ముహూర్తాలు ముందుకు!

ABN , First Publish Date - 2021-12-23T07:03:04+05:30 IST

పంతులుగారు ఈ నెలలో మావాడికి పెళ్లిచేయడానికి ఓ శుభముహూర్తాన్ని చూడండి అంటూ.. పంతుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. శుభముహూర్తాలు ఈ నెల 29కే ముగుస్తుండడంతో పెళ్లిళ్లు, శుభకార్యక్రమాలు చేసుకోడానికి తొందరపడుతున్నారు. రోజురోజుకూ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల పాటు శూన్యమాసం సమీపిస్తుండడంతో ముందస్తుప్రణాళికలు చేసుకుంటున్నారు.

ముహూర్తాలు ముందుకు!

ఒమిక్రాన్‌ వ్యాప్తితో తొందరపడుతున్న జిల్లా వాసులు

29తో ముగియనున్న శుభముహూర్తాలు

ఫిబ్రవరిలో ముహూర్తాలు ఉన్నా.. ఆసక్తి చూపని జనం

పంతుళ్ల చుట్టూ ప్రదక్షిణలు.. ఫంక్షన్‌హాళ్లకు అడ్వాన్స్‌లు 

ఫొటోగ్రాఫర్‌లకు భలే డిమాండ్‌


నిజామాబాద్‌కల్చరల్‌, డిసెంబరు 22: పంతులుగారు ఈ నెలలో మావాడికి పెళ్లిచేయడానికి ఓ శుభముహూర్తాన్ని చూడండి అంటూ.. పంతుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. శుభముహూర్తాలు ఈ నెల 29కే ముగుస్తుండడంతో పెళ్లిళ్లు, శుభకార్యక్రమాలు చేసుకోడానికి తొందరపడుతున్నారు. రోజురోజుకూ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల పాటు శూన్యమాసం సమీపిస్తుండడంతో ముందస్తుప్రణాళికలు చేసుకుంటున్నారు. ఫిబ్రవరిలో ముహూర్తాలు ఉన్నప్పటికీ డిసెంబరులోనే చేయడానికి ఆసక్తిచూపుతున్నారు. ఫిబ్రవరిలో చేయాల్సి వస్తే శుభముహూర్తాలను నిరాడంబరంగా చేసుకోవాల్సి వస్తుందనే భయంతో ఫిబ్రవరిలో చేసుకోవాల్సిన ముహుర్తాలను ముందుకు జరుపుతున్నారు. ఈ నెల 29 మార్గశిరమాసం చివరి ముహూర్తం కావడంతో అధిక సంఖ్యాకులు ఈలోపే పెళ్లిల్లు, నిశ్చితార్థాలు కానిచ్చేస్తున్నారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు పుష్యమాసంలో ఎలాంటి శుభముహూర్తాలు ఉండవు. మాఘమాసంలో కూడా అయిదారు ముహూర్తాలు మాత్రమే ఉండడం, అటు తర్వాత ఫిబ్రవరి మాఘమాసం ద్వితియార్థం ఫాల్గుణ మాసాల్లో ఈ సారి మూఢాలు కూడా తోడవడంతో శుభముహూర్తాలు కానిచ్చేయాలనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 22 చవితియుక్త పంచమి, 26 సప్తమి, 29 దశమి ఉండడంతో ఉమ్మడి జిల్లా పరిధిలో వందలాది సంఖ్యలో శుభముహూర్తాలు జరగనున్నాయి. 26 ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లకు వేదిక కానున్నాయి. 29 ఈ మాసంలో చివరి ముహూర్తం కావడంతో ఆ రోజు సైతం పెద్దఎత్తున శుభకార్యక్రమాలు నిర్వహించుకోనున్నారు. 


పంతుళ్లు, ఫొటోగ్రాఫర్‌లకు, ఫంక్షన్‌హాళ్లకు భలే గిరాకీ..

ఈ మాసంలో మూడే శుభముహూర్తాలు ఉండడం, అధిక సంఖ్యాకులు శుభముహుర్తాలు జరుపుకోడానికి ఆసక్తిచూపడంతో పంతుళ్లు, ఫొటోగ్రాఫర్‌, ఫంక్షన్‌హాల్స్‌కు గిరాకీ పెరిగింది. ఒకేరోజు పంతుళ్లు రెండు పెళ్లిళ్లు, ఒక నిశ్చితార్థంచేయాల్సిన పరిస్థితి ఉంది. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడంతో ఫిబ్రవరిలో నిర్వహించతలపెట్టిన శుభముహూర్తాలను సైతం ముందే పెట్టుకుంటున్నారని పంతుళ్లు వాపోతున్నారు. ఒకేరోజు రెండు మూడు ముహూర్తాలు చేయడం తలకుమించిన భారంగా మారుతోందని పంతుళ్లు వాపోతున్నారు. గృహ ప్రవేశాలు, భూమిపూజలకు ముహూర్తాలు అయిపోవడంతో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలకు గిరాకీ వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఫొటోగ్రాఫర్‌లు సైతం ఒకే రోజు రెండు మూడు పెళ్లిళ్లు చేయడానికి ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. ప్రజల్లో ఒమిక్రాన్‌ భయంకారణంగా ఫిబ్రవరిలో జరగాల్సిన పెళ్లిళ్లు సైతం ఈ నెలలోనే జరుపుకొని ఏం చేసైన సరే పెళ్లి ఫొటోలు, వీడియోలు నువ్వే తీయాలని ఫొటోగ్రాఫర్‌లను వేడుకుంటున్నారు. ఫంక్షన్‌హాల్స్‌ సైతం ఈ మూడు ముహూర్తాల్లో ఈ పాటికే బుకింగ్‌ చేసుకోగా మినీ ఫంక్షన్‌హాల్స్‌ కోసం వెతుకులాటను ప్రారంభించారు. ఏ చిన్నపాటి అవకాశాన్ని అయినా కూడా విడిచిపెట్టకుండా పెళ్లిళ్లు శుభముహూర్తాలు చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఇళ్లముందే కల్యాణ వేడుకలు ఏర్పాటు చేసుకుని పెళ్లిళ్లు చేయడానికి సిద్ధం అవుతుండగా మరికొంతమంది పాఠశాలల్లో, మైదాన ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకోడానికి సిద్ధం అవుతున్నారు. క్యాటరింగ్‌వారు సైతం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న తమ వారిని పిలిపించుకుని ఈ శుభముహూర్తాల్లోనే అధిక డబ్బు వచ్చేవిధంగా ప్లేట్‌ ధర ను అమాంతం పెంచేస్తున్నారు. గతంలో మెనూ ప్రకారం వంద మొదలుకొని 200 వరకు ఉన్న ధర నేడు 250 మొదలుకొని 300 వరకు ప్లేట్‌ చెబుతూ అధిక ధరలను వసూలు చేసుకుని సొమ్ముచేసుకుంటున్నారు.


వందలాది సంఖ్యలో పెళ్లిళ్లు..

మార్గశిర మాసంలో పెళ్లిళ్లు ఘనంగా జరుగుతాయి. ఈ సారి అందుకు భిన్నంగా ఒమిక్రాన్‌ భయంతో పెళ్లిళ్లను ముందుగానే నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి మాఘమాసంలో జరగాల్సిన పెళ్లిళ్లు సైతం పంతుళ్ల చుట్టూ తిరిగైన ఈ నెలలో పెళ్లిళ్లు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల దాటిన తర్వాత శూన్యమాసంకి తోడు ఒమిక్రాన్‌ వైరస్‌ కారణంగా పెళ్లి ళ్లు ఆడంబరంగా చేసుకోలేకపోతామేమోనని భయాం దోళనలతో ముందుగానే పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. ఫిబ్రవరిలో అయిదు ముహూర్తాలు మాత్రమే ఉండడం, పలు కారణాలు చూపుతూ ముందస్తు పెళ్లిళ్లు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.

Updated Date - 2021-12-23T07:03:04+05:30 IST