పడగ విప్పుతున్న ఒమైక్రాన్‌

ABN , First Publish Date - 2021-12-29T13:40:14+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘ఒమైక్రాన్‌’ రాష్ట్రంలో పడగ విప్పుతోంది. మరీ ముఖ్యంగా రోజుకు వేలాదిమందికి రకరకాల చికిత్సలు అందించే నగరంలోని రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీహెచ్‌)లో ఇవి

పడగ విప్పుతున్న ఒమైక్రాన్‌

- జీహెచ్‌లో 42 మందికి పరీక్షలు 

- వారిలో ఏడుగురు ట్రైనీ డాక్టర్లు 

- రాష్ట్రంలో మరో 11 మందికి నిర్ధారణ 

- 45కు చేరిన కేసులు 

- సామాజిక వ్యాప్తి : ఆరోగ్యశాఖ


చెన్నై: ప్రపంచాన్ని వణికిస్తున్న ‘ఒమైక్రాన్‌’ రాష్ట్రంలో పడగ విప్పుతోంది. మరీ ముఖ్యంగా రోజుకు వేలాదిమందికి రకరకాల చికిత్సలు అందించే నగరంలోని రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీహెచ్‌)లో ఇవి విజృంభించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఏడుగురు ట్రైనీ డాక్టర్లు సహా 42 మంది సిబ్బందికి ఒమైక్రాన్‌ లక్షణాలున్నట్టు తెలుస్తోంది. ఆ ఆస్పత్రిలో ఈనెల 17న ఓ వార్డులో రోగికి శస్త్రచికిత్స జరిపారు. ఆ తర్వాత ఆ రోగికి వైద్యపరీక్షలు జరిపినప్పుడు అతడికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆ వార్డులో వారం రోజులపాటు పనిచేసిన డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు సహా 370 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలలో ఏడుగురు ట్రైనీ డాక్టర్లు, ఏడుగురు నర్సింగ్‌ విద్యార్థులు, ముగ్గురు నర్సులు సహా 42 మందికి ‘ఒమైక్రాన్‌’ లక్షణాలున్నట్టు గుర్తించారు. వెంటనే వారి రక్తపు నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపారు. నాలుగైదు రోజులలో వీరి ఫలితాలు వెలువడనున్నాయి. 


మరో 11 మందికి ‘ఒమైక్రాన్‌

రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చిన ఏడుగురికి, వారితో సంబంధాలు కలిగిన మరో నలుగురికి ఒమైక్రాన్‌ సోకింది. వీరిలో ఏడుగురి రక్తపు నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు వారికి ఒమైక్రాన్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీనితో ఆ ఏడుగురిని చికిత్స నిమిత్తం గిండిలోని కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ 11 కేసులతో రాష్ట్రంలో ఒమైక్రాన్‌ బాధితుల సంఖ్య 45కు పెరిగింది. కాగా తాజాగా నిర్ధారణ అయిన ఒమైక్రాన్‌ బాధితుల్లో ఒకరు ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 


పుదుచ్చేరిలో ఇద్దరికి...

కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ వ్యాపించింది. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా ముందస్తు వైద్యపరీక్షలు నిర్వహించారు. వారిలో 80 యేళ్ళ వృద్ధుడికి, మరో యువకుడికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. కాగా ఆ ఇరువురితో సంబంధాలు కలిగిన మరికొంతమందికి వైద్యపరీక్షలు జరుపుతున్నారు.


జాగ్రత్తలు తప్పనిసరి: ఆరోగ్యశాఖ

రాష్ట్రంలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ సామాజిక వ్యాప్తిగా మారిందని, ప్రజలంతా ఇక తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాల్సిందేనని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్‌ పూర్తిగా తొలగిపోలేదని, టీకాలు వేసుకోవడంతో ప్రాణ నష్టాన్ని బాగా తగ్గించగలిగామని చెప్పారు. ప్రస్తుతం ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందన్నారు. విదేశాల నుంచి వచ్చినవారికి మాత్రమే వ్యాపించిన ఒమైక్రాన్‌ వారితో ఎలాంటి సంబంధాలు లేని ఇతరులకు కూడా వ్యాపిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆంగ్ల సంవత్సరాది, సంక్రాంతి పండుగుల సందర్భంగా అధిక సంఖ్యలో గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 


దర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌కు...

తమిళ సినీ దర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌కు ఒమైక్రాన్‌ వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్‌ మీడియా ఖాతాద్వారా వెల్లడించారు. ‘మా ఇంటికి కొత్త అతిథి వచ్చారు. ఆ అతిథి పేరు ఒమైక్రాన్‌. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. నన్ను కాంటాక్ట్‌ అయిన వారు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ వచ్చిన ఆయనకు వైద్య పరీక్షలు చేయగా, ఒమైక్రాన్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈయన ‘అచ్చముండు అచ్చముండు’, ‘నిబుణన్‌’ అనే చిత్రాలను తెరకెక్కించగా, ప్రస్తుతం ‘షాట్‌పుట్‌-3’ పేరుతో బాలల కోసం ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.



Updated Date - 2021-12-29T13:40:14+05:30 IST