ఖాళీ స్టేడియాల్లోనే...

ABN , First Publish Date - 2021-07-09T08:30:30+05:30 IST

ఒలింపిక్స్‌ అంటే కిక్కిరిసిన స్టేడియాలు..అథ్లెట్లు విజయం సాధిస్తే మిన్నంటే సంబరాలు..అంతా ఓ పండుగ సంరంభం..కానీ ఈసారి విశ్వక్రీడలు ..

ఖాళీ స్టేడియాల్లోనే...

వెల్లడించిన నిర్వాహక కమిటీ

ఒలింపిక్స్‌ 14రోజుల్లో


టోక్యో: ఒలింపిక్స్‌ అంటే కిక్కిరిసిన స్టేడియాలు..అథ్లెట్లు విజయం సాధిస్తే మిన్నంటే సంబరాలు..అంతా ఓ పండుగ సంరంభం..కానీ ఈసారి విశ్వక్రీడలు అందుకు పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. కారణం..మెగా ఈవెంట్‌ను ఫ్యాన్స్‌ లేకుండానే నిర్వహించనుండడం. ఒలింపిక్స్‌కు స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించడంలేదని నిర్వాహకులు గురువారం అధికారికంగా ప్రకటించారు. మైదానం సామర్థ్యంలో సగం లేదంటే గరిష్ఠంగా 10వేలమందికి ఎంట్రీ కల్పించాలని గతంలో నిర్వాహకులు భావించారు. కానీ టోక్యోలో కరోనా ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ కేసులు రోజురోజుకు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.


ఫలితంగా ఒలింపిక్స్‌ ముగిసేవరకు టోక్యోలో కరోనా అత్యయిక పరిస్థితిని జపాన్‌ ప్రభుత్వం విధించింది.. ఈనెల 5 నుంచే అమలులోకి వచ్చిన ఈ అత్యయిక పరిస్థితి వచ్చేనెల 22 వరకు కొనసాగనుంది. దరిమిలా స్టేడియాల్లోకి అభిమానులను కూడా అనుమతించడంలేదు. ‘కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో క్రీడలను నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించినందుకు చింతిస్తున్నాం’ అని టోక్యో-2020 అధ్యక్షుడు సీకో హషిమోటో ప్రకటించారు. ‘పోటీలకు టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రతిఒక్కరికీ క్షమాపణలు తెలుపుతున్నాం’ అని అన్నారు. ‘డెల్టా రకం విస్తృతంగా వ్యాపిస్తోంది. అందువల్ల మరో వేవ్‌కు కారణం కాకూడదనే ఒలింపిక్స్‌ నిర్వాహకులు ఆ నిర్ణయం తీసుకున్నారు’ అని ప్రధాని యోషిహిడె సుగా వివరించారు. ఈనెల 23 నుంచి వచ్చేనెల ఎనిమిది వరకు ఒలింపిక్స్‌ జరగనున్నాయి. 


‘విలేజ్‌’లో కరోనా కలకలం..: రెండు వారాల్లో విశ్వ క్రీడలకు తెరలేవనుండగా..కరోనా కలకలం సృష్టించింది. బుధ వారం ఒలింపిక్‌ విలేజ్‌ని అలా తెరిచారో లేదో ఇలా కరోనా కాలుపెట్టింది. ఒలింపిక్‌ గ్రామంలో బాధ్యతలు నిర్వహించే ఇద్దరు ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. అయితే ఒలింపిక్స్‌ నిర్వహణతో సంబంధంఉన్న మరో పదిమందికి కూడా పాజిటివ్‌ వచ్చినట్టు జపాన్‌ మీడియా వెల్లడించింది. 


Updated Date - 2021-07-09T08:30:30+05:30 IST