సర్వేతోనే సరి..

ABN , First Publish Date - 2022-05-02T06:34:59+05:30 IST

మున్సిపాల్టీల్లో నిరక్షరాస్యుల నిష్పత్తిని తగ్గించడానికి ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు.

సర్వేతోనే సరి..

- మున్సిపాలిటీల్లో నిరక్షరాస్యులను గుర్తించినా చర్యలు శూన్యం

- రెండేళ్లు గడిచినా పత్తాలేని బోధన కేంద్రాలు

- జిల్లాలో 14 వేలకు పైగా నిరక్షరాస్యులు


జగిత్యాల, మే 1 (ఆంధ్రజ్యోతి): మున్సిపాల్టీల్లో నిరక్షరాస్యుల నిష్పత్తిని తగ్గించడానికి ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. అక్షరాస్యత సాధించడం వల్ల బహుళ ప్రయోజనాలు సాధించవచ్చన్న సంకల్పంతో ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ లక్ష్యం మేరకు పూర్తి కావడం లేదు. ఫలితంగా పట్టణాల్లో నిరక్షరాస్యుల సంఖ్య తగ్గడం లేదు. జగిత్యాల జిల్లాలోని మున్సిపాల్టీల్లో నిరక్షరాస్యుల సంఖ్య తేలినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలోని మున్సిపాల్టీల్లో రెండేళ్ల కిందట ప్రారంభమైన పట్టణ ప్రగతి కార్యక్రమంలో నిరక్షరాస్యుల గుర్తింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మున్సిపాల్టీల్లో మెప్మా ఆధ్వర్యంలో చేపట్టిన సర్వే కేవలం కాగితాలకే పరిమితమైంది. 

- 60.26 శాతం అక్షరాస్యత..

జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాల్టీలున్నాయి. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి పట్టణాలు మున్సిపల్‌ కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9,85,417 ఉండగా ఇందులో 4,84,079 పురుషులు, 5,01,338 మహిళలున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలో 10,19,045 జనాభా ఉంది.  జిల్లాలో అక్షరాస్యులు 5,37,636 ఉండగా 3,07,947 మంది పురుషులు, 2,29,689 మంది మహిళలున్నారు. జిల్లా అక్షరాస్యత శాతం 60.26గా ఉంది. 

  - తొలి పట్టణ ప్రగతిలో సర్వే...

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన తొలి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో నిరక్షరాస్యులను గుర్తించడానికి సర్వే జరిపారు. మెప్మా రీసోర్స్‌పర్సన్‌లు ఇంటింటికి తిరిగి 18 ఏళ్ల పైబడిన వారిలో నిరక్షరాస్యులను గుర్తించేందుకు తొలిసారి సర్వే చేపట్టారు. 2020 ఫిబవ్రరి 26వ తేదీ నుంచి పది రోజుల పాటు జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో సర్వే జరిపారు. ప్రతీ రోజు 50 ఇళ్ల చొప్పున వివరాలు సేకరించారు. పట్టణాల్లో కచ్చితమైన నిరక్షరాస్యుల సంఖ్యను మెప్మా ఆర్పీలు సేకరించారు.

- పట్టణాల్లో 14,176 మంది నిరక్షరాస్యులు..

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో కలిపి 134 వార్డుల్లో 77,507 ఇళ్ళలో సర్వే జరిపి 14,176 మంది నిరక్షరాస్యులున్నట్లు మెప్మా రీసోర్స్‌పర్సన్‌లు జరిపిన సర్వేలో గుర్తించారు. ఇందులో జగిత్యాల మున్సిపల్‌లో 5,770 మంది,  కోరుట్లలో 3,607 మంది, మెట్‌పల్లిలో 3,304 మంది, ధర్మపురిలో 837 మంది, రాయికల్‌లో 658 మంది నిరక్షరాస్యులున్నట్లు సర్వేలో  మెప్మా రీసోర్స్‌పర్సన్‌లు గుర్తించారు.

- మూడు పద్ధతులు అనుకున్నా...

జిల్లాలోని మున్సిపాల్టీల్లో జరిపిన సర్వేలో నిరక్షరాస్యులను గుర్తించిన తదుపరి నివారణకు పలు పద్ధతులు పాటించాలని భావించారు. నిరక్షరాస్యులు గల వ్యక్తుల ఇళ్లలో విద్యావంతులే చదువురాని కుటుంబ సభ్యులకు ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌ పద్ధతిలో చదువు చెప్పాలని అనుకున్నారు. నిర్దేశిత గడువులోపు అక్షరాస్యుడిని చేయాలి. లేదంటే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఒక్కో వార్డులో నిరక్షరాస్యుల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక విద్యాబోధన కేంద్రాలు ప్రారంభించాలి. వయోజన విద్యా కేంద్రాలైనైనా తెరిపించాలి. ఈ మూడు ప్రక్రియలో ఏదో ఒకటి అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. పట్టణ ప్రగతి కార్యక్రమలో నిరక్షరాస్యుల గుర్తింపు సర్వే జరిగి రెండేళ్లు గడిచినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంచి ఉద్దేశంతోనే ప్రభుత్వం పట్టణ ప్రగతి కింద నిరక్షరాస్యుల సర్వే చేపట్టిందని, సర్వే నివేదికలు ప్రభుత్వానికి పంపించామని, తదుపరి ఏమి చేయాలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని మెప్మా వర్గాలు అంటున్నాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అక్షరాస్యతను పెంపొందించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మెప్మా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 


Updated Date - 2022-05-02T06:34:59+05:30 IST