Abn logo
Oct 2 2021 @ 08:44AM

NRI యూసఫ్ అలీకి అరుదైన గౌరవం..

మస్కట్: కేర‌ళ‌కు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, లులు గ్రూపు అధినేత‌, ఎన్నారై ఎంఏ యూస‌ఫ్ అలీకి అరుదైన గౌరవం దక్కింది. ఒమన్ ప్రభుత్వం అలీకి లాంగ్-టర్మ్ రెసిడెన్సీ వీసా మంజూరు చేసింది. ఆ దేశంలో భారీగా పెట్టుబడులతో సంస్థలను నెలకొల్పడంతో పాటు భారీ మొత్తంలో దేశ పౌరులు, నివాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించిన సుమారు 21 మంది విదేశీ పారిశ్రామిక వేత్తలను తాజాగా ఒమన్ సర్కార్ ఇలా లాంగ్-టర్మ్ రెసిడెన్సీ వీసాలతో సత్కరించింది. వీరిలో ఎన్నారై యూసఫ్ అలీకి కూడా చోటు దక్కింది. ఒమన్ వాణిజ్య, పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రి (ఎంఓసీఐఐపీ) చేతుల మీదుగా ఆయన వీసా అందుకున్నారు. 'ఇన్వెస్టర్ రెసిడెన్స్' కార్యక్రమం ద్వారా విదేశీ పెట్టుబడిదారులకు ఒమన్ సుల్తానేట్ ఈ అవకాశం కల్పిస్తోంది.

"ఈ కార్యక్రమం పెట్టుబడుల నాణ్యతను పెంపొందిస్తుంది. జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది. మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. ఒమన్ విజన్-2040 సామర్థ్యాలు, లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది." అని వాణిజ్య, పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రి సలహాదారు ఖలీద్ బిన్ సాయీద్ అల్ షుయిబి తెలిపారు. ఇక తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల యూసఫ్ అలీ హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా ఆయన పేర్కొన్నారు. ఒమన్ ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...