OMG తెలుగూస్‌!

ABN , First Publish Date - 2020-08-02T18:04:20+05:30 IST

తెలుగు సినిమాలను చూసి మనం ఏమనుకుంటున్నాం అన్నది కాదు అన్నయ్యా.. విదేశీ కుర్రకారు ఏమనుకుంటోంది.. అనేది ఎవరికైనా కుతూహలమే! యూట్యూబ్‌లో కిర్రాక్‌ రేకెత్తిస్తున్న....

OMG తెలుగూస్‌!

తెలుగు సినిమాలను చూసి మనం ఏమనుకుంటున్నాం అన్నది కాదు అన్నయ్యా.. విదేశీ కుర్రకారు ఏమనుకుంటోంది.. అనేది ఎవరికైనా కుతూహలమే! యూట్యూబ్‌లో కిర్రాక్‌ రేకెత్తిస్తున్న ఆ రియాక్షన్‌ ఛానళ్ల గురించి..


అలవైకుంఠపురంలోని సామజవరగమన పాటను చూసిన ఇంగ్లీషు కుర్రాళ్లు ఎలా స్పందిస్తున్నారు? నాన్నకు ప్రేమతోలోని లవ్‌దెబ్బను చూసి ఆఫ్రికన్లు ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు? మన తెలుగు సినిమాల్లోని డైలాగులను విని పాకిస్తానీయులు ఏమంటున్నారు? కుతూహలం కలగడం సహజం. అదే ఇప్పుడు యూట్యూబ్‌లో రియాక్షన్‌ ఛానెళ్ల హవాకు కారణమైంది. నడుస్తున్న ఆ కొత్త ట్రెండ్‌ ఏంటో చూద్దాం.. 





ఇంగ్లీషోళ్ల నాన్నకు ప్రేమతో..

రిక్‌ సెగల్‌, కోర్బిన్‌ మైల్స్‌.. వీరిద్దరూ స్నేహితులు, పైగా నటులు కూడా. ‘అవర్‌ స్టుపిడ్‌ రియాక్షన్స్‌’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను మొదలుపెట్టారు. ఆంగ్ల మూవీ ట్రైలర్లు, పాటలను చూస్తూ రకరకాల హావభావాలను వ్యక్తం చేస్తుంటారు. తమకు తెలిసిన భాష సినిమాలకు రియాక్షన్‌ ఇస్తే ఎవరూ పెద్దగా చూడరని వారిద్దరికీ అర్థమైంది. అప్పట్నించి భారతీయ భాషలలోని వివిధ పాటలకు రియాక్షన్స్‌ ఇవ్వడం ప్రారంభించారు. తెలుగు పాటలకు వారు ఇచ్చిన రియాక్షన్స్‌కు లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. నాన్నకు ప్రేమతోలో ‘లవ్‌ దెబ్బ’ పాటను పదిహేను లక్షల మంది, ఈగ సినిమా ట్రైలర్‌ను లక్షల మంది వీక్షించారు. కమల్‌హాసన్‌ సాగరసంగమంలోని పాట ‘నాద వినోదం’కు వారిచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ అదిరిపోయాయి. అల వైకుంఠపురంలోని ‘సామజవరగమన’ పాట వారిని మైమరిచేలా చేసేసింది. అర్జున్‌రెడ్డి, సైరా, మగధీర, సాహో వంటి సినిమాలు, పాటలు, ట్రైలర్లపై బోలెడన్ని వీడియోలు చేశారు. వీరికి ఏడున్నర లక్షల మంది సబ్‌స్రై్ౖకబర్లు ఉన్నారు.




పాకిస్తానీయుల అలవైకుంఠపురం

 తెలుగు రాకపోయినా... సంగీతాన్ని, డ్యాన్సులను ఆస్వాదిస్తూ రకరకాల హావభావాలతో రియాక్షన్‌ ఛానెల్‌ ‘నమ్కీన్‌ సాచ్‌’ను నడిపిస్తున్నారు పాకిస్తానీ కుర్రాళ్లు. పాటలు, నటులపై తమ అభిప్రాయాలను కూడా చెబుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ ఇలా భారతీయ భాషల పాటలను వింటూ రియాక్షన్స్‌ ఇవ్వడం వీరి ప్రత్యేకత. తెలుగులో సరిలేరు నీకెవ్వరూ ట్రైలర్‌, అలవైకుంఠపురంలోని సామజవరగమన, రౌడీ బేబీ... ఇలా అనేక పాటలపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, పూజా హెగ్డే అంటూ మన నటీనటులను ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. వీరు చేసిన ఏ వీడియోనైనా రెండు లక్షల మందికి తక్కువ కాకుండా చూస్తుండటం విశేషం. వీరి ఛానల్‌కి సబ్‌ స్ర్కైబర్ల సంఖ్య నాలుగు లక్షలు. 




టర్కీభామ బుట్టబొమ్మ

టర్కిష్‌ భామ కాన్సు డోర్ట్‌కోస్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ మొదలుపెట్టింది. ఆమెకు భారతీయ సినిమాలంటే ఇష్టం.  బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్‌... ఇలా ఏ సినిమానూ వదలదు కాన్సు. అన్ని భాషల్లోని పాటలను వింటూ చిత్రవిచిత్ర హావభావాలు ఇస్తుంది. ఇప్పటికి ఆమెకు మూడున్నర లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. బుట్టబొమ్మ పాటకు ఈమె ఇచ్చిన రియాక్షన్‌ను పదకొండు లక్షల మంది వీక్షించారు. అల వైకుంఠపురంలోని అన్ని పాటల మీద తన రియాక్షన్‌ వీడియోలను పోస్టు చేసింది. సైరా, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమా ట్రైలర్లతో పాటూ సీటీమార్‌, టాప్‌ లేచి పోద్ది, వై దిస్‌ కొలవెరి డీ, ఈగ పాటలకు సూపర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. కాన్సుకు తెలుగులో తెగ ఫాలోయింగ్‌ వచ్చేసింది.





అమెరికన్ల బాహుబలి..

క్రిస్‌, విల్‌, జేసీ... వీరు ముగ్గురు మంచి స్నేహితులు. అమెరికన్లు. ‘పీఐ ఫరెవర్‌’ పేరుతో ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ క్రియేట్‌ చేశారు. అది కూడా ఒక రియాక్షన్‌ ఛానెల్‌. మొదట హాలీవుడ్‌ సినిమాల రివ్యూల కోసం మొదలైన ఆ ఛానెల్‌ తరువాత రియాక్షన్‌ ఛానెల్‌గా మారింది. ఇప్పుడు తెలుగు పాటలకు కూడా చోటు దక్కింది. సాహో దగ్గర నుంచి చాలా తెలుగు సినిమాల ట్రైలర్లను చూస్తూ.. రకరకాల రియాక్షన్లు ఇస్తున్నారు. బాహుబలి క్లైమాక్స్‌ చూడాల్సిందిగా వారికి చాలా మంది రిక్వెస్ట్‌ చేశారు. ఆ వీడియోపై వారిచ్చిన రియాక్షన్‌ను లక్షల మంది వీక్షించారు. వీరే కాదు చాలా మంది అమెరికన్లు తెలుగు పాటలపై ఇలాంటి వీడియోలను చేస్తున్నారు. 





డెన్మార్క్‌ఫ్యామిలీ అరవిందసమేత

డెన్మార్క్‌కు చెందిన కుటుంబమంతా రియాక్షన్‌ వీడియోలను చేస్తూ యూట్యూబ్లో ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. ‘బిగ్‌ ఎ రియాక్ట్‌’ పేరుతో ఛానెల్‌ను నడిపిస్తోంది. కేవలం భారతీయ సినిమాలనే ఆ కుటుంబం ఎంచుకుంది. అందుకే ‘ఇండియా రియాక్షన్‌ ఛానెల్‌’ అని ట్యాగ్‌ లైన్‌ కూడా పెట్టుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వారు తెలిపారు. ఇప్పటివరకు అరవింద సమేత, బాహుబలి, అల వైకుంఠపురం, సైరా... ఇలా అనేక సినిమా సీన్లపై రియాక్షన్‌ వీడియోలను చేసి అప్‌లోడ్‌ చేశారు కుటుంబసభ్యులు. బాహుబలి సినిమాపైనే ఇప్పటి వరకు అనేక వీడియోలు చేశారు. వారిచ్చే రియాక్షన్లు కూడా కాస్త అతిగా అనిపిస్తాయి. సైరాలో చిరంజీవి ఎంట్రీ సీన్‌కు అదిరిపోయే రియాక్షన్‌ ఇచ్చారు ‘బిగ్‌ ఎ రియాక్ట్‌’ సభ్యులు.

Updated Date - 2020-08-02T18:04:20+05:30 IST