు పోయాలి.

 ఇప్పుడు ఆ పాత్రను స్టవ్‌పై పెట్టి ఉడికించాలి.

 మిశ్రమం వేడెక్కిన తరువాత పసుపు, కారం, తగినంత ఉప్పు వేయాలి.

 కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలియబెట్టి ఉడికించాలి. 

 చేప ముక్కలు ఉడికిన తరువాత దింపి వేడివేడిగా వడ్డించాలి.





పనీర్‌ టిక్కా

కావలసినవి

పనీర్‌ - అరకేజీ, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిర్చి - రెండు, పెరుగు - పావు కప్పు, తెల్లనువ్వులు - పావు కప్పు, నిమ్మకాయ - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి. 


తయారీ

 ఓవెన్‌ను 204 డిగ్రీల సెల్సియస్‌కు ప్రీ హీట్‌ చేసుకోవాలి.

 నువ్వులను వేగించి పక్కన పెట్టుకోవాలి.

 పనీర్‌ చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని ఒక పాన్‌లోకి తీసుకోవాలి.

 తరువాత అందులో పెరుగు, నువ్వులు, అల్లంవెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.

 ఇప్పుడు ప్రీ హీట్‌ చేసుకున్న ఓవెన్‌లో పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి. 

 నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్‌ చేయాలి.




ఆలూ బాల్స్‌

కావలసినవి

బంగాళదుంపలు - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, పసుపు - కొద్దిగా, కారం - పావు టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట. 


తయారీ

 ముందుగా బంగాళదుంపలు ఉడికించి, పొట్టు తీసి గుజ్జుగా చేసి పెట్టుకోవాలి.

 తరువాత అందులో పచ్చిమిర్చి, పసుపు, కారం, గరంమసాల, జీలకర్ర పొడి, బియ్యప్పిండి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి.

 ఇప్పుడు అర చేతులకు కొద్దిగా నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ బాల్స్‌లా చేసుకోవాలి.

 ఈ బాల్స్‌ను పొంగణాల పాన్‌లో వేసి మూత పెట్టి ఉడికించాలి. కాసేపయ్యాక బాల్స్‌ను తిప్పుకొని రెండో వైపు ఉడికించాలి.

 వీటిని చట్నీతో తింటే టేస్టీగా ఉంటాయి.




పోహా కట్‌లెట్‌

కావలసినవి

అటుకులు - ఒక కప్పు, నీళ్లు, అరకప్పు, బంగాళదుంపలు - రెండు, పెరుగు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్‌, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత.


తయారీ

 బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి గుజ్జుగా చేసుకోవాలి.

 ఒక పాత్రలో అటుకులు తీసుకొని అందులో అరకప్పు నీళ్లు పోయాలి. కొద్దిసేపు అటుకులను నానబెట్టాలి.

 తరువాత అందులో ఉడకబెట్టిన బంగాళదుంపల గుజ్జు వేసి కలియబెట్టాలి.

 పెరుగు, తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలపాలి. 

 ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ కట్‌లెట్స్‌గా చేసుకోవాలి.

 స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక కట్‌లెట్స్‌ వేసి మూత పెట్టి ఉడికించాలి. 

ఠి కాసేపు ఉడికిన తరువాత మరోవైపు తిప్పాలి. రెండు వైపులా బాగా కాలిన తరువాత వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.


Updated Date - 2020-08-29T05:30:00+05:30 IST