గల్ఫ్ కార్మికులపై మరింత భారం.. వర్క్ వీసా ఫీజు పెంపు

ABN , First Publish Date - 2020-10-30T17:49:04+05:30 IST

ప్రవాస కార్మికులకు సంబంధించిన వర్క్ వీసా ఫీజును ఐదు శాతం పెంచినట్లు ప్రకటించిన ఒమన్ లేబర్ మినిస్ట్రీ... ఈ పెంచిన ఫీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగ భద్రతా వ్యవస్థ(జేఎస్ఎస్)కు ఉపయోగిస్తామని వెల్లడించింది.

గల్ఫ్ కార్మికులపై మరింత భారం.. వర్క్ వీసా ఫీజు పెంపు

వర్క్ వీసా ఫీజు 5 శాతం పెంచిన ఒమన్..! 

మస్కట్: ప్రవాస కార్మికులకు సంబంధించిన వర్క్ వీసా ఫీజును ఐదు శాతం పెంచినట్లు ప్రకటించిన ఒమన్ లేబర్ మినిస్ట్రీ... ఈ పెంచిన ఫీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగ భద్రతా వ్యవస్థ(జేఎస్ఎస్)కు ఉపయోగిస్తామని వెల్లడించింది. "ఒమనీయేతర శ్రామికశక్తికి జారీ చేసే, రెన్యూవల్ చేసే ఎంప్లాయిమెంట్ వీసా ఫీజు ఐదు శాతం పెంచబడింది. అదనంగా వసూలు చేసే ఈ ఐదు శాతం ఫీజును జాబ్ సెక్యూరిటీకి ఉపయోగించబోతున్నాం. ఉదాహరణకు ప్రస్తుతం వర్క్ పర్మిట్ వీసా ఫీజు 300 ఒమానీ రియాల్స్‌గా ఉంటే.. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ప్రవాస కార్మికులు 315 ఒమానీ రియాల్స్ చెల్లించాల్సి ఉంటుందని" పేర్కొంది. ఇక వివిధ కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించబడిన ఒమానీ పౌరులకు తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాలను అందించడమే జేఎస్ఎస్ లక్ష్యం.


అలాగే ఉద్యోగార్ధులకు కూడా ఈ ఫండ్ నుండి తాత్కాలిక ఆర్థిక కేటాయింపులు ఉంటాయని అధికారులు తెలిపారు. అయితే, ఉద్యోగ భద్రతా వ్యవస్థ నిబంధనల ప్రకారం ఎవరైనా యజమాని ఒమానీని ఉద్యోగం నుంచి తొలగించే మూడు నెలల ముందు కార్మిక మంత్రిత్వ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారికి, ఉద్యోగార్థులకు జేఎస్ఎస్ నిధుల నుంచి తాత్కాలిక ఆర్థిక సహాయం చేస్తారు. దీనికోసం ఒమన్ కార్మిక శాఖ తాజాగా పెంచిన ఐదు శాతం ఫీజును ఉపయోగించనుంది.  

Updated Date - 2020-10-30T17:49:04+05:30 IST