సర్జ్‌ప్రైస్‌ 1.5 రెట్లు దాటొద్దు

ABN , First Publish Date - 2020-11-28T07:15:31+05:30 IST

ఇక నుంచి ఉబెర్‌, ఓలా వంటి యాప్‌ ఆధారిత ట్యాక్సీ అగ్రిగేటర్లు డిమాండ్‌ అధికంగా ఉన్నప్పుడు ఏకపక్షంగా ధరలను పెంచే అవకాశం ఉండదు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన మోటార్‌ వెహికిల్‌ అగ్రిగేటర్‌ మార్గదర్శకాలు 2020 ప్రకారం..

సర్జ్‌ప్రైస్‌ 1.5 రెట్లు దాటొద్దు

ఓలా, ఉబెర్‌ క్యాబ్స్‌ చార్జీల వసూలుపై పరిమితి

సర్వీసులు నడిపేందుకు లైసెన్స్‌ తప్పనిసరి

మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం 


న్యూఢిల్లీ, నవంబరు 27: ఇక నుంచి ఉబెర్‌, ఓలా వంటి యాప్‌ ఆధారిత ట్యాక్సీ అగ్రిగేటర్లు డిమాండ్‌ అధికంగా ఉన్నప్పుడు ఏకపక్షంగా ధరలను పెంచే అవకాశం ఉండదు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన మోటార్‌ వెహికిల్‌ అగ్రిగేటర్‌ మార్గదర్శకాలు 2020 ప్రకారం.. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన బేస్‌ సిటీ టాక్సీ చార్జీపై గరిష్ఠంగా 1.5 రెట్లు సర్జ్‌ప్రైస్‌ (డిమాండ్‌ను సర్జ్‌ప్రైస్‌ 1.5 రెట్లు దాటొద్దు బట్టి పెరిగే ధర)ను అగ్రిగేటర్‌ వసూలు చేయడానికి అనుమతిస్తారు. నాన్‌ పీక్‌ హవర్స్‌లో బేస్‌ ధరకన్నా 50 శాతం వరకు తక్కువ చార్జీని వసూలు చేసేందుకు అనుమతిస్తారు. సిటీ టాక్సీ ధరను నిర్ణయించని రాష్ట్రాల్లో రూ.25-30 బేస్‌ ధరగా పరిగణిస్తారు. తాజా మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ పొందని అగ్రిగేటర్లు వ్యాపారం నిర్వహించేందుకు అనుమతించరు. లైసెన్స్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.


లైసెన్స్‌ను రద్దు కూడా చేసే అవకాశం ఉంటుంది. లైసెన్స్‌ పొందడానికి దరఖాస్తుదారు కంపెనీల చట్టం 1956 లేదా 2013 లేదా కో ఆపరేటివ్‌ సొసైటీస్‌ యాక్ట్‌ 1912 పరిధిలోని కోఆపరేటివ్‌ సొసైటీ కింద రిజిస్టర్‌ కావాలి. లైసెన్స్‌ ఫీజును రూ.ఐదు లక్షలుగా నిర్ణయించారు. దీని కాలపరిమితి ఐదేళ్లు. అగ్రిగేటర్లు కచ్చితంగా భద్రతా ప్రొటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా డ్రైవర్‌ బుకింగ్‌ను రద్దు చేస్తే మొత్తం ధరలో 10 శాతం(రూ.100 మించకుండా) జరిమానా విధిస్తారు. రైడర్‌ బుకింగ్‌ను రద్దు చేసినా ఇదే విధంగా జరిమానా విధిస్తారు. షేర్డ్‌ మొబిలిటీని నియంత్రించడమేకాకుండా రద్దీ, కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభు త్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అగ్రిగేటర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూసేందుకు అవసరమైన నియంత్రణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసేలా మార్గదర్శకాలున్నాయి. మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Updated Date - 2020-11-28T07:15:31+05:30 IST