Abn logo
May 10 2021 @ 11:19AM

లక్ష విలువ చేసే టీవీని 25వేలకే అమ్ముతానని...

హైదరాబాద్/రాజేంద్రనగర్‌ : ఆర్మీలో పనిచేస్తానని, రూ.లక్ష విలువ చేసే తన టీవీని రూ. 25వేలకే అమ్ముతానని ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి రూ.50వేలకు కుచ్చుటోపీ పెట్టాడో సైబర్‌ నేరగాడు. ఆర్మీలో పనిచేస్తున్నానని ఓ వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌లో రూ.లక్ష విలువ చేసే టీవీని రూ.25వేలకే అమ్మడానికి పెట్టాడు. అది చూసిన అత్తాపూర్‌కు చెందిన రఘువీర్‌ టీవీని అమ్మకానికి పెట్టిన వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడి తాను కొనుగోలు చేస్తానని చెప్పాడు. అందుకు తన ఖాతాలో రూ. 25వేలు జమ చేస్తే టీవీని పంపిస్తానని అవతలి వ్యక్తిని నమ్మబలికాడు. అందుకు రఘువీర్‌ రెండు రోజుల క్రితం రూ. 25వేలను సదరు వ్యక్తి ఖాతాలో జమ చేశాడు. తర్వాత అతను టీవీ పంపించలేదు. తనకు మరో రూ.25వేలు అవసరం ఉందని, ఆ డబ్బులు పంపిస్తే టీవీతోపాటు రూ. 25వేలు కూడా తిరిగి పంపిస్తానని చెప్పాడు. అది కూడా నమ్మిన రఘువీర్‌ మరో రూ. 25వేలను కూడా సదరు వ్యక్తి ఖాతాలో తిరిగి జమ చేశాడు. అయినా తనకు అవతలి వ్యక్తి టీవీ పంపించలేదు. పైగా ఇంకో రూ.10వేలు పంపించాలని కోరాడు. దీంతో అనుమానం వచ్చి రఘువీర్‌ రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కారు కొనబోయి..

శంకర్‌పల్లి : ఓఎల్‌ఎక్స్‌లో ఇన్నోవా కారును కొనుగోలు చేసేందుకు డబ్బులు గూగుల్‌ పే ద్వారా పంపించిన యువకుడు మోసపోయిన సంఘటన శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపులారం గ్రామానికి చెందిన రాందాసు నవీన్‌కుమార్‌ ఓఎల్‌ఎక్స్‌లో ఇన్నోవా కారు(ఎంహెచ్‌11ఎడబ్లు7307)ను చూసి కొనేందుకు సిద్ధపడ్డాడు. ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన నెంబర్‌ 9671927372కు  ఫోన్‌ చేసి ఇట్టి కారును కొనేందుకు సిద్ధ్దంగా ఉన్నానని కారు ధర అడుగగా రూ.1లక్షా 50వేలు చెప్పాడు. 


నవీన్‌కుమార్‌ రూ.1లక్షా 40వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా తనకు రూ.5వేలు అడ్వాన్స్‌ పంపమని కోరగా అతడు సూచించిన నెంబర్‌కు పలుమార్లు రూ.1లక్ష 40వేలు రెండు రోజుల్లో పంపించానని తెలిపారు. సదరు వ్యక్తి కొద్ది క్షణాల్లో మీ ఇంటి ముందు ఇన్నోవా కారు ఉంటుందని, మహారాష్ట్ర నుంచి కారు పంపించేందుకు ట్రావెలింగ్‌ చార్జీ కోసం అదనంగా రూ.31వేలు పంపమని చెప్పగా నవీన్‌కుమార్‌ తన వద్ద డబ్బులు లేకపోవడంతో తన స్నేహితుడు బేగరి నాగేష్‌ ఖాతా నుంచి రూ.16వేలు మరో స్నేహితుడి ఖాతా నుంచి రూ.31వేలు పంపించినట్లు తెలిపారు. తీరా సదరు వ్యక్తి  ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో ఆదివారం శంకర్‌పల్లి పోలీసుస్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపీనాథ్‌గోపు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement