త్వరలో... ఐపీఓకు ఓలా...

ABN , First Publish Date - 2021-12-04T02:49:49+05:30 IST

క్యాబ్‌ రైడ్స్ కంపెనీ ఓలా... వచ్చే ఏడాది మొదటి అర్ధభాగంలో ఐపీఓకు రానున్న సూచనలు కనిపిస్తున్నాయి.

త్వరలో... ఐపీఓకు ఓలా...

హైదరాబాద్ : క్యాబ్‌ రైడ్స్ కంపెనీ ఓలా... వచ్చే ఏడాది మొదటి అర్ధభాగంలో ఐపీఓకు రానున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలోని కొన్ని స్టార్టప్‌లు భారీ అస్థిరతలో ఉండడం, మరికొన్ని  పేలవంగా లిస్టయినా... తాము మాత్రం ముందడుగే వేస్తామని ఈ కంపెనీ ఇండికేషన్స్ ఇస్తోంది. అంతేకాదు... తన బిజినెస్‌ పోర్ట్‌ఫోలియోలోకి పర్సనల్‌ ఫైనాన్స్, మైక్రో ఇన్సూరెన్స్‌లను చేర్చడానికి కూడా కంపెనీ సిద్ధమవుతోంది. ఇందుకోసం "సూపర్ యాప్"ను వేగంగా రూపొందిస్తోంది. దశాబ్దం క్రితం... అంటే... 2010 లో ఓలా ప్రారంభమైంది. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూపునుకు ఓలాలో పెట్టుబడులున్న విషయం తెలిసిందే. 


ఇండియన్‌ క్యాబ్‌ రైడింగ్స్‌ మార్కెట్‌లో పోటీ సంస్థ ఉబెర్ ఉన్నప్పటికీ... ప్రధాన భాగం మాత్రం ఓలాదే. కాగా... ఐపీఓ ద్వారా ఈ కంపెనీ ఒక బిలియన్ డాలర్లను(సుమారు రూ. 7,500 కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వినవస్తోంది. కాగా... కొవిడ్ ఆంక్షల సమయంలో ఓలా వ్యాపారం దెబ్బతింది. అయితే...  ఇటీవలి నెలల్లో పుంజుకున్న ఫైనాన్షియల్స్‌‌ను... మరింత  మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. 


భారీ, బ్రాడ్‌-బేస్డ్‌ మొబిలిటీ ఫ్లాట్‌ఫాంగా ఉండాలన్నది తమ లక్ష్యంగా ఓలా చెప్పింది. కంపెనీకి ఉన్న దాదాపు 150 మిలియన్ల మంది యూజర్లు కొత్త, పాత కార్లను కొనుగోలు చేయడానికి, అమ్మడానికి, వాహన ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌ పొందడానికి ఓలా యాప్‌ ఇప్పటికీ వీలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా... విద్యుత్తు స్కూటర్ల తయారీలో జాప్యానికి చిప్‌ కొరతే కారణమని ఓలా కంపెనీ వెల్లడించింది. 

Updated Date - 2021-12-04T02:49:49+05:30 IST