తల్లిని, చెల్లిని వీధిన పడేశారు

ABN , First Publish Date - 2021-08-03T05:06:51+05:30 IST

తల్లిని, చెల్లిని వీధిన పడేశారు

తల్లిని, చెల్లిని వీధిన పడేశారు
ఆకలితో ఉన్న తల్లి, కూతురుకు భోజనం పెడుతున్న సీఐ కిషన్‌

ఆస్తులు పంచుకొని అన్నం పెట్టని కొడుకులు

పోలీసులను ఆశ్రయించిన బాధితులు 


కమలాపూర్‌, ఆగస్టు 2 : వృద్ధాప్యంలో ఉన్న తల్లీ, దివ్యాంగురాలైన చెల్లి బాగోగులు చూసుకోవాల్సిన వారు బుక్కెడు బువ్వ పెట్టకుండా వారిని నిరాశ్రుయులను చేశారు. తల్లి సంపాదించిన ఆస్తులను మాత్రం పంచుకొని ఆమెను సాకాల్సిన సమయంలో మానవత్వాన్ని మరిచిన కొడుకులు ముసలితల్లిని వీధిన పడేశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితులు పస్తులతో అలమటిస్తూ చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించారు. కమలాపూర్‌ సీఐ పుల్యాల కిషన్‌ వివరాల మేరకు.. మండలంలోని గుండేడు గ్రామానికి చెందిన వృద్ధురాలు మేకల పోచమ్మ భర్త గతేడాది మృతిచెందాడు. వీరికి ఇద్దరు కుమారులు మేకల రాజయ్య, సదయ్యతో పాటు దివ్యాంగురాలైన కూతురు గట్టమ్మ ఉంది. కొడుకులిద్దరూ తల్లిదండ్రులు సంపాదించిన 6 ఎకరాల భూమిని పంచుకున్నారు. కానీ వృద్ధురాలైన తల్లి, ఆమెపై ఆధారపడిన దివ్యాంగురాలైన చెల్లి బాగోగులను మాత్రం విస్మరించారు. గట్టమ్మకు వికలాంగుల పింఛన్‌ వస్తుండగా దాంతోనే తల్లీకూతురు కడుపు నింపుకుంటున్నారు. పింఛన్‌ డబ్బులతో పూటగడవడం కష్టంగా మారిందని తమకు అన్నం పెట్టాలని పోచమ్మ కొడుకులను బతిమిలాడినా వారు పట్టించుకోవడం లేదు. గత్యంతరం లేక వారిద్దరూ సోమవారం పోలీసులను ఆశ్రయించగా సీఐ కిషన్‌ ముందుగా భోజనం తెప్పించి వారి ఆకలి తీర్చారు. అనంతరం పోచమ్మ కుమారులను స్టేషన్‌కు పిలిపించి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరోసారి తల్లీ, చెల్లి బాగోగులను విస్మరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపారు. 

Updated Date - 2021-08-03T05:06:51+05:30 IST