నేటినుంచి ‘ఒమైక్రాన్‌’ నిబంధనలు

ABN , First Publish Date - 2021-12-26T15:28:59+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ నిరోధక నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. స్థానిక రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన

నేటినుంచి ‘ఒమైక్రాన్‌’ నిబంధనలు

- బాధితుల కోసం 2.5 లక్షల పడకలు సిద్ధం

- విదేశాల నుంచి వచ్చేవారికి ఐసోలేషన్‌ తప్పనిసరి

- న్యూయియిర్‌ వేడుకలు మానండి

- మంత్రి సుబ్రమణ్యం


చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ నిరోధక నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. స్థానిక రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో శనివారం ఉదయం కొత్త వైరస్‌ తాకిడికి గురై చికిత్సలు పొందుతున్నవారిని ఆయన పరామర్శించారు. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌తో కలిసి ఆ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ‘ఒమైక్రాన్‌’ ప్రత్యేక వార్డులను, వైద్యపరికరాల విభాగాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో తాజాగా 39 మందికి కొత్త వైరస్‌ లక్షణాలు బయటపడటంతో వారి నుంచి సేకరించిన రక్తపు నమూనాలను బెంగళూరు, పూణేలోని ప్రయోగశాలలకు పంపామని, వాటి ఫలితాలు వెలువడేందుకు ఐదు రోజులు పడుతుందని చెప్పారు. కేంద్రప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్రంలో ఆదివారం నుంచి వైరస్‌ నిరోధక నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నామని చెప్పారు. ఆ మేరకు ఒమైక్రాన్‌ వ్యాప్తి అధికంగా ఉన్న విదేశాల నుంచి, ఆ వైరస్‌ తక్కువగా వ్యాప్తి చెందుతున్న విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులను తప్పనిసరిగా ఏడురోజులపాటు ఐసోలేషన్‌లో వుంచుతామన్నారు. విమానాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు రెండుసార్లు వైద్యపరీక్షలు జరుపుతామని, విమానాశ్రయాల్లో దిగినవెంటనే కరోనా వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత ఏడు రోజులపాటు వారిని ఐసోలేషన్‌లో వైద్యనిపుణులు రోజూ  పరిశీలిస్తారని, ఐసోలేషన్‌ పూర్తయిన తర్వాత మళ్ళీ కరోనా వైద్యపరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ఇటీవల ఒమైక్రాన్‌ తాకిడికి గురై చికిత్స పొందుతున్న 27 మందిలో ఐదుగురు సంపూర్ణంగా కోలుకుని శనివారం డిశ్చార్జి అయ్యారని చెప్పారు. ఇదిరకే ఏడుగురు ‘ఒమైక్రాన్‌’ బాధితులు చికిత్సల తర్వాత ఇళ్ళకు తిరుగుముఖం పట్టారని సుబ్రమణ్యం తెలిపారు. వీరిలో చాలామంది రెండు డోసులు టీకాలు వేసుకున్నవారే వున్నారని, వారు త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో ‘ఒమైక్రాన్‌’ కేసులు పెరుగుతుండటంతో ఆంగ్ల సంవత్సరాది వేడుకలకు ప్రజలు దూరంగా వుండటమే మంచిదని, స్టార్‌హోటళ్లు, ఫామ్‌హౌస్‌లు, రెస్టారెంట్లు, క్లబ్లులో జనం గుమికూడకుండా ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు తీవ్ర నిఘా వేస్తారని తెలిపారు. వచ్చే యేడాది వరుసగా పండుగలు వస్తున్నాయని, ఆ సందర్భంగా ప్రజలు ఎక్కడా పెద్ద సంఖ్యలో గుమికూడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, భౌతికదూరాన్ని తప్పకుండా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరతలేదని, అన్ని చోట్లా ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు కూడా పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1400 మెట్రిక్‌ టన్నుల మేరకు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నామని, ప్రతి ఆస్పత్రిలోనూ వంద ఆక్సిజన్‌ సిలిండెర్లు సిద్ధంగా ఉన్నాయని, వెంటిలేటర్‌ తదితర అత్యవసర పరికరాలు కూడా ఉన్నాయని ఆయన వివరించారు.


2.5 లక్షల పడకలు

‘ఒమైక్రాన్‌’ వైరస్‌ బాధితులకు ప్రత్యేక చికిత్సలం దించటానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రులు, జిల్లా స్థాయి ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సుమారు 2.5 లక్షల పడకలను సిద్ధంగా ఉంచినట్లు మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. కరోనా బాధితులకు ఏర్పాటు చేసినట్టు ప్రత్యేక ప్రభుత్వ భవనాలు, కళాశాలలోని కార్యాలయపు భవనాలలో కూడా ఒమైక్రాన్‌ బాధితులకు చికిత్సలం దించేందుకు ఆక్సిజన్‌ సదుపాయంతో కూడిన పడకలు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-12-26T15:28:59+05:30 IST