అంకుల్ అన్నందుకు అమ్మాయిని చితకబాదిన ఓ వ్యక్తి

ABN , First Publish Date - 2021-12-26T00:57:36+05:30 IST

ఇలాంటి సంఘటనే ఉత్తరాఖండ్‌లో తాజాగా జరిగింది. తనను అంకుల్ అని పిలించిందని 18 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఓ వ్యక్తి భౌతిక దాడికి దిగాడు. ఆ అమ్మాయిని ఇష్టారీతిన కొట్టాడు. బాలిక తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో ఆక్సీజన్ సహాయంతో చికిత్స పొందుతోంది..

అంకుల్ అన్నందుకు అమ్మాయిని చితకబాదిన ఓ వ్యక్తి

డెహ్రడూన్: తమ కన్నా వయసులో కొంచెం పెద్ద వారిని అన్నా/అక్కా అని పిలవడం, ఆ పెద్దరికం వయసు ఇంకొంచెం ఎక్కువైతే ఆంటీ, అంకుల్ అని పిలవడం సర్వసాధారమైపోయింది. అయితే తమను ఆంటీ/అంకుల్ అంటారా అని కోప్పడేవారు లేకపోలేదు. ఆంటీ/అంకుల్ అన్నారని గొడవ పడ్డ సంఘటనలు అనేకం ఉంటాయి. అయితే ఇలాంటి విషయాల్లో కొందరు మరింత సున్నితంగా ఉంటారు. వాదన నుంచి గొడవ భౌతికదాడుల వరకూ వెళ్తూ ఉంటుంది. ఇలాంటి సంఘటనే ఉత్తరాఖండ్‌లో తాజాగా జరిగింది. తనను అంకుల్ అని పిలించిందని 18 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఓ వ్యక్తి భౌతిక దాడికి దిగాడు. ఆ అమ్మాయిని ఇష్టారీతిన కొట్టాడు. బాలిక తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో ఆక్సీజన్ సహాయంతో చికిత్స పొందుతోంది.


ఉత్తరాఖండ్‌లోని సితర్‌గంజ్‌కి చెందిన ఒక బాలిక (18).. డిసెంబర్ 19న తన స్నేహితులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతోంది. అయితే ఇంతలో తన బ్యాడ్మింటన్‌ రాకెట్‌ వైర్లు కొన్ని ఊడిపోయాయి. అయితే ఆ రాకెట్‌ను ఎక్స్‌చేంజ్ చేయడానికి ఆమె మోహిత్ కుమార్ షాప్‌కి వెళ్లింది. మోహిత్‌ను అంకుల్ అని సంబోధించి విషయం చెప్పింది. అంతే, తనను అంకుల్ అన్నందుకు తీవ్ర కోపోద్రిక్తుడైన మోహిత్, సదరు బాలికను కిరాతకంగా కొట్టాడు. మోహిత్‌పై 323, 354, 506 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.


దీనికి కొద్ది రోజుల ముందు ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోదా జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. తన షాపులో దొంగతనానికి పాల్పడ్డాడని 16 ఏళ్ల బాలుడిని సదరు యజమాని అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై బెల్టుతో చితకబాదాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు షాపు యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2021-12-26T00:57:36+05:30 IST