ఏడాదిపాటు ఒలింపిక్స్‌ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-03-25T10:52:55+05:30 IST

అందరూ ఊహించినట్టుగానే టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ప్రపంచ అథ్లెటిక్స్‌ చీఫ్‌ సెబాస్టియన్‌ కో ఇప్పటికే ఈ విషయంపై లేఖ రాయగా.. అటు జపాన్‌ కూడా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో...

ఏడాదిపాటు ఒలింపిక్స్‌ లాక్‌డౌన్‌

  • 2021లో టోక్యో విశ్వక్రీడలు
  • ఒత్తిడికి తలొగ్గిన ఐఓసీ, జపాన్‌ 
  • అధికారికంగా వాయిదా ప్రకటన


ఓవైపు కరోనా వైరస్‌ మహమ్మారిలా ప్రపంచంపై విరుచుకుపడుతున్న వేళ.. క్రీడా పోటీలన్నీ వాయిదా పడడమో.. రద్దు కావడమో జరుగుతోంది. ఈనేపథ్యంలో ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ నిర్వహణపై సర్వత్రా చర్చ జరిగింది. ‘మా ప్రాణాలు పణంగా పెట్టి ఇందులో పాల్గొనాలా?’ అంటూ అథ్లెట్లంతా ముక్తకంఠంతో ఎలుగెత్తి చాటినా.. ఎట్టి పరిస్థితిల్లోనూ గేమ్స్‌ జరిపి తీరుతామని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) బీరాలు పలికింది. కానీ నలువైపుల నుంచీ ఒత్తిడి పెరుగుతుండడంతో ఐఓసీ ఎట్టకేలకు మెట్టు దిగి ఒలింపిక్స్‌ను వాయిదా వేసింది.


లుసానే: అందరూ ఊహించినట్టుగానే టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ప్రపంచ అథ్లెటిక్స్‌ చీఫ్‌ సెబాస్టియన్‌ కో ఇప్పటికే ఈ విషయంపై లేఖ రాయగా.. అటు జపాన్‌ కూడా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చేతులెత్తేయడంతో ఇక అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కి చేసేదేమీ లేకపోయింది. దీంతో నాలుగు వారాల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పిన రెండు రోజులకే వచ్చే ఏడాదిలో గేమ్స్‌ను నిర్వహిస్తామని మంగళవారం సంచలన ప్రకటన చేసింది. అంతకుముందు ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌, జపాన్‌ ప్రధాని షింజో అబేల మధ్య ఫోన్‌లో చర్చలు జరిగిన అనంతరం వెలువడిన సంయుక్త ప్రకటనలో ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రపంచంలో యుద్ధ వాతావరణం లేకపోయినా ఒలింపిక్స్‌ వాయిదా పడడం ఇదే తొలిసారి.


షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జపాన్‌ రాజధాని టోక్యోలో గేమ్స్‌ జరగాల్సి ఉంది. మరోవైపు గేమ్స్‌ను రద్దు చేసే అవకాశం వంద శాతం కూడా లేదని బాచ్‌ చెప్పినట్టు జపాన్‌ ప్రధాని స్పష్టం చేశారు.


 చరిత్రలో

తొలిసారి..


టోక్యో: ఆధునిక ఒలింపిక్స్‌ 1896లో జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా విశ్వక్రీడలు మూడుసార్లు (1916, 1940, 1944) రద్దయ్యాయి. ఈ మూడు సందర్భాల్లోనూ యుద్ధాలే అడ్డుగా నిలిచాయి. కానీ ఈ ఏడాది టోక్యో గేమ్స్‌ నిర్వహణకు సర్వం సిద్ధమైన వేళ.. ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం మాత్రం చరిత్రలో ఇదే తొలిసారి. కొవిడ్‌-19 పంజా విసురుతున్న వేళ ప్రపంచ దేశాలన్నీ ఈ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఐఓసీ వాయిదా వేసింది. ఇంతకుముందు రద్దయిన సందర్భాలను పరిశీలిస్తే.. 1916లో జర్మనీలో జరగాల్సిన ఒలింపిక్స్‌ను తొలిసారి రద్దు చేశారు. నిజానికి 1914, జూలైలో ఆరంభమైన మొదటి ప్రపంచ యుద్ధం  క్రిస్‌మస్‌ నాటికి ముగుస్తుందని భావించినా.. 1918, నవంబరుదాకా కొనసాగింది.


ఆతర్వాత 1940లో టోక్యోలో ఒలింపిక్స్‌ జరగాలి. కానీ, 1937లో చైనాతో యుద్ధం వల్ల ఒలింపిక్స్‌ ఆతిథ్యాన్ని జపాన్‌ వదిలేసుకుంది. ఆ తర్వాత ఆతిథ్య హక్కులు ఫిన్లాండ్‌కు వెళ్లాయి. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా అవీ సాధ్యం కాలేదు. ఫలితంగా గేమ్స్‌ రెండోసారి రద్దయ్యాయి. చివరిసారి 1944 లండన్‌లో జరగాల్సిన ఒలింపిక్స్‌ జర్మనీతో యుద్ధం కారణంగా నిర్వహణ వీలు పడలేదు.


భారం అధికమే!

ప్రపంచ క్రీడలకే తలమానికంగా నిలిచే ఒలింపిక్స్‌పై జపాన్‌ భారీ ఆశలనే పెట్టుకుంది. వీటి నిర్వహణ కోసం ఇప్పటికే వేల కోట్ల డాలర్లు కుమ్మరించింది. అత్యంత ఆధునికంగా స్టేడియాల నిర్మాణం కూడా పూర్తయింది. కానీ ఊహించని విధంగా కరోనా కాటు వేయడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వాస్తవానికి గేమ్స్‌ రద్దు కాకపోయినా వాయిదా ప్రభావం కూడా జపాన్‌ ఆర్థిక వ్యవస్థపై గట్టిగానే పడనుంది. ఈ గేమ్స్‌ మొత్తం వ్యయాన్ని 12.6 బిలియన్‌ డాలర్లుగా నిర్వాహకులు లెక్కించారు. అయితే వాయిదా నిర్ణయంతో అదనంగా 6 బిలియన్‌ డాలర్ల భారాన్ని మోయాల్సి ఉంటుంది. భారీ మొత్తాలకు ఒప్పందం కుదుర్చుకున్న స్పాన్సరర్లు, బ్రాడ్‌కాస్టర్లకు కూడా ఎదురుదెబ్బే. ఇక స్టేడియాలను గేమ్స్‌ ముగిశాక ఆదాయం కోసం వివిధ కార్యక్రమాలకు వాడుకోవాలనుకున్నారు.


68వేల సామర్థ్యం కలిగిన ప్రధాన స్టేడియంలో ఒలింపిక్స్‌ ముగిశాక కల్చరల్‌, క్రీడా ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వాలనే భావనలో జపాన్‌ ఉంది. కానీ గేమ్స్‌ వాయిదా పడడంతో స్టేడియంలో నిర్వహించాలనుకున్న ఈవెంట్లను తరలించక తప్పని పరిస్థితి. దీంతో గణనీయంగా ఆదాయాన్ని కోల్పోక తప్పదు. ఒలింపిక్స్‌ కోసం ఇప్పటికే గదులను బుక్‌ చేసుకున్న వారు రద్దు చేసుకునే అవకాశముండడంతో హోటళ్లు కూడా కళ తప్పనున్నాయి. ఇక ఫుట్‌బాల్‌లో యూరోకప్‌, కోపా కప్‌ కూడా వచ్చే ఏడాదే జరపాలని నిర్ణయించడంతో ప్రసారకర్తలకు ఆదాయపరంగా నష్టమే.


డబ్ల్యూహెచ్‌ఓ సూచనల ప్రకారమే..

కొవిడ్‌-19 వైరస్‌ ఓ ఉత్పాతంలా విరుచుకుపడడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌ఓ) ఇప్పటికే అత్యవసర పరిస్థితి ప్రకటించింది. మరోవైపు ఆస్ట్రేలియా, కెనడా దేశాలు ఓ అడుగు ముందుకేసి తామసలు పోటీల్లోనే పాల్గొనమని తెగేసి చెప్పాయి. దీంతో డబ్ల్యూహెచ్‌ఓ సమాచారం మేరకే 2020 ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి రీషెడ్యూల్‌ చేయాలని ఐఓసీ, జపాన్‌ భావించింది. ‘ప్రపంచ అథ్లెట్లతో పాటు గేమ్స్‌ నిర్వహణలో పాలుపంచుకునే అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని భావించాం. అయితే 2021 వేసవి కన్నా ముందే జరిగే అవకాశం ఉంది. అలాగే ఒలింపిక్‌ జ్యోతి జపాన్‌లోనే ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రీడలను ‘ఒలింపిక్‌, పారాలింపిక్‌ గేమ్స్‌ 2020’గానే పిలవాలని ఒప్పందం కుదిరింది’ అని సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.


ఇప్పటికే విమర్శలు

ఎట్టకేలకు ఐఓసీ స్పందించినా వాయిదా నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూరోపియన్‌ ఫుట్‌బాల్‌, ఫార్మలావన్‌తో పాటు చాలా క్రీడలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. థామస్‌ బాచ్‌ స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నాడని బ్రిటిష్‌ సైక్లిస్ట్‌ కాలమ్‌ స్కిన్నర్‌ ఆరోపించాడు. 


రీ షెడ్యూలింగ్‌ ఎలా?

నాలుగేళ్ల నుంచే పకడ్బందీ ప్రణాళికలతో సిద్ధమవతున్న ఒలింపిక్స్‌ ఇప్పుడు వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో ఎలా రీషెడ్యూలింగ్‌ చేస్తారనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే 2021 క్రీడా షెడ్యూల్‌ చాలా బిజీగా ఉంది. 16 రోజులపాటు జరిగే ఈ గేమ్స్‌ కోసం వాటన్నింటినీ సర్దుబాటు చేయడం నిర్వాహకులకు తలనొప్పే. అతిపెద్ద ఈవెంట్స్‌గా భావించే ప్రపంచ స్వి మ్మింగ్‌ చాంపియన్‌షి్‌ప (జపాన్‌లో.. జూలై)తో పాటు ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ (అమెరికాలో.. ఆగస్టు) కూడా వచ్చే ఏడాది జరగాల్సి ఉంది. అయితే వరల్డ్‌ అథ్లెటిక్స్‌ మాత్రం ఆగస్టు 6 నుంచి 15 వరకు జరిపేందుకు ఇంతకుముందే అంగీకరించింది. 


ఆసుపత్రిగా సావోపాలో స్టేడియం

సావోపాలో: బ్రెజిల్‌ దేశంలోని సావోపాలో నగరంలోని పకెంబు స్టేడియాన్ని కరోనా వైరస్‌ చికిత్స కోసం ఆసుపత్రిగా మార్చనున్నారు. అన్ని ఆసుపత్రులకు ఈ స్టేడియం దగ్గరగా ఉంది. దీంతో 45వేల సీటింగ్‌ గల ఈ స్టేడియాన్ని పదిరోజుల్లో 200 పడకల ఆసుపత్రిగా సిద్ధం చేయనున్నారు. ఇక్కడ 2014లో సాకర్‌ వరల్డ్‌కప్‌ జరిగింది.


అథ్లెట్లకు డిజిటల్‌ తరగతులు

న్యూఢిల్లీ: టాప్‌ స్కీమ్‌లో ఉన్న అథ్లెట్లకు క్రీడా శాఖ త్వరలో డిజిటల్‌ తరగతులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ట్వీట్‌ చేశారు. ఆఫ్‌ ఫీల్డ్‌లో ఎలా నడుచుకోవాలి, కాంట్రాక్ట్‌లపై ఎలా సంతకాలు చేయాలి తదితర విషయాలపై అథ్లెట్లకు ఆన్‌లైన్‌ తరగతుల్లో అవగాహన కల్పిస్తామన్నారు.


ఇంగ్లిష్‌ క్లాసుల్లో హాకీ ఆటగాళ్లు

న్యూఢిల్లీ: బెంగళూరులోని సాయ్‌ సెంటర్‌లో దిగ్బంధంలో ఉన్న భారత హాకీ ఆటగాళ్లు.. ఖాళీ సమయాన్ని తమ ఇంగ్లిష్‌ భాషపై పట్టు పెంచుకునేందుకు వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం పుస్తకాలు చదవడం, సినిమాలు చూస్తున్నారు. పురుషులు, మహిళల జట్లకు ఇక్కడ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-03-25T10:52:55+05:30 IST