ఒమైక్రాన్‌ నుంచి కోలుకున్న మరో బాధితుడు

ABN , First Publish Date - 2021-12-16T17:45:17+05:30 IST

దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చి ఒమైక్రాన్‌తో చికిత్సలు పొందిన 34 ఏళ్ల వ్యక్తి సంపూర్ణంగా కోలుకున్నారు. బుధవారం ఆయన డిశ్చార్జ్‌ అనంతరం తన అనుభవాన్ని వివరించారు. ఈనెల 1న దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు

ఒమైక్రాన్‌ నుంచి కోలుకున్న మరో బాధితుడు

బెంగళూరు: దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చి ఒమైక్రాన్‌తో చికిత్సలు పొందిన 34 ఏళ్ల వ్యక్తి సంపూర్ణంగా కోలుకున్నారు. బుధవారం ఆయన డిశ్చార్జ్‌ అనంతరం తన అనుభవాన్ని వివరించారు. ఈనెల 1న దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చానన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో నెగటివ్‌ రావడంతో ఇంటికెళ్లానని, గొంతులో నొప్పితోపాటు జ్వరం వంటి లక్షణాలు ఉండడంతో ఆసుపత్రిలో పరీక్షించుకున్నానని తెలిపారు. దీంతో ఒమైక్రాన్‌ వేరియంట్‌గా నిర్ధారణ అయిందన్నారు. దక్షిణాఫ్రికాలోనే ఒమైక్రాన్‌ వైరస్‌ సోకి ఉంటుందని భావిస్తున్నానన్నారు. అయితే ఎక్కువ లక్షణాలు లేకపోవడంతో బెంగళూరుకు వచ్చానన్నారు. డెల్టా వేరియంట్‌ వైరస్‌ కూడా సోకి ఉండేదని, దాంతో పోలిస్తే ఒమైక్రాన్‌ వేరియంట్‌కు భయపడాల్సిన పనిలేదన్నారు. మూడు రోజులపాటు గొంతునొప్పి, ఆయాసం, దగ్గు ఉండేదని అంతకుమించి ఎటువంటి సమస్య లేదన్నారు. ఆసుపత్రిలోనే ఆఫీసు పనులు చేసుకున్నానన్నారు. కొవిడ్‌కు ఇచ్చిన మందులే కొనసాగించారని ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానన్నారు. డెల్టా వేరియంట్‌ తీవ్రమైన సమస్యలు తెచ్చిందని, అంతటి లక్షణాలు ఒమైక్రాన్‌లో లేవన్నారు. అయినా జాగ్రత్తలు పాటించాలన్నారు. 

Updated Date - 2021-12-16T17:45:17+05:30 IST