వానాకాలంలో పాత రుచులు ఘనంగా..!

ABN , First Publish Date - 2021-06-12T05:30:00+05:30 IST

కాలానికి అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వర్షాకాలం ప్రారంభం అవుతోంది కాబట్టి

వానాకాలంలో పాత రుచులు ఘనంగా..!

కాలానికి అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వర్షాకాలం ప్రారంభం అవుతోంది కాబట్టి రోగనిరోధకశక్తిని పెంచే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలా అని కొత్త కొత్త వంటలు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మన పూర్వీకులు ఎక్కువగా తీసుకున్న ఆహారమే అది. కాకపోతే ఈ తరం వాటి వాడకం తగ్గించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి వాటిని మన మెనూలో భాగం చేసుకోవడం చాలా అవసరం. ఆ వంటల విశేషాలు ఇవి...


నీటి ఆవకాయ పచ్చడి


ఈ నీటి ఆవకాయ పచ్చడిని తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా తింటారు. ఇది మామూలుగా నూనె పోసి తయారుచేసే ఆవకాయ కన్నా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆవకాయ పచ్చడి వేడి చేయదు. వర్షాకాలంలో ప్రతిరోజు తీసుకోవడానికి ఇది తగిన ఆహారం. ఇందులో ఉండే ఆవపిండి, పసుపు, ఇంగువ, కారం వర్షాకాలంలో వచ్చే కఫ సంబంధమైన రోగాలను తగ్గించడమే కాకుండా ఈ కాలంలో వచ్చే డయేరియాను కూడా తగ్గిస్తుంది.

కావలసినవి

మామిడి ముక్కలు - 7 భాగాలు, ఆవపిండి - 2 భాగాలు, కారం - ఒక భాగం, దొడ్డు ఉప్పు - రుచికి తగినంత, పసుప, ఇంగువ.

తయారీ విధానం

ఈ ఆవకాయను కలుపుకోవడానికి పింగాణి జాడి లేదా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రను ఉపయోగించాలి. జాడీలో ఉప్పు, ఆవపిండి, కారం, పసుపు, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నీళ్లు పోసుకుంటూ దోసె పిండిలా జారుడుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమంలో మామిడికాయ ముక్కలు కలిపి తరువాత నువ్వుల నూనె లేదా వేరుశనగనూనె పలుచగా పోసుకోవాలి. ఈ ఆవకాయని మొదటి మూడు రోజులు రోజుకు రెండు సార్లు బాగా కలిపి పైన నూనె చిలకరించుకోవాలి. ప్రతిరోజు ఉప్పు సరిపోయిందో లేదో చెక్‌ చేసుకుంటూ అవసరమైతే కలుపుకోవాలి. మూడు రోజుల తరువాత జాడీలోకి గాలి చొరబడకుండా మూత బిగించి నిలువ చేసుకోవాలి. ఈ పచ్చడి సంవత్సరకాలం పాటు నిలువ ఉంటుంది.




చింతపండు చారు


ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి జీర్ణసంబంధ రోగాలు రాకుండా కాపాడుతుంది. విరోచనం గట్టిగా అవుతున్న వారు రసం రోజూ తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అన్నంలో కలుపుకొని తినడమే కాకుండా, విడిగా తాగొచ్చు. ఏ కారణం చేతైనా నీరస పడిన వారు ఈ చారును ఆహారంలో ఇవ్వడం వల్ల వెంటనే నీరసం తగ్గుతుంది. 

కావలసినవి

ఒక లీటర్‌ నీళ్లు, పెద్ద ఉసిరికాయంత పరిమాణంలో చింతపండు, పసుపు, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, బెల్లం, కరివేపాకు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర.

తయారీ విధానం

స్టవ్‌ ఒక పాత్రలో నీళ్లు పెట్టి మరిగిన తరువాత చింతపండు పులుసు, కరివేపాకు వేయాలి. మరికాసేపు మరిగించాలి. తరువాత పసుపు, ఇంగువ వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఒక్కొక్క టీస్పూన్‌ వేయాలి. మరో రెండు నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, బెల్లం వేసి దింపుకోవాలి. ఈ రసం తాలింపు కోసం పాత్రలో తగినంత నూనె వేసి వేడి అయ్యాక మెంతులు వేసి మాడనివ్వాలి. తరువాత ఎండుమిరపకాయలు, ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తరువాత జీలకర్రవేయాలి. ఈ తాలింపును చారులో కలుపుకోవాలి.




మజ్జిగ చారు

ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. మజ్జిగచారు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్స్‌ లభిస్తాయి. ఇందులో ఉండే పసుపు, ఇంగువ, ఆవపిండి, మెంతులు జీర్ణశక్తిని, రోగనిరోధకశక్తిని పెంచుతాయి. తద్వారా ఈ కాలంలో వచ్చే బ్యాక్టీరియల్‌, వైరల్‌, ప్రోటోజువల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి తట్టుకునే శక్తిని పొందవచ్చు.

కావలసినవి

మజ్జిగ - ఒక లీటరు, ఆవపిండి - ఒక స్పూను, పసుపు - ఒక టీస్పూను, ఇంగువ - అర టీస్పూను, పచ్చిమిరపకాయలు - నాలుగు, ఎండుమిరపకాయలు - రెండు, మెంతులు - ఒక టీస్పూను, ఆవాలు - ఒక టీస్పూను, జీలకర్ర - ఒక టీస్పూను, కరివేపాకు - కొద్దిగా, దొడ్డు ఉప్పు - తగినంత.

తయారీ విధానం

ఒక పాత్రలో కొద్దిగా మజ్జిగ తీసుకుని అందులో ఆవపిండి, పసుపు, ఇంగువ, ఉప్పు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కలపాలి. ఇలా కలిపిన మజ్జిగకు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్‌పై పాత్రను పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక మెంతులు, ఆవాలు వేయాలి. అవి వేగిన తరువాత జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. తరువాత కరివేపాకు వేసి తాలింపును మజ్జిగలో కలపాలి. నూనెలో వేయించిన సగ్గుబియ్యం కూడా కలుపుకోవచ్చు. ఉల్లిపాయలను ఇష్టపడే వారు పచ్చి ఉల్లిపాయను కూడా వేసుకోవచ్చు.




పులిహోర ప్రసాదం


తిరుమల వేంకటేశ్వర స్వామికి తయారుచేసే ప్రసాదాలు దిట్టంని ఆధారంగా చేసుకుని తయారుచేస్తారు. ఈ పులిహోర కూడా దిట్టంను అనుసరించి తయారు చేసేదే. ఇందులో పోషకాలు పుష్కలం. ఇందులో వేసే పసుపు, ఇంగువ, ధనియాల పొడి వల్ల వర్షాకాలంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 

కావలసినవి

బియ్యం, చింతపండు, పసుపు, ఇంగువ, ఆవపిండి, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, బెల్లం, నూనె, మెంతులు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నెయ్యి.

తయారీ విధానం

ముందుగా వార్చుకోవడానికి వీలుగా ఉన్న గిన్నెలో ఐదు లీటర్ల నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. తరువాత శుభ్రంగా కడిగిన బియ్యం వేయాలి. ఈ లోపు చింతపండును గిన్నెలో తీసుకుని, కొద్దిగా వేడి నీళ్లు పోసి, చిక్కటి పులుసు తీసి పెట్టుకోవాలి. పులిహోర కలుపుకొనే గిన్నెలో కరివేపాకు వేసుకోవాలి. బియ్యం పలుకు చూసి బాగా మెత్తగా అవ్వకుండా, కొంచెం బిరుసుగా ఉన్నప్పుడే అన్నం వార్చుకోవాలి. అన్నం రెడీ అయ్యాక కరివేపాకు వేసుకున్న గిన్నెలోకి మార్చుకోవాలి. ఒక చిన్న గిన్నెలో సరిపడా నూనె వేసుకుని అందులో పసుపు, ఇంగువ, ఆవపిండి వేసుకుని గడ్డలు లేకుండా బాగా కలిపి అన్నంకు పట్టించాలి. తరువాత కొంచెం నిమ్మరసం ఉప్పు కలిపి, ఉప్పు కరిగిన తరువాత అన్నంకు పట్టించాలి. తాలింపు కోసం స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె వేయాలి.


కాస్త వేడి అయ్యాక మెంతులు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తరువాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేయాలి. ఈ తాలింపును అన్నంలో కలుపుకోవాలి. నూనె పోయకుండా పాత్రలోనే ఉండనివ్వాలి. ఆ నూనెలో ధనియాల పొడి, మిరియాల పొడి వేయాలి. వెంటనే చింతపండు పులుసును పోయాలి. తరువాత కొద్దిగా పసుపు, ఇంగువ, ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. పులుసు మీద నూనె తేలి కొద్దిగా చిక్కబడిన తరువాత అన్నంలో కలుపుకోవాలి. చివర్లో కొద్దిగా నెయ్యి కలపాలి.



 ఎస్‌. వైష్ణవి 

చీరాల

ఫోన్‌ : 8639576731

Updated Date - 2021-06-12T05:30:00+05:30 IST