Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమైక్రాన్‌ గుబులు

అప్రమత్తంగా లేకుంటే ముప్పే

మాస్క్‌ ధరించకుంటే రూ.1000 జరిమానా

ప్రభుత్వం నిర్ణయం

పేట డీఎంహెచ్‌వో కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్‌

ఇటీవల జర్మనీ నుంచి వచ్చిన చిన్న కుమారుడు

ఆ దేశంలో వైరస్‌ విజృంభణతో లాక్‌డౌన్‌

ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పాల్గొన్న డీఎంహెచ్‌వో

భయాందోళనలో కాంటాక్టులు

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి)

కరోనా మొదటి, రెండో దశ సగటు జీవిని అతలాకుతలం చేయగా, మూడో ముప్పు పొంచి ఉంది. కరోనా కొత్త వేరియంట్‌, వేగంగా విస్తరించే ఒమైక్రాన్‌ ప్రస్తుతం అందరిలో గుబులు పుట్టిస్తోంది. రెండు దశల కరోనా ముప్పును దాటి పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒమైక్రాన్‌ విస్తరిస్తే ఆరోగ్యంతోపాటు ఆర్థికంగానూ చితికిపోవడం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పును తప్పించుకోవాలంటే వ్యక్తిగత అప్రమత్తతే ముఖ్యమని సూచిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు ఈ వైరస్‌ బారినపడగా, లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మన దేశంలో సైతం ఒకటి రెండు కేసులు వెలుగుచూడగా, ఒమైక్రాన్‌ వేరియంట్‌ అవునో కాదో తేలాల్సి ఉంది.

కరోనా రెండో దశ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేశాక కూడా ఉమ్మడి జిల్లాలో పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అయితే క్రమంగా కేసుల సంఖ్య తగ్గింది. ఉమ్మడి జిల్లాలో రోజుకు 500లోపు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా ఐదు నుంచి 10 లోపు మాత్రమే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అతి తక్కువ కేసులు(0.2 నుంచి 0.4 శాతం) నమోదవుతుండటంతో వైద్యశాఖ అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో భౌతికదూరంతో పాటు మాస్క్‌, శానిటైజర్‌ వినియోగాన్ని అంతా మరిచిపోయారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలను తెరిచింది. ఆ తరువాత ఉమ్మడి జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. పాఠశాలలు ప్రారంభం కాగానే యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో ముగ్గురు ఉపాధ్యాయులకు, ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. అదేవిధంగా తుంగతుర్తి మండలంలో ఒక ఉపాధ్యాయురాలికి, మరో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. నవంబరు 10వ తేదీన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఒకేరోజు 11 మంది విద్యార్థినులు, ఇద్దరు మహిళా ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదే పాఠశాలలో మరుసటి రోజు మరో ఏడుగురికి, దామరచర్ల మండలంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో మరో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మొత్తం మూడు రోజుల వ్యవధిలో ఈ రెండు గురుకులాల్లో 29 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.

పొంచి ఉన్న మూడో ముప్పు

కొవిడ్‌-19 నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌  ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో కొత్త వేరియంట్‌తో రెండు కేసులు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ అత్యంత ప్రమాదకరమని, ఇది వేగంగా విస్తరిస్తుందని డబ్లుహెచ్‌వో ప్రకటించింది. దీంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. రాష్ట్ర రాజధానికి విదేశాల నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వేరియంట్‌ను తేల్చేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపారు. ఉమ్మడి జిల్లా హైదరాబాద్‌కు చేరువలో ఉండటంతో ప్రజలు ఉద్యోగం, వ్యాపారం, చదువుల పేరుతో నిత్యం రాకపోకలు సాగిస్తున్నరు. అంతేగాక అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో విదేశాల్లో ఉంటున్న చాలామంది ఇళ్లకు చేరుతున్నరు. ఇప్పటికే కొంతమంది విదేశాల నుంచి స్వస్థలాలకు చేరి కుటుంబసభ్యులను, బంధుమిత్రులను కలిశారు. డెల్టా రకం కంటే ఒమైక్రాన్‌ వైరస్‌ ఆరు రెట్లు అధికంగా వ్యాపిస్తుందని, పలు దేశాల్లో ఈ వైర్‌సతో లాక్‌డౌన్‌ ప్రకటించగా, స్థానికంగా భయాందోళనలు మొదలయ్యాయి.

మాస్క్‌ ధరించకుంటే జరిమానా

ఒమైక్రాన్‌ నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మాస్క్‌ ధరించకుంటే రూ.1000 జరిమానా విధించేందుకు నిర్ణయించింది. దీన్ని గురువారం నుంచే అమలుచేస్తూ పోలీ్‌సశాఖకు ఆదేశాలు జారీచేసింది. కొవిడ్‌ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కేసులు సైతం నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఒమైక్రాన్‌ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ప్రతీ ఒక్కరు మాస్క్‌ ధరించడంతోపాటు, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్‌ వినియోగించి తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

డీఎంహెచ్‌వో కోటాచలం

పేట డీఎంహెచ్‌వో కుటుంబానికి పాజిటివ్‌

(సూర్యాపేట-కలెక్టరేట్‌)

కరోనా కొత్త వెరియంట్‌ ఒమిక్రాన్‌పై విస్తృత ప్రచారం సాగుతున్న సమయంలో సూర్యాపేట డీఎంహెచ్‌వో కోటాచలం కుటుంబం మొత్తం కరోనా బారిన పడటం కలకలం సృష్టిస్తోంది. దీనికితోడు ఒమిక్రాన్‌ ప్రభావాన్ని చవిచూసి ప్రస్తుతం లాక్‌డౌన్‌ విధించిన జర్మనీ దేశం నుంచే డీఎంహెచ్‌వో చిన్న కుమారుడు రావడం, ఆయనకూ పాజిటివ్‌గా తేలడంతో మరింత చర్చనీయాంశమైంది. మొత్తం ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు ఈ నెల 1వ తేదీన నిర్ధారణ కాగా, గురువారం వెలుగులోకి వచ్చింది. చిన్న కుమారుడికి పెళ్లి నిశ్చయం కాగా, అతడు జర్మనీ నుంచి 14 రోజుల కిందట స్వదేశానికి వచ్చాడు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లాడు. తాజాగా, ఎయిడ్స్‌ నివారణ దినం కార్యక్రమంలో శాఖ సిబ్బందితో కలిసి డీఎంహెచ్‌వో పాల్గొన్నారు. అయితే ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న, డీఎంహెచ్‌వో కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులతో పాటు వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయనతో కాంటాక్ట్‌ అయినవారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఎవరికి పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు.

Advertisement
Advertisement