వచ్చేసింది.. కొత్త తేదీ

ABN , First Publish Date - 2020-03-31T10:08:44+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన ఒలింపిక్స్‌.. సరిగ్గా ఏడాది తర్వాత జరగనున్నాయి. ‘కరోనా వైరస్‌పై మానవాళి విజయం’గా 2021 ఒలింపిక్స్‌ను ...

వచ్చేసింది.. కొత్త తేదీ

2021లో జూలై 23 నుంచి ఒలింపిక్స్‌

ఆగస్టు 8న ముగింపోత్సవం

కొత్త షెడ్యూల్‌ ప్రకటన


టోక్యో: కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన ఒలింపిక్స్‌.. సరిగ్గా ఏడాది తర్వాత జరగనున్నాయి. ‘కరోనా వైరస్‌పై మానవాళి విజయం’గా 2021 ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నట్టు టోక్యో ఒలింపిక్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ సోమవారమిక్కడ చెప్పారు. వాయిదా నిర్ణయం వెలువరించిన వారం రోజులలోపే రీషెడ్యూల్‌ను ప్రకటించారు. ‘2021, జూలై 23 నుంచి ఆగస్టు 9 వరకు విశ్వక్రీడలను, ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 5 వరకు పారాలింపిక్స్‌ను షెడ్యూల్‌ చేశామ’ని మోరీ తెలిపారు. వాస్తవంగా ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్‌ జరగాలి. కానీ, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో వాయిదా వేయాల్సిన పరిస్థితి..! కానీ, వచ్చే ఏడాది ఇంచుమించు ఇదే సమయానికి మెగా ఈవెంట్‌ ఆరంభం కానుంది. చలికాలంలో విశ్వక్రీడలను నిర్వహిస్తారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ.. యూరోపియన్‌ సాకర్‌, నార్త్‌ అమెరికా స్పోర్ట్స్‌ లీగ్‌లు అడ్డు వస్తుండడంతో ఇదే టైం స్లాట్‌ను ఖరారు చేశారు. దాదాపు ఏడేళ్లుగా టోక్యో ఒలింపిక్స్‌ కోసం సన్నాహకాలు చేశారు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అత్యయిక పరిస్థితి నెలకొనడంతో ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలు విశ్వక్రీడల్లో పాల్గొనడం లేదని ప్రకటించాయి. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మెగా ఈవెంట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), ఆర్గనైజింగ్‌ కమిటీలు ప్రకటించాయి.


రూ. 95 వేల కోట్ల అదనపు భారం..!

 రీషెడ్యూల్‌ చేయడం వల్ల ఆర్థికంగా తీవ్రమైన భారాన్ని మోయాల్సి ఉంటుందని ఆర్గనైజింగ్‌ సీఈఓ తోషిరో మూటో చెప్పారు. తాజా బడ్జెట్‌ అంచనాల ప్రకారం దాదాపుగా రూ. 95 వేల కోట్ల అదనపు భారం పడుతుందని భావిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఆర్గనైజింగ్‌ కమిటీ, జపాన్‌ ప్రభుత్వం, టోక్యో సిటీ సంయుక్తంగా మోయనున్నాయి. 2011లో జరిగిన ప్రకృతి విలయాలు భూకంపం, సునామీ, ఫుకుషిమా న్యూక్లియర్‌ ప్రమాదం నుంచి జపాన్‌ కోలుకొన్న తీరుకు గుర్తుగా 2020 ఒలింపిక్స్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా విశ్వక్రీడలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈ వైరస్‌పై మానవాళి విజయానికి గుర్తుగా ఈ ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నట్టు మోరీ గుర్తుచేశారు. ప్రస్తుతం మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని కొత్త తేదీల ప్రకటన సమయంలో ఐఓసీ చీప్‌ థామస్‌ బాచ్‌ అన్నారు. కానీ, ఒలింపిక్స్‌ కారు చీకట్లో కాంతిపుంజమని చెప్పారు. 

Updated Date - 2020-03-31T10:08:44+05:30 IST