సంరంభం.. ఆరంభం

ABN , First Publish Date - 2021-07-24T07:04:07+05:30 IST

క్రీడాభిమానుల కేరింతలు, తుళ్లింతలు లేవు..చేతులు ఊపుతూ, గాలిలో ముద్దులు విసురుతూ ఫ్యాన్స్‌ను అథ్లెట్లు ఉత్సాహపరిచే దృశ్యాలు లేవు..

సంరంభం.. ఆరంభం

అట్టహాసంగా ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం

ఆకట్టుకున్న సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు

క్రీడాభిమానుల కేరింతలు, తుళ్లింతలు లేవు..చేతులు ఊపుతూ, గాలిలో ముద్దులు విసురుతూ ఫ్యాన్స్‌ను అథ్లెట్లు ఉత్సాహపరిచే దృశ్యాలు లేవు..అయినా..కరోనా మహమ్మారితో ఆందోళన మధ్య జీవిస్తున్న వేళ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం ప్రపంచ ప్రజలను ఆనంద డోలికల్లో ముంచెత్తింది.. జపాన్‌ చక్రవర్తి నరుహిటో ముఖ్య అతిథిగా హాజరై టోక్యో క్రీడలను  ప్రారంభిస్తున్నట్టు  ప్రకటించారు.


వనౌటు, టొంగా అథ్లెట్ల కలకలం

వనౌటు, టొంగా జట్ల పురుష పతాకధారులు చొక్కాలేకుండా ప్రవేశించి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు వారు శరీరానికి నూనె పూసుకొని రావడం చర్చనీయాంశమైంది. 


1824 డ్రోన్లు..

స్టేడియంపైన 1824 డ్రోన్లు టోక్యో-2020 చిహ్నం ఆకారంలో నిలవడం కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది. 


స్టేడియం వెలుపల నిరసన 

వాస్తవంగా మెజార్టీ జపాన్‌ వాసులు విశ్వక్రీడలను వ్యతిరేకించారు. ఈనేపథ్యంలో ప్రారంభోత్సవం సందర్భంగా స్టేడియం బయట కొందరు నిరసన వ్యక్తంజేశారు. స్టేడియానికి వచ్చే ప్రధాన రహదారులను దిగ్బంధించడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 

 

అతాను కాదు.. ప్రవీణ్‌ జతగా దీపిక

షెడ్యూల్‌ ప్రకారం భారత్‌ తరఫున ఆర్చరీ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భార్యాభర్తలు దీపికా కుమారి, అతాను దాస్‌ పోటీ పడాలి. కానీ, ఇప్పుడు మిక్స్‌డ్‌లో దీపిక భాగస్వామిగా ప్రవీణ్‌ జాదవ్‌ను ఎంపిక చేసినట్టు భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) శుక్రవారం ప్రకటించింది. అర్హత ర్యాంకింగ్స్‌లో అతాను కంటే ప్రవీణ్‌ మెరుగైన ప్రదర్శన చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏఏఐ తెలిపింది. 


బాణసంచా, మ్యూజిక్‌ మజా..:

ఖాళీ స్టేడియంలోనే ప్రారంభ కార్యక్రమం నిర్వహించినా ఎప్పటిమాదిరే బాణసంచా వెలుగులు జిగేల్‌మనిపించాయి. సుగామి జూనియర్‌ కోరస్‌, అమెరికన్‌ సింగర్‌ జాన్‌ లెజెండ్‌, స్పానిష్‌ సింగర్‌ అలజాండ్రో సాంజ్‌, తదితరులు తమ పాటలతో ఉర్రూతలూగించారు. బాణసంచా వెలుగులు, హోరెత్తించే మ్యూజిక్‌ నడుమ.. పోటీపడుతున్న జట్లు మార్చ్‌పాస్ట్‌ చేశాయి. ఆధునిక ఒలింపిక్స్‌ ఆతిథ్య దేశం గ్రీస్‌ మార్చ్‌పా్‌స్టలో తొలి జట్టుగా రాగా, జపాన్‌ చివరన విచ్చేసింది.


టోక్యో: టోక్యో విశ్వక్రీడలు ప్రత్యేక పరిస్థితుల నడుమ పూర్తి భిన్నమైన వాతావరణంలో శుక్రవారం ఆరంభమయ్యాయి. కరోనా వైర్‌సతో ప్రారంభ కార్యక్రమానికి ఫ్యాన్స్‌ను స్టేడియంలోకి అనుమతించలేదు. కానీ వైరస్‌ భయపెడుతున్నా..మెగా ఈవెంట్‌పై మక్కువతో  స్థానికులు పెద్ద సంఖ్యలో నేషనల్‌ స్టేడియం వద్దకు తరలిరావడం విశేషం. ఇక పరిమిత స్థాయిలో అథ్లెట్లు, అధికారులు, తరలివచ్చిన అతిథుల సమక్షంలో ప్రారంభోత్సవం కన్నులపండువగా సాగింది. వీఐపీలు, అతిథులు కలిసి 950 మంది, వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములైనవారు 10 వేలమంది వేడుకకు హాజరయ్యారు. 


ఇలా మొదలైంది..:

బ్లాక్‌బోర్డుపై చాక్‌పీ్‌సతో రేఖాగణిత ఆకారాలు చిత్రిస్తున్న వీడియోతో ప్రారంభం కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత చేతితో గీసిన ఆ ఆకారాల యానిమేషన్‌ చిత్రాలు స్టేడియం అంతా పరుచుకొని అబ్బురపరిచాయి. స్టేడియం మధ్యలో నిలుచున్న మహిళా అథ్లెట్‌ తన చేతిని నేలపై ఉంచడం ద్వారా విత్తనం నాటుతున్న దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఆమె మెల్లగా లేస్తుండగా..ఆ అథ్లెట్‌ నీడలో నాటిన విత్తనం చిగురు తొడుగుతున్న దృశ్యాన్ని చూపడం అబ్బురపరిచింది. కొవిడ్‌ నేపథ్యంలో అథ్లెట్ల మానసిక స్థితికి అద్దంపడుతూ ప్రదర్శించిన వీడియో అద్భుతమని చెప్పాలి. విశ్వక్రీడల కౌంట్‌డౌన్‌ చివరి క్షణంలో నేషనల్‌ స్టేడియాన్ని విహంగ వీక్షణంలో చూపడం వావ్‌ అనిపించింది. కరోనా వైరస్‌ భయంతో ఒంటరిగా ప్రాక్టీస్‌ చేసిన అథ్లెట్లను దృష్టిలో పెట్టుకొని ‘నీవు వేరుగా ఉండవచ్చు..కానీ ఒంటరివి కావు’ అన్న సందేశాన్ని కార్యక్రమాల్లో బలంగా వినిపించారు. మహిళా అథ్లెట్‌ చీకట్లో ఏకాంతంగా ట్రెడ్‌మిల్‌పై నిశ్శబ్దంగా పరిగెత్తడాన్ని చూపడం క్రీడాకారులు ఒలింపిక్స్‌కు ఎలా సన్నద్ధమయ్యారన్న విషయాన్ని తెలిపింది.

Updated Date - 2021-07-24T07:04:07+05:30 IST