ప్రాచీనానికి పునరుత్తేజం

ABN , First Publish Date - 2020-11-30T05:52:06+05:30 IST

పురాతన కట్టడాల పునరుద్ధరణపై ఓ మాజీ సీఈఓ శ్రద్ధ.. ఉద్యోగం వదిలి సొంత నిధులతో కార్యక్రమాలకు శ్రీకారం.. త్వరలో జిల్లాలోని చారిత్రత్మాక కట్టడాలపై ఓ యాప్‌

ప్రాచీనానికి పునరుత్తేజం
బుక్కరాయసముద్రం కొలను పిచ్చి మొక్కలతో నాడు.. పునరుత్తేజం అనంతరం కొలను నేడు.. (ఇన్‌సెట్లో ) అనిల్‌ కుమార్‌రెడ్డి

పురాతన కట్టడాల పునరుద్ధరణపై ఓ మాజీ సీఈఓ శ్రద్ధ.. 

ఉద్యోగం వదిలి సొంత నిధులతో కార్యక్రమాలకు శ్రీకారం.. 

త్వరలో జిల్లాలోని చారిత్రత్మాక కట్టడాలపై ఓ యాప్‌ 


బుక్కరాయసముద్రం, నవంబరు 29 : పట్టించుకునేవారు లేక మన చుట్టూ  ఉండే పురాతన కట్టడాలు కళ్ల ముందే కనుమరుగైౖపోతున్నాయి. గత వైభవానికి ఆనవాళ్లుగా నిలిచిన ప్రాచీన దేవాలయాలు, కొలనులు, బ్రిటీష్‌ కాలం నాటి కట్టడాలు కూడా భవిష్యత్‌ తరాలు చూడకుండానే శిథిలమయ్యే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో మన వారసత్య సంపదను భావి తరాలకు అందజేయడానికి ఓ వ్యక్తి సంకల్పించాడు. శిథిలావస్థకు చేరుకుంటున్న ఆ కట్టడాల పునరుద్ధరణకు పూనుకున్నాడు. ఆయనే అనంతపురానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి. 


సీఈఓ నుంచి చరిత్ర వైపు అడుగులు...

ఈయన గత  కొన్నేళ్లుగా ఓ ప్రైవేటు మొబైల్‌ కంపెనీ ఇండియా సీఈఓ గా రూ.80 లక్షలు వార్షిక వేతనంతో పని చేస్తూ రాజీనామా చేశాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ప్రాచీన కట్టడాల పునరుజ్జీవానికి పూనుకున్నాడు. అందులో భాగంగా తొలుత బుక్కరాయసముద్రంలోని కాశీ విశ్వేశ్వరస్వామి  దేవాలయం ప్రాంగణంలో 14వ శతాబ్దంలో తవ్విన కొలనును పునరుద్ధరించడానికి సంకల్పించారు. ఒకప్పుడు  మంచి  నీటితో స్వచ్ఛంగా కనిపించిన  ఈ కొలను కొన్ని దశాబ్దాలుగా  రాళ్లు రప్పులు, కంపచెట్లు చెత్తా చెదారంతో నిండిపోయింది.  దాన్ని కేవలం 48 గంటల్లోనే  సుమారు 40 మంది కూలీలతో శుభ్రం చేయించి పురాతన కొలనుకు పూర్వ వైభవాన్ని తెచ్చారు. కొలనను శుభ్రం చేసి రంగు రంగుల విద్యుద్దీపా లను అలకరించడంతో పాటు అందులో ఓ బోరు కూడా  వేసి పాతాళగంగతో కొలను నింపే ప్రయత్నం చేశారు. అలాగే 13, 14వ శతాబ్దంలో నిర్మించిన ప్రాచీన దేవాలయాలైన బుక్కరాయసముద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి, కొండమీదరాయుడు దేవాలయం,  దేవరకొండ వద్ద ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం, ముసలమ్మ దేవాలయం, అనంతపురంలోని పాతవూరు వద్ద నిర్మించిన విక్టోరియా  అస్పత్రితో పాటు  పలు ప్రాచీనా దేవాలయాలను తన సొంత నిధులతో పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. వందేళ్ల చరిత్ర కలిగిన రాచానపల్లి బ్రిడ్జికి మరమ్మతు పనులు చేపట్టారు. కొందరు విద్యార్థుల సహకారంతో బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న ముళ్లకంపలు తొలగించి శుభ్రం చేయించడంతో పాటు వాటికి రంగులు వేయించి నూతన శోభ ఉట్టిపడేలా చేశారు.  


త్వరలో చారిత్రాత్మక కట్టడాలపై యాప్‌   

 అనంతపురం జిల్లాలో చూడవలసిన 100 ప్రదేశాల గురించి పుస్తక ప్రచురణ,  డిస్కవరీ ఏటీపీ అనే యాప్‌ రుపొందించనున్నట్టు తెలిపారు. అందులో జిల్లాలో  ప్రా చీన కట్టడాలు, ప్రాముఖ్యత కల్గిన ప్రదేశాలకు సంబంధించి వివరాలు పొందపరచనున్నట్టు తెలిపారు. మార్చి 2021 కల్లా దీన్ని పూర్తి చేస్తామన్నారు. జిల్లాలలో చారిత్రక కట్టడాలను  ప్రపంచానికి 360 డిగ్రీ వీడియో, ఫొటోల ద్వారా చూపిస్తూ, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా వీటి పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేస్తామని వెల్లడించారు. చుట్టూ ఉన్న వారు కూడా తనతో చేయి కలిపితే ఇలాంటి ఎన్నో పురాతన కట్టడాలను రక్షించి భావి తరాలకు అందజేయ వచ్చని ఆయన చెబుతున్నారు. ఇందుకోసం ఎవరూ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టిల్సిన పని లేదన్నారు. అంతా తానే భరిస్తానని వివరించారు. 


సంకల్పం ఉంటే ఏమైనా సాధించవచ్చు  - అనిల్‌ కుమార్‌రెడ్డి 

 మనిషి దృఢసంకల్పతో ఉంటే ఏమైనా సాధించవచ్చు. అందుకు ఉదాహరణ కాశీవిశ్వేశ్వర దేవాలయం కొలనును కేవలం  40 మందితో 48 గంటల్లో శుభ్ర పరచటం.  ఇది దైవానుగ్రహం వల్ల ఒనగూరిన మానవ సంకల్పిత ఫలితం. ఒక మనిషి  తలచుకుంటేనే  ఇంత చేయగలిగితే .. ఇక ప్రభుత్వం,  సంబంధిత శాఖ   అధికారులు  తలుచుకుంటే ఇంకెంత చేయవచ్చో  ఉహించుకోవచ్చు. శిథిలావస్థకు చేరుకున్న కట్టడాల పునరుద్ధరణకు ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలి. 


Updated Date - 2020-11-30T05:52:06+05:30 IST