పొలం అమ్మి హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనిస్తే.. తల్లిదండ్రులను అడుక్కు తినేలా చేసిన కొడుకు..!

ABN , First Publish Date - 2020-09-24T18:51:39+05:30 IST

ఆ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. చిన్నప్పటి నుంచి అతడిని అల్లారుముద్దుగా పెంచారు. ఏదడిగినా కాదనకుండా కొనిచ్చారు. ఉన్న ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ దర్జాగా బతికిన ఆ వృద్ధ దంపతులకు.. కొడుకు పెళ్లైన తర్వాత కష్టాలు మొదలయ్యాయి.

పొలం అమ్మి హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనిస్తే.. తల్లిదండ్రులను అడుక్కు తినేలా చేసిన కొడుకు..!

తల్లిదండ్రులను వెళ్లగొట్టిన కొడుకు.. అత్తామామను ఆదరించని కోడలు

ఆస్తినంతా లాక్కుని.. పుస్తెల తాడూ తీసుకున్నారు

అన్నం పెట్టకుండా కడుపుమాడ్చారు

సొంతూరిలో అడుక్కుతింటున్న వృద్ధ దంపతులు

న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు తల్లిదండ్రులు


రామాయంపేట(మెదక్): ఆ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. చిన్నప్పటి నుంచి అతడిని అల్లారుముద్దుగా పెంచారు. ఏదడిగినా కాదనకుండా కొనిచ్చారు. ఉన్న ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ దర్జాగా బతికిన ఆ వృద్ధ దంపతులకు.. కొడుకు పెళ్లైన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. అత్తామామలను ఆదరించి అభిమానంగా చూడాల్సిన ఆ ఇంటి కోడలు.. కొట్లాటలకు తెరలేపింది. చివరికి కన్నతల్లిదండ్రులనే ఇంటి నుంచి వెళ్లగొట్టాడా కర్కోటక కొడుకు. ఇప్పుడు సొంతూరిలోనే ఇంటా ఇంటా అన్నం అడుక్కుని తింటూ కాలం వెళ్లదీస్తున్న దీనస్థితి ఆ దంపతులది. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామానికి చెందిన నాగయ్య, అంజమ్మ దంపతులకు రాజు ఒక్కడే సంతానం. అతడి వివాహం అయ్యాక ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఆస్తి అమ్మాలంటూ కోడలు తరచూ అత్తా, మామ, భర్తతో ఘర్షణ పడేది. ఆ బాధ భరించలేక ఆ దంపతులు ఊరిలోని పొలం, ఇల్లును అమ్మారు. 


ఆ డబ్బుతో హైదరాబాద్‌లో కొడుకుకు ఓ ఇల్లు కొనిచ్చారు. 15 నెలలుగా వారు కూడా కొడ్డుకు వద్దే ఉంటున్నారు. కానీ కొడుకు, కోడలు వారిని ఆదరించేవారు కాదు. సమయానికి అన్నం కూడా పెట్టకుండా కడుపు మాడ్చేవారు. వారిని ఈసడించుకునేవారు. పైగా తమకు అప్పులు పెరిగాయంటూ.. డబ్బు అవసరముందంటూ రాజు తన తల్లి మెడలోని పుస్తెల తాడును కూడా తీసుకున్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ కోడలు అత్తామామలపై చేయి చేసుకునేది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండలేక 4 నెలల క్రితం నాగయ్య, అంజమ్మ సొంత గ్రామం ధర్మారం చేరుకున్నారు. ఊరిలో ఉండడానికి ఇల్లు లేకపోవడంతో రోడ్డు పక్కనే అడ్డుగా ఓ చీరను కట్టి అందులో తల దాచుకుంటున్నారు. వారువీరు పెట్టిన అన్నం తింటూ ఆకలి తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం నాగయ్య నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం గ్రామ పెద్దలు కల్పించుకుని రామాయం పోలీస్‌స్టేషన్‌లో ఆ దంపతులతో ఫిర్యాదు చేయించారు. ఆస్తిని తీసుకుని ఆలనా పాలనా చూసుకోకుండా తరిమేసిన కొడుకు, కోడలుపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. గురువారం కొడుకు, కోడలిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తామని ఎస్సై మహేందర్‌ తెలిపారు.

Updated Date - 2020-09-24T18:51:39+05:30 IST