అనాథలా అమ్మ

ABN , First Publish Date - 2021-06-24T05:02:40+05:30 IST

వృద్ధాప్యంలో ఉన్న తల్లి కొడుకులకు భారమైంది.

అనాథలా అమ్మ
కలెక్టరేట్‌ వద్ద వృద్ధురాలు

కొడుకులు వదిలేశారు

మనువడి దాడి

కలెక్టరేట్‌ వద్ద వృద్ధురాలి నిరసన


ఏలూరు కలెక్టరేట్‌, జూన్‌ 23: వృద్ధాప్యంలో ఉన్న తల్లి కొడుకులకు భారమైంది. ఇద్దరు కొడుకులున్నా ఒంటరిగా జీవ నం సాగిస్తోంది. మనవడు వృద్ధురాలిపై దాడి చేసి నగదు, వెండి వస్తువులతో పరారయ్యాడు. వృద్ధాప్యంలో పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. పట్టించుకోని కొడుకులు. దాడిచేసిన మనవడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్‌లో గాంధీ విగ్రహం వద్ద వృద్ధురాలు నిరసన చేపట్టింది.


చింతలపూడి మండలం సీతానగరం గ్రామానికి చెందిన కక్కిరాల సీతా మహాలక్ష్మి (75) భర్త 2004లో మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కొడుకులున్నా ఒకరు సీతానగరం, మరొకరు విజయవాడలో ఉంటున్నారు. తల్లిని ఎవరూ పట్టించుకోకపోవడంతో అనాథగా జీవిస్తోంది. వయోభారంతో జ్ఞాపకశక్తి తగ్గి, సరిగ్గా మాట్లాడలేక, నడవలేక అవస్థలు పడుతోంది. మనవడు ఐదు నెలల క్రితం ఇంట్లో చొరబడి 20 కాసుల బంగారం, వెండి పట్టుకు పోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. వృద్ధాప్య పింఛన్‌, రేషన్‌ బియ్యంతో కాలం గడుపుతున్నానని జరిగిన ఘటనపై చింతలపూడి, జంగారెడ్డిగూడెంలో పోలీసు ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా న్యాయం చేయలేదని వాపోయింది. ఐదు నెలలుగా న్యాయం కోసం పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో కలెక్టర్‌కు విన్నవిద్దామని కలెక్టరేట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తూ బోరున విలపించింది.

Updated Date - 2021-06-24T05:02:40+05:30 IST