డోన్ట్‌ వర్రీ!

ABN , First Publish Date - 2020-03-28T09:44:27+05:30 IST

ఒలింపిక్స్‌ వాయిదాపడ్డాయి. బాగానే ఉంది. కానీ ఇప్పటికే విశ్వక్రీడలకు అర్హత సాధించిన అథ్లెటు 2021లో ఒలింపిక్స్‌లో నేరుగా బరిలోకి దిగవచ్చా..అనే

డోన్ట్‌ వర్రీ!

క్వాలిఫై అయిన అథ్లెట్లు నేరుగా ‘2021’ బరిలోకి


పారిస్‌: ఒలింపిక్స్‌ వాయిదాపడ్డాయి. బాగానే ఉంది. కానీ ఇప్పటికే విశ్వక్రీడలకు అర్హత సాధించిన అథ్లెటు 2021లో ఒలింపిక్స్‌లో నేరుగా బరిలోకి దిగవచ్చా..అనే అనుమానం వారిని పీడిస్తోంది. అయితే క్రీడాకారులకు ఆ ఆందోళన అవసరం లేదు. వారు నేరుగా విశ్వక్రీడల బరిలోకి దిగేందుకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారితో.. ఈ జూలై 24 నుంచి ఆగస్టు తొమ్మిది వరకు జరగాల్సిన ఒలింపిక్స్‌ను ఐఓసీ ఏడాది వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో మొత్తం 11వేల మంది క్రీడాకారులు పోటీపడాల్సి ఉంది. వీరిలో 57 శాతం మంది ఇప్పటికే విశ్వ క్రీడలకు క్వాలిఫై అయ్యారు. 32 అంతర్జాతీయ క్రీడా సంఘాలతో ఐఓసీ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించింది. అర్హత టోర్నీలను కొనసాగించాలని ఆ భేటీలో నిర్ణయించారు. ‘ఒలింపిక్స్‌ను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో థామస్‌ బాచ్‌ వివరించారు. 2020 క్రీడలకు అర్హత సాధించిన అథ్లెట్లు 2021లో నేరుగా తలపడతారని చెప్పారు’ అని టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఓ సమాఖ్య అధికారి వెల్లడించారు. అర్హత టోర్నమెంట్లను ఎప్పటినుంచి, ఎలా నిర్వహించాలనే విషయమై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందని తెలిపారు. ‘కొన్ని క్రీడల్లో  చాలామంది పురుషులు, మహిళా అథ్లెట్లు ఒలింపిక్స్‌ క్వాలిఫై కాలేదు. వారందరికీ అర్హత టోర్నీలు నిర్వహించడానికి కనీసం మూడు నెలలు పడుతుందని అంచనా వేశారు’ అని ఆ అధికారి చెప్పారు.


కొవిడ్‌-19 దెబ్బకు పలు క్వాలిఫయింగ్‌ టోర్నీలు వాయిదాపడగా..మరికొన్ని రద్దయ్యాయి. ముఖ్యంగా బాక్సింగ్‌కు సంబంధించి ఎక్కువ క్వాలిఫయింగ్‌ పోటీలు కరోనా బారినపడడం గమనార్హం. సెయిలింగ్‌లో అయితే 90 శాతం అర్హత టోర్నీలు ముగియడం విశేషం. ఇక వాయిదా పడిన ఒలింపిక్స్‌ నిర్వహణ తేదీలను కచ్చితంగా చెప్పకపోయినా..2021 వేసవిని దాటి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కచ్చితమైన తేదీలను నాలుగు వారాల్లోపు ఐఓసీ చీఫ్‌ బాచ్‌ వెల్లడిస్తారని ఆ అధికారి తెలిపారు. కొందరు మే 2021లో జరపాలని సూచించగా.. మరికొందరు జూన్‌ 2021లో నిర్వహణకు మొగ్గు చూపారని ఆయన వెల్లడించారు. 

Updated Date - 2020-03-28T09:44:27+05:30 IST