నూనె చల్లారింది!

ABN , First Publish Date - 2021-06-19T06:22:40+05:30 IST

ఎట్టకేలకు వంటనూనె ధరలు తగ్గుముఖం పట్టా యి. గత వారం రోజుల నుంచి నెమ్మదిగా కిందకి దిగి వస్తున్నాయి.

నూనె చల్లారింది!

తగ్గుముఖం పట్టిన వంటనూనె ధరలు
ఊపిరి పీల్చుకుంటున్న వినియోగదారులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ఎట్టకేలకు వంటనూనె ధరలు తగ్గుముఖం పట్టా యి. గత వారం రోజుల నుంచి నెమ్మదిగా కిందకి దిగి వస్తున్నాయి. కొద్ది నెలల నుంచి వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయం గా ధరలు పెరిగాయనే కారణంతో కొంతకాలం నుంచి విపరీతంగా ధరలు పెంచేశారు. కొన్ని రకాల ఆయిల్స్‌ పై వందశాతం కూడా ధరలు పెరిగాయి. ఈనెల మొదటి వారంలో పామాయిల్‌ ధర లీటరు రూ.135 ఉండగా ప్రస్తుతం అది రూ.117కు తగ్గింది. సన్‌ఫ్లవర్‌ రూ.170 నుంచి రూ.153కు తగ్గింది. రైసుబ్రాన్‌ ఆయిల్‌ నంబర్‌-1 రకం ఏకంగా రూ.174కు పెరిగి నేడు అది రూ.154కు వచ్చింది. అందులో తక్కువ రకం రూ.154 ఉండేది. ప్రస్తుతం దీని ధర రూ.134 ఉంది. వేరుశనగ నూనె రూ.200 వరకు పెరిగింది. అది క్రమంగా తగ్గి రూ.155కు చేరింది. కానీ గతేడాది ధరలతో పోలిస్తే ఇవి పెద్దగా తగ్గినట్టు కాదు. కొద్దినెలల కిందట సన్‌ఫ్లవర్‌ లీటరు రూ.95 ఉండేది. అది రూ.180 వరకు పెరిగింది. ఇప్పుడు రూ.153 ఉంది. వేరుశనగనూనె గతంలో రూ.100- రూ.110 మధ్య ఉండేది. అది రూ.200 వరకు పెరిగింది. ఇవాళ బాగా తగ్గి రూ.155కు చేరింది. ఇంకా తగ్గితేనే ఈ ధరలు సాధారణ స్థితికి చేరుకున్నట్టు. ప్రస్తుత తగ్గుదలకు రకరకాల కారణాలు చెబుతున్నా రు. కరోనా వల్ల దుకాణాలు మూసివేయడంతో ఆహా రపు అమ్మకాలు తగ్గిపోయి ఆయిల్‌ ధరలు తగ్గాయని వ్యాపారులు కొందరు చెబుతున్నారు. కానీ గతేడాది మార్చి నుంచి కరోనా విజృంభించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ధరలు తక్కువగా ఉన్నాయి. కరోనా సమయం లోనే విపరీతంగా పెంచేశారు. చాలాకాలం లాక్‌డౌన్‌ కూడా ఉంది. అయినా అప్పట్లో ధరలు పెంచారు. దీంతో కరోనా కారణం కాదనే వాదనా ఉంది. అంతర్జాతీయంగా కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక కేంద్ర బడ్జెట్‌లో వంటనూనెల దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించింది. అది ప్రస్తుతం అమలులోకి రానుంది. ఈ నేపఽథ్యంలో ధరలు మరింత తగ్గుతాయి. కానీ వ్యవసాయ సెస్‌ పెంచిందని, కొత్తగా వసూలు చేస్తున్నారని దానివల్ల దిగుమతి సుంకం తగ్గించినా పెద్దగా ఫలితం లేదనేది వ్యాపారుల వాదన. కానీ ఇటీవల కేంద్ర ఆహార శాఖ 20 శాతం వరకు ధరలు తగ్గినట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ధరల తగ్గింపు ప్రజలకు కొంత ఊరటే. ప్రస్తుతం విదేశాల్లో వంట నూనెలకు సంబంధించిన పంటలు అందుబాటులోకి రావడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. ఇక పప్పునూనె ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో రూ.300 పైగా ధర పలికిన ఈ నూనె రూ.280కి దిగింది. ఇలా అన్ని రకాల వంటనూనెల ధరలు కొంతమేర తగ్గడం ప్రజలకు ఊరటే.


Updated Date - 2021-06-19T06:22:40+05:30 IST