5 జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ కర్మాగారాలు

ABN , First Publish Date - 2021-07-31T08:27:07+05:30 IST

వరి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటల సాగు నుంచి మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటల సాగు దిశగా రైతులను మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు ఓ భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. మూడేళ్లలో

5 జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ కర్మాగారాలు

సిద్దిపేట, జనగామ, గద్వాల, నారాయణపేట, మహబూబాబాద్‌లో.. 

ప్రభుత్వ స్థలం ఉన్న చోట నిర్మాణం

జాతీయ బ్యాంకుల నుంచి రుణం

యూనిట్‌కు 100 కోట్ల వ్యయం

30 టన్నుల సామర్థ్యంతో యంత్రాలు

తర్వాత 60  టన్నులకు పెంపు..

ఎకరం సాగుకు 1.25 లక్షల రుణం


హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వరి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటల సాగు నుంచి మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటల సాగు దిశగా రైతులను మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర  ప్రభుత్వం, ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు ఓ భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. మూడేళ్లలో 20 లక్షల ఎకరాలకు సాగువిస్తీర్ణాన్ని తీసుకెళ్లాలని, ఎకరానికి రూ. 36 వేల చొప్పున రైతులకు రాయితీ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఐదు జిల్లాలు.. సిద్దిపేట, జనగామ, గద్వాల, నారాయణపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ కర్మాగారాలు నిర్మించేందుకు తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ రంగంలోకి దిగింది.  కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఇప్పటికే ఒక్కో కర్మాగారం ఉంది. ఏ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడే కర్మాగారాలు నిర్మించాలని, నర్సరీ పెంచాలని ఆయిల్‌ఫెడ్‌ నిర్ణయం తీసుకొంది. గద్వాలలో మాత్రం బీచుపల్లి పల్లినూనె కర్మాగారం ప్రాంగణంలోనే నిర్మించనున్నారు. ఒక్కో  కర్మాగారం నిర్మాణానికి రూ. 100 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు.


తొలుత 30 టన్నుల సామర్థ్యం ఉన్న యంత్రాలను ఏర్పాటుచేసి, తర్వాత 60  టన్నుల సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించారు. కర్మాగారాల నిర్మాణానికి ఎన్‌సీడీసీ, ఇతర జాతీయ బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలని, బ్యాంకు డిపాజిట్లను వినియోగించుకోవాలని ఆయిల్‌ ఫెడ్‌ నిర్ణయించింది. ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులను ప్రోత్సహించటానికి ఎకరానికి తొలి ఏడాది రూ. 26 వేలు, రెండో ఏడాది రూ. 5 వేలు, మూడో ఏడాది రూ. 5 వేలు కలిపి మూడేళ్లలో రూ. 36 వేల రాయితీని డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికితోడు ఎకరం సాగుకయ్యే రూ. 1.25 లక్షలను బ్యాంకు రుణంగా ఇవ్వనున్నట్లు ఎస్‌ఎల్‌బీసీ ప్రకటించింది. రాష్ట్రంలో 25 జిల్లాల్లో పంటసాగుకు అనువైన వాతావరణం ఉందని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘నేషనల్‌ రీ అసెస్మెంట్‌ కమిటీ’ సర్వే తేల్చింది. 8,14,270 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు అనుమతిచ్చింది.  అయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం ఏకబిగిన లక్షల ఎకరాలు పెంచటం సాధ్యంకాదు. నర్సరీ పెరగటానికి ఏడాది పడుతుంది. మూడేళ్ల సంరక్షణ తర్వాత నాలుగో ఏడాది దిగుబడి మొదలవుతుంది.  సీఎం కేసీఆర్‌ ఉద్యాన- వ్యవసాయశాఖలకు, ఆయిల్‌ఫెడ్‌కు, ప్రైవేటు కంపెనీలకు భారీ లక్ష్యాన్ని విధించారు. మూడేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుచేయించాలని కొత్త ప్రణాళిక తయారుచేయించారు.

Updated Date - 2021-07-31T08:27:07+05:30 IST