బాబోయ్‌ పాత భవనాలు

ABN , First Publish Date - 2020-11-30T06:47:32+05:30 IST

పట్టణంలో పురాతన భవనాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. దశాబ్దాల క్రితం బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన ఈ భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలిపోతాయోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

బాబోయ్‌ పాత భవనాలు
పురాతనమైన వర్తక సంఘం భవనం

పట్టణంలో 153 శిథిలావస్థ కట్టడాలు

ఖాళీ చేసి, కూల్చివేయాలని యజమానులకు ఆదేశాలు

నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న జీవీఎంసీ అధికారులు


అనకాపల్లి, నవంబరు 29: పట్టణంలో పురాతన భవనాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. దశాబ్దాల క్రితం బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన ఈ భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలిపోతాయోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆయా భవనాల్లో వుంటున్న వారిని ఖాళీ చేయించి, వాటిని కూల్చివేయాలని జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ప్రత్యామ్నాయ నివాసాలు లేక కొంతమంది, అద్దె డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో మరికొంతమంది వీటని ఖాళీ చేయడంలేదు. మరోవైపు కొంతమంది భవన యజమానులు కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారు.  


పట్టణంలో శిథిలావస్థకు చేరుకుని నివాసయోగ్యం లేని 153 భవనాలను జీవీఎంసీ అధికారులు గతంలోనే గుర్తించారు. వాటిని ఖాళీ చేసి, కూల్చివేయాలని ఆయా యజమానులకు నోటీసులు జారీ చేశారు. నాయుళ్ల వీధి, ఉడ్‌పేట, ముత్యంవారి వీధి, రావుగోపాలరావు స్టేడియం రోడ్డు, బాలాజీరావుపేట, గవరపాలెం, గాంధీబొమ్మ జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో ఈ భవనాలు ఉన్నాయి. కానీ వివిధ కారణాల వల్ల ఆయా యజమానులు వీటిని ఖాళా చేయడంలేదు. జీవీఎంసీ అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. దీంతో వర్షాకాలంలో పురాతన భవనాలు నానిపోయి, కూలిపోతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు గాయపడుతున్నారు నూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారిలో పదేళ్ల క్రితం పురాతన గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆదివారం కూలిపోయిన వ్యాపార సముదాయ భవనం కూడా కూల్చివేత జాబితాలో వుంది. అయితే వ్యాపారుల్లో ఒకరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో కూల్చివేయలేకపోయామని అధికారులు చెబుతున్నారు.


Updated Date - 2020-11-30T06:47:32+05:30 IST