పదవుల కోసం పాత, కొత్త నేతల పట్టు!

ABN , First Publish Date - 2020-02-22T07:31:17+05:30 IST

బీజేపీలో పదవుల కోసం పాత, కొత్త నేతల మధ్య పట్టుదల కొనసాగుతోంది. రెండు నెలల కిందటే పూర్తి కావాల్సిన సంస్థాగత ప్రక్రియ.. ఇంకా కొనసాగుతూనే ఉంది. పలుచోట్ల డివిజన్‌...

పదవుల కోసం పాత, కొత్త నేతల పట్టు!

జిల్లా అధ్యక్షుల ఎన్నికలో అసాధారణ జాప్యం

‘కమలం’లో కొలిక్కిరాని సంస్థాగత ప్రక్రియ


హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): బీజేపీలో పదవుల కోసం పాత, కొత్త నేతల మధ్య పట్టుదల కొనసాగుతోంది. రెండు నెలల కిందటే పూర్తి కావాల్సిన సంస్థాగత ప్రక్రియ.. ఇంకా కొనసాగుతూనే ఉంది. పలుచోట్ల డివిజన్‌, మండల కమిటీలు కూడా పూర్తికాకపోవడంతో జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రహసనంగా మారిందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నియామకానికి సంబంధించి వారంలోగా జాతీయ స్థాయి పరిశీలకులు రానున్నారు. పార్టీ సంస్థాగత నిబంధనావళి ప్రకారం సగానికిపైగా జిల్లాలకు అధ్యక్షులను ఎన్నుకున్న తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో తమవారికి జిల్లా అధ్యక్ష పదవులు కట్టబెట్టేందుకు పార్టీ సీనియర్‌ నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన అగ్రనేతల మధ్య పోటీ నెలకొంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సంస్థాగత ఎన్నిక ప్రక్రియలో తీవ్ర జాప్యానికి మునిసిపల్‌ ఎన్నికలు, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికే కారణమని పైకి చెబుతున్నా.. అనివార్య పరిస్థితుల వల్లే ఆలస్యమవుతోందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం గత ఏడాది డిసెంబరు 15నాటికి జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తి కావాలి. కానీ, అప్పటికి సగానికి పైగా మండల కమిటీలే పూర్తికాలేదు. పైగా, జిల్లా అధ్యక్ష  పదవి దక్కాలంటే భారీగా క్రియాశీలక సభ్యత్వాలు చేయించాలని నిర్దేశించారు. ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే రాష్ట్ర పార్టీ నుంచి ఇద్దరు పరిశీలకులు, ఒక ఎన్నికల అధికారి ఆయా జిల్లాలకు వెళ్లి అభిప్రాయాలు సేకరించారు.


జిల్లా అధ్యక్ష పదవులపై ఆశలు పెట్టుకుని, పెద్దఎత్తున సభ్యత్వాలు చేయించిన వారికి ఈ పరిణామం మింగుడుపడలేదన్న చర్చ జరుగుతోంది. అభిప్రాయ సేకరణ నిర్ణయంతో పార్టీ కోసం మొదటి నుంచీ కష్టపడ్డ వారి ఆశలు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడిందన్న వాదన తెరపైకి వచ్చింది. మరోవైపు, పార్టీలో ఏళ్ల తరబడి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నా, కనీస స్థాయిలో కూడా బలోపేతం చేయలేకపోయారన్న విమర్శలను కొంత మంది ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని ఆయా జిల్లాల్లో టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి వచ్చిన పలువురు సీనియర్‌ నేతలు తమ వాదనకు మద్దతుగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ముందుగా పార్టీ అధ్యక్షుల ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. 20 జిల్లాలకు సంబంధించి కసరత్తు కొలిక్కివచ్చినా, మిగతావాటిపై పాత, కొత్త నేతల మధ్య పట్టు కొనసాగుతుండడంతో మొత్తం జాబితా పెండింగ్‌లో ఉండిపోయిందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2020-02-22T07:31:17+05:30 IST