Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రవాసాంధ్రుల్లో ఒమైక్రాన్‌ గుబులు!

ప్రయాణాలపై అనిశ్చితి.. అయోమయం

విమానాల రద్దు భయంతో ప్రయాణాల్లో మార్పులు 

సెలవుల గడువుకు ముందే అటూ ఇటూ రాకపోకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: సుదీర్ఘ ప్రయాణ ఆంక్షల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న విదేశాల్లోని ప్రవాసీయులను కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ గుబులు పుట్టిస్తోంది. ఆఫ్రికా దేశాలను సందర్శించి వచ్చిన ఇద్దరిలో దీన్ని గుర్తించినట్లుగా సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలు ప్రకటించడంతోపాటు, భారతదేశంలో పూర్తిస్థాయి విమానాల పునరుద్ధరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవడంతో ప్రవాసీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీ అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. హఠాత్తుగా విమానాలను రద్దు చేస్తే ఇరుక్కుపోయి ఉద్యోగాలు కోల్పోతామనే భయాందోళన చెందుతున్నారు. భారతీయులపై దాదాపు 20 నెలల నుంచి ఉన్న ప్రయాణ ఆంక్షలను తొలగించిన రోజే సౌదీ అరేబియాలో ఒమైక్రాన్‌ కేసు వెలుగు చూసిది. దీంతో పూర్తి స్థాయిలో విమానాలను నడపడానికి అనుమతి ఇవ్వాలని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ భారతదేశంపై ఒత్తిడి తీసుకోవస్తున్న తరుణంలో యుఏఈలో కూడా ఒమైక్రాన్‌ కేసు బయటపడడంతో ప్రవాస భారతీయులు ఉలిక్కిపడ్డారు. 


కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ఇటు గల్ఫ్‌లో కానీ అటు భారతదేశంలో కానీ పడగ విప్పితే.. ఏ క్షణంలోనైనా గల్ఫ్‌-భారత్‌ల మధ్య ప్రయాణానికి ఆటంకం తప్పదని భయపడుతున్నారు. కొందరు తమప్రయాణాలను వాయిదా వేసుకుంటుండగా మరికొందరు ముందే మాతృదేశానికి వెళ్లి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. సెలవుపై స్వదేశానికి వెళ్లిన అనేక మంది తెలుగు ప్రవాసీయులు తమ సెలవు వ్యవధి ఇంకా ఉన్నప్పటికీ గడువుకు ముందే తిరిగి రావడానికి  ప్రయత్నిస్తున్నట్లుగా దుబాయిలోని ప్రముఖ సామాజిక కార్యకర్త, ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్‌ సోమిరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి తెలిపారు. అనేక మంది తెలుగు ప్రవాసీయులు తమ ప్రయాణాలపై పునరాలోచనలో పడినట్లుగా కువైత్‌లోని బద్దూరు ట్రావెల్‌ ఏజెన్సీలో పని చేసే తిరుపతికి చెందిన పోలారపు బాబునాయుడు వెల్లడించారు. ఈ మేరకు ఇండియా నుంచి తిరిగి రావడానికి టికెట్లు బుక్‌ చేసుకున్నట్లుగా తెలిపారు. మాతృదేశానికి వెళ్లాలనే మమకారం ఉన్నా అనిశ్చిత పరిస్థితి కారణాంగా వెనుకంజ వేస్తున్నట్లుగా సౌదీలోని దమ్మాం పని చేసే కర్నూలు నగరానికి చెందిన రాజశేఖర్‌ పేర్కొన్నారు. 


అకస్మాత్తుగా విమానాలు రద్దయి ఉద్యోగానికి ఎసరురాక ముందే గల్ఫ్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లుగా దుబాయిలో పనిచేసే కడప జిల్లా రాజంపేటకు చెందిన నగేశ్‌ వ్యాఖ్యానించారు. కరోనా భయం కారణాన ఇప్పటికి రెండు సంవత్సరాలుగా మాతృదేశంలోని తమ పిల్లలను చూసుకోలేదని, మున్ముందు పరిస్థితి దిగజారకముందే భార్యాభర్తలిద్దరం స్వదేశానికి సెలవుపై వెళ్తున్నట్లుగా సౌదీలో నర్సుగా పనిచేసే తిరుపతి నగరానికి చెందిన మమత తెలిపారు. సుమారు ఏడాదిన్నరకు పైగా భారతీయ ప్రయాణికులపై నిషేధం విధించిన కువైత్‌, సౌదీ అరేబియా దేశాల్లో కొన్ని లక్షలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి నష్టపోగా, 14 రోజుల నిడివితో ఇతర దేశాల మీదుగా ప్రయాణం చేసి రావాల్సిన కారణంగా అనేక మంది ఆర్థికంగా చితికిపోయారు. కాగా, ఇప్పుడిప్పుడే గల్ఫ్‌లో పరిస్థితి చల్లబడుతోంది. దుబాయిలో ఎక్‌స్పో, సౌదీలో రియాద్‌ సీజన్‌ కార్యక్రమాల వల్ల విమానాల రాకపోకలపై సడలింపులు ఇస్తున్నారు.  ఈ తరుణంలో ఒమైక్రాన్‌ ఒకింత గుబులు పుట్టిస్తోంది.Advertisement
Advertisement