పెన్షన్ కోసం వృద్ధుడి శవాన్ని పోస్టాఫీసుకి తీసుకెళ్లిన యువకులు.. అక్కడ వారిద్దరూ ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-01-25T09:54:54+05:30 IST

అచ్చం ఓ సినిమాలోని దృశ్యాన్ని తలపించేలా ఇద్దరు యువకులు చనిపోయిన ఓ వృద్ధుడి పెన్షన్ డబ్బులు దొంగలించాలని చూశారు. ఆ వృద్ధుడికి నెలనెలా పోస్టాఫిస్ ద్వారా పెన్షన్ లభించేది. ఈ విషయం తెలిసిన ఇద్దరు దుండగలు ఆ వృద్ధుడు చనిపోయాక అతడి శవాన్ని పోస్టాఫీసుకి...

పెన్షన్ కోసం వృద్ధుడి శవాన్ని పోస్టాఫీసుకి తీసుకెళ్లిన యువకులు.. అక్కడ వారిద్దరూ ఏం చేశారంటే..

అచ్చం ఓ సినిమాలోని దృశ్యాన్ని తలపించేలా ఇద్దరు యువకులు చనిపోయిన ఓ వృద్ధుడి పెన్షన్ డబ్బులు దొంగలించాలని చూశారు. ఆ వృద్ధుడికి నెలనెలా పోస్టాఫిస్ ద్వారా పెన్షన్ లభించేది. ఈ విషయం తెలిసిన ఇద్దరు దుండగలు ఆ వృద్ధుడు చనిపోయాక అతడి శవాన్ని పోస్టాఫీసుకి మోసుకెళ్లారు. అతను బతికే ఉన్నట్లు నాటకం ఆడారు. కానీ చివరి నిమిషంలో కథ అడ్డం తిరిగింది. ఈ ఘటన ఐర్లాండ్ దేశంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఐర్లాండ్ దేశంలోని కార్లో కౌంటీకి చెందిన పీడర్ డోయల్(66) అనే వ్యక్తి ప్రతినెలా పోస్టాఫీసు నుంచి తన పెన్షన్ డబ్బులు తీసుకునేవాడు. పీడర్ నివసించే ప్రాంతంలో అతను అందరితో సన్నిహితంగా మెలిగేవాడు. అదే ప్రాంతంలో నివసించే ఇద్దరు యువకులు.. పీడర్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు. 


ఒకరోజు పీడర్ చనిపోయాడనే విషయం ఆ ఇద్దరు యువకులకు మాత్రమే తెలుసు. ఇదే అదునుగా భావించిన ఆ యువకులు పీడర్ పెన్షన్ డబ్బులు పోస్టాఫీసు నుంచి తీసుకోవాలని ప్లాన్ వేశారు. ముందుగా.. ఆ ఇద్దరిలో ఒక యువకుడు పోస్టాఫీసుకి వెళ్లి.. పీడర్‌కు ఆరోగ్యం బాగోలేక రాలేడని.. అందువల్ల అతని పెన్షన్ డబ్బులు తనకు ఇవ్వాలని అధికారులను కోరాడు. కానీ పోస్టాఫీసు అధికారులు అలా కుదరదని.. పీడర్ లేదా అతని వారసుల చేతికి మాత్రమే పెన్షన్ ఇస్తామని చెప్పారు.


ఆ తరువాత ఎలాగైనా పీడర్ పెన్షన్ కాజేయాలనే ఉద్దేశంతో ఆ ఇద్దరు యువకులు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. పీడర్ చనిపోయిన విషయం ఎవరికీ తెలియదు కాబట్టి అతని శవాన్ని పోస్టాఫీసు తీసుకెళ్లి.. అతడు బతికే ఉన్నట్లు భ్రమ కల్పించాలనుకున్నారు. దాని కోసం పీడర్ మృతదేహానికి కొత్త బట్టలు వేసి, తలకు పెద్ద టోపీ పెట్టి, కళ్లకు అద్దాలు పెట్టి, శవం ఇరువైపులా ఇద్దరు పట్టుకుని నడిపిస్తూ బయటికి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. ఈ దృశ్యానంతా పీడర్ పక్కింటి మహిళ గమనించి.. పీడర్‌కు ఏమైందని అడిగింది. దానికి ఆ దుండగలలో ఒకడు పీడర్ ఆరోగ్యం బాగోలేదని చెప్పాడు.


ఆ తరువాత ఆ ఇద్దరు యువకులు పీడర్‌ను తీసుకొని పోస్టాఫీసు చేరుకున్నారు. అక్కడ పీడర్ శవాన్ని ఒక చోట కూర్చోబెట్టి అతడి పెన్షన్ కోసం పోస్టాఫీస్ అధికారిని అడిగారు. అప్పుడా అధికారి పీడర్ వైపు చూసి ఏదో తేడా గమనించి.. పీడర్‌ను పలకరించింది. కానీ పీడర్‌లో చలనం లేకపోవడంతో తీసుకొచ్చిన ఆ ఇద్దరి వైపు చూసింది. అప్పుడా ఇద్దరు ఏం చేయాలో తెలియక.. కాసేపు పీడర్‌ను లేపినట్టు అందరి ముందు నాటకమాడారు. కాసేపు తరువాత పీడర్ మృతదేహాన్ని కింద పడుకోబెట్టి అతనికి గుండెపోటు వచ్చిందని చెప్పారు. దీంతో పోస్టాఫీస్ అధికారులు అంబులెన్స్, పోలీసులకు ఫోన్ చేశారు. 


పోలీసులు పీడర్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ ఇద్దరు యువకులు పారిపోకుండా పోస్టాఫీసు వద్దనే కూర్చున్నారు. పోలీసులకు పీడర్ మరణించాడనే వార్త తెలియగానే ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దానికి ఆ ఇద్దరు యువకులు పీడర్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు బతికే ఉన్నాడని.. తాము కేవలం అతడికి పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు సహాయం చేసేందుకు వచ్చామని చెప్పారు. 


ప్రస్తుతం పోలీసులు పీడర్ పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ఇద్దరు యువకులను ఇంకా అరెస్టు చేయలేదు. 


Updated Date - 2022-01-25T09:54:54+05:30 IST