Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్థిక రికవరీ... ఒమిక్రాన్ ప్రభావం... వ్యాక్సినేషన్ పూర్తయితేనే...

ప్యారిస్ : ప్రపంచ ఆర్థికవ్యవస్థపై, ఆర్థిక రికవరిపై కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతోందని ప్యారిస్‌కు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) హెచ్చరించింది. ప్రస్తుత(2021 క్యాలెండర్ ఏడాదిలో ప్రపంచ ఆర్థిక రికవరీ మందగించిందని, ఈ క్రమంలో... వృద్ధి రేటు అంచనాలు తగ్గుతూ వచ్చాయని వెల్లడించింది. కరోనాను ఎదుర్కొనేందుకుగాను... కోవిడ్ వ్యాక్సీనేషన్‌ను మరింత వేగంవంతం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఒమిక్రాన్‌కు ముందు ఆర్థిక రికవరీ వేగవంతంగా కనిపించిందని, ఈ రికవరీ దూకుడుకు ఒమిక్రాన్ అడ్డుపడిందని తెలిపారు. దీంతో అమెరికా, చైనా, యూరోజోన్ వంటి మేటి ఆర్థికవ్యవస్థల జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుందని పేర్కొంది.


జీడీపీ వృద్ధి మందగమనం...

ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఈ క్యాలెండర్ ఏడాదిలో 5.7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని గతంలో అంచనాలున్న విషయం తెలిసిందే. కాగా... ఒమిక్రాన్ కారణంగా ఇది 5.6 శాతానికి సవరిస్తున్నట్లు ఓఈసీడీ తెలిపింది. వైరస్ మ్యుటేషన్స్ ఉన్నాయని, దీనికి తోడు పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా ఉందని పేర్కొంది. రానున్న(2022) క్యాలెండర్ ఏడాదిలో జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనకరంగా ఉందని, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అధిక రిస్క్, అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని, తాజాగా దాడి చేస్తోన్న ఒమిక్రాన్... రికవరీకి మరింతగా అడ్డుపడుతోందని ఓఈసీడీ చీఫ్ ఎకనమిస్ట్ లారెన్స్ బూనే పేర్కొన్నారు.


అప్పటివరకు రికవరీ అనిశ్చితి...

రికవరీ అన్నది హెచ్చరికతో కూడిన ఆశావాదంగా కనిపించినప్పటికీ... ఆరోగ్యం, అధిక ద్రవ్యోల్భణం, సరఫరా గొలుసుకు అడ్డంకులు కీలక ఆందోళనలని హెచ్చరించింది. బూస్టర్ డోస్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా వీలైనంత త్వరగా వ్యాక్సీన్‌లు ఉత్పత్తయ్యేలా, అమలు చేయబడేలా చూడటం మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని ఓఈసీడీ పేర్కొంది. వ్యాక్సీనేషన్ పూర్తయ్యే వరకు అన్ని దేశాల్లో రికవరీ అనిశ్చితితోనే ఉంటుందని అభిప్రాయపడింది. 


వ్యాక్సినేషన్...

అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఇరవై  దేశాలు కరోనా సమయంలో పది ట్రిలియన్ డాలర్లను వ్యయం చేశాయని, ఇందులో ప్రపంచ వ్యాప్త వ్యాక్సినేషన్ ఖర్చు యాభై బిలియన్ డాలర్లుగా ఉంటుందని లారెన్స్ బూనె పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ పూర్తయిందని ఎవరైనా అనుకుంటే అది పెద్ద తప్పు అవుతుందని వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే... ఒమిక్రాన్ ప్రభావం ప్రపంచ వృద్ధి పై 0.25 శాతం పాయింట్ల మేర దిగజారుతుందని ఆక్స్‌ఫర్డ్ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement