ఉల్లం‘ఘనుల’కు ఉచ్చు!

ABN , First Publish Date - 2021-07-31T08:00:13+05:30 IST

‘లేటరైట్‌’ అక్రమాల నిగ్గు తేల్చేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రంగంలోకి దిగింది. విశాఖ ఏజెన్సీలో అక్రమంగా ఖనిజాన్ని తవ్వడంతోపాటు...

ఉల్లం‘ఘనుల’కు ఉచ్చు!

అటవీ, పర్యావరణ విధ్వంసంపై

రంగంలోకి జాతీయ హరిత ట్రైబ్యునల్‌

అక్రమ మైనింగ్‌.. చెట్లు కొట్టి రోడ్డువేసిన ఉదంతాలపై దాఖలైన పిటిషన్‌ స్వీకరణ

‘మా జోక్యం అవసరం’అని బెంచ్‌ వ్యాఖ్యలు

మైనింగ్‌ ఏరియాలో తనిఖీలకు నిర్ణయం

రోడ్డు విస్తరణ సహా ఏడు అంశాలపై నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

తనిఖీల కోసం సంయుక్త కమిటీ ఏర్పాటు


న్యూఢిల్లీ/అమరావతి/విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):  ‘లేటరైట్‌’ అక్రమాల నిగ్గు తేల్చేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రంగంలోకి దిగింది. విశాఖ ఏజెన్సీలో అక్రమంగా ఖనిజాన్ని తవ్వడంతోపాటు... రవాణాకోసం వేలాది పచ్చటి చెట్లను అడ్డంగా నరికి రోడ్డు వేసిన వైనంపై ‘నిజ నిర్ధారణ’కు ఆదేశించింది. లేటరైట్‌ అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక సంచలన కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడమే కాకుండా.. ‘మా జోక్యం అవసరం అని భావిస్తున్నాం’ అని కూడా ట్రైబ్యునల్‌ చెన్నై ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాతే ధర్మాసనం ఈ అభిప్రాయానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. దీంతో మైనింగ్‌ లీజుదారు జర్తా లక్ష్మణరావుతోపాటు పంచాయతీరాజ్‌ సహా పలు శాఖల అధికారులు దాదాపు ఇబ్బందుల్లో పడినట్టేనని ప్రభుత్వ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. అడవిలోకి చొచ్చుకురావడమే కాకుండా వేలాది చెట్లు కొట్టి రోడ్డు వేయడంపై స్థానిక గిరిజనులు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. మైనింగ్‌ మాఫియాపై చర్యలు తీసుకోవాలని, లీజుదారుతోపాటు, ఈ అక్రమాలకు సహకరించిన అధికారులకు భారీ జరిమానా విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. న్యాయపరంగా ఉన్న మార్గాలపై జాతీయ పర్యావరణవాదులతో కొంతకాలంగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాకు చెందిన కొండ్రు మరిదియ్య జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేశారు. ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కే రామకృష్ణన్‌, సభ్య నిపుణుడు కే సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 26వ తేదీన పిటిషన్‌ను విచారించి, అదేరోజు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఆ ఆదేశాల్లోని అంశాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. 


పిటిషన్‌లో ఏముందంటే.. 

అటవీ సంరక్షణ చట్టం-1980లోని సెక్షన్‌ 2 కింద సరైన అటవీ అనుమతులు లేకుండా, అటవీ సంరక్షణ రూల్స్‌-2003ను పాటించకుండా లేటరైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. సర్వే చేయని కొండ పోరంబోకు భూమి( యూఎ్‌సహెచ్‌పీ)లో 212 హెక్టార్ల భూమిలో 20 ఏళ్లపాటు మైనింగ్‌ చే సేందుకు అనుమతులు ఇచ్చారు. గిరిజనుల కోసం ఉద్దేశించిన రహదారిని ఎలాంటి అటవీ శాఖ అనుమతులు లేకుండా మైనింగ్‌ కోసం పెద్దదిగా విస్తరించుకున్నారు. ఈ రహదారి నిర్మాణం కూడా అటవీ హక్కుల చట్టం-2006లోని నిబంధనలకు విరుద్దంగా చేశారు. మైనింగ్‌కోసం సమర్పించిన గ్రామసభ తీర్మాన పత్రం వట్టి బోగస్‌. ఆ విషయం తెలిసినా దాని ఆధారంగానే మైనింగ్‌కు అనుమతి ఇచ్చారు. దీంటోపాటు అటవీ హక్కుల చట్టం-2006తోపాటు ఇతర కీలకచట్టాలను కూడా ఉల్లంఘించారు. దీనివల్ల పర్యావరణకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ నేపధ్యంలో విశాఖ, తూర్పుగోదావరి  మన్యంలో రిజర్వ్‌ ఫారెస్ట్‌ (ఆర్‌ఎ్‌ఫ)తో కలిసి ఉన్న భూమిలో అటవీ సంరక్షణ చట్టం-1980, రూల్స్‌-2003ని ఉల్లంఘించి మైనింగ్‌ చేయడానికి వీల్లేదని  ఆదేశించాలి. అటవీ సంరక్షణ చట్టం ఉల్లంఘించి చేపడుతున్న మైనింగ్‌ ని నిలువరించి ఆ ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఈ విషయంలో చట్టబద్ధమైన అంశాలు, నిబంధనలను అమలు చేయడంలో విఫలమైన  అధికారులపై శాఖాపరమైన విచారణ కు ఆదేశించాలి. సరుగుడులోని రిజర్వ్‌ ఫారె్‌స్టను కాపాడలేకపోయిన, తప్పులు చేసిన  అధికారులపై  అపరాధరుసుం విధించాలి’’


ట్రైబ్యునల్‌ ఆదేశాలివీ..

ఫిర్యాదులో పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలపై విచారణకు ట్రైబ్యునల్‌ ఆదేశించింది. కేంద్ర-రాష్ట్ర అధికారులతో కూడిన జాయింట్‌ కమిటీ విచారణ చేయాలని దిశానిర్దేశం చేసింది. ఈ కమిటీలో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలోని సీనియర్‌ అధికారి లేదా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏదైనా స్వతంత్ర ఏజెన్సీ; విశాఖ కలె క్టర్‌, విశాఖ జిల్లా అటవీ అధికారి (డీఎ్‌ఫఓ), గనుల శాఖ సీనియర్‌ అధికారి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి సీనియర్‌ అధికారి ఉంటారని, కమిటీకి అవసరమైన లాజిస్టిక్‌ సహకారం, సమన్వయం కోసం  రాష్ట్ర గనుల శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుందని పేర్కొంది. ఈ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్లి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, చట్టాల ఉల్లంఘనలను పరిశీలించి, వాటిపై వాస్తవిక, కార్యాచరణ నివేదికను అందించాలని కోరింది. అంటే, మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతం, రహదారులు నిర్మించిన అటవీ, డంపింగ్‌ యార్డు, పర్యావరణంపై ప్రభావం చూపే ప్రతీ పాయుంట్‌ను కమిటీ పరిశీలన చేయనుంది. అలాగే... మైనింగ్‌కోసం కేటాయించిన భూమి వాస్తవిక పరిస్థితి ఏమిటో, అక్కడ మైనింగ్‌  చేపట్టడానికి అటవీ సంరక్షణ చట్టం-1980 ప్రకారం ఏమైనా అనుమతులు తీసుకోవాలా?  ఆ ప్రాంతంలో అటవీ సంరక్షణ చట్టం, అటవీ హక్కుల చట్టంలోని నియమనిబంధనల  ఉల్లంఘనలు జరిగాయా? ఒక వేళ అలాంటివేమైనా కనిపెడితే వాటిపై అటవీ శాఖ తరపున ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్వతంత్ర నివేదికను అందించాలని  ఆంధ్రప్రదేశ్‌ పీసీసీఎఫ్‌, అటవీ దళాల విభాగాధితి(హెచ్‌ఓఎ్‌ఫఈ)ని ఎన్‌జీటీ ఆదేశించింది.


7 అంశాల్లో విచారణ..

లేటరైట్‌ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాన్ని తనిఖీ చేసి..వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేయడంతోపాటు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని కమిటీకి ట్రైబ్యునల్‌ ఆదేశించింది. మొత్త ఏడు అంశాలను పరిశీలించాలని నిర్దేశించింది. అవి.. 1) మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతం ఒరిజినల్‌ రెవెన్యూ రికార్డుల(స్వాతంత్ర్యానికి ముందున్నవి) ప్రకారం ఎక్కడుందో నిర్ధారణ చేయాలి. 2) మైనింగ్‌దారు నిబంధనల ప్రకారం, అటవీ సంరక్షణ చట్టం-1980 మేరకు అనుమతులు తీసుకొన్నారా? 3) అక్కడ ఏ పద్ధతిలో మైనింగ్‌ జరుగుతోంది...దాని వల్ల పర్యావరణం,  జీవావరణం(జంతుజాలం)పై ఎంత మేర ప్రభావం ఉంటుంది.. ఇప్పటికే ఏ మేరకు దెబ్బతీసింది? 4) లీజుదారు ఏమైనా పరిమితికి మించిన మైనింగ్‌ చేశారా...ఒక వేళ అదే జరిగితే ఏ స్థాయిలో అది ఉంది? 5) ఆ ప్రాంతంలో లీజుదారు ఏమైనా చట్టపరమైన అనుమతులు తీసుకోకుండా  రహదారిని విస్తరించారా? 6) లీజు దారు   మైనింగ్‌కు  అనుమతులు, క్లియరెన్స్‌లు తీసుకున్నప్పుడు జారీ చేసిన నిబంధనలను, కాలుష్యనియంత్రణ మండలి  నియమనిబంధనలు పాటించారా? 7) ఇంకా....ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారా...వాటిపై సంబంధిత విభాగాలు తీసుకున్న చర్యలేమిటి? పర్యావరణ నష్టం జరిగి ఉంటే పర్యావరణ పరిహారాన్ని అంచనావేశారా? ఈ అంశాలపై సమగ్ర పరిశీలన చేసి ఆగస్టు 31లోగా పీడీఎఫ్‌ రూపంలో నివేదిక సమర్పించాలని జాయింట్‌ కమిటీకి దిశానిర్దేశం చేసింది. 


ఫిర్యాదుదారుకీ భాగస్వామ్యం

ట్రైబ్యునల్‌ మరో కీలకమైన ఆదేశం ఇచ్చింది. ఫిర్యాదుదారు కొండ్రు మరిడయ్యను కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని ఎన్‌జీటీ ఆదేశించింది. విచారణ చేపట్టే సమయంలో హాజరు కావాల్సిందిగా ఫిర్యాదు దారునికి నోటీసులు ఇవ్వాలని, మైనింగ్‌ ప్రాంతాన్ని సంద ర్శించే సమయంలో ఫిర్యాదు దారు కూడా ఉంటారని నిర్దేశించింది. ఈ సమయంలో పర్యావరణ, అటవీ చట్టాల ఉల్లంఘనలు, అక్రమాలపై  కమిటీకి ఆయన తన నివేదిక  అందించొచ్చునని పేర్కొంది. కమిటీ తన నివేదికను సమర్పించడానికి అది (ఫిర్యాదు దారుడు ఇచ్చిన రిపోర్టు) ఉపయోగపడుతుందని ఉత్తర్వులో పేర్కొంది. జాయింట్‌ కమిటీ విచారణ వేగంగా సాగడానికి ఫిర్యాదు దారు వారం రోజుల్లోగా తన వద్ద పత్రాలు, రిపోర్టులను  కమిటీ సభ్యులకు అందించాలని కోరింది. 


ఇదీ నేపథ్యం..

విశాఖ జిల్లా నాతవరం మండలం భమిడికలొద్ది వద్ద 121 హెక్టార్లలో లేటరైట్‌ మైనింగ్‌కు గతంలో లీజులు పొందిన వ్యక్తిని అధికార పార్టీ ముఖ్యనేతలు తమ దారికి తెచ్చుకున్నారు. గత నెల నుంచి లీజు గనిలో లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తవ్వి, తరలించడం మొదలుపెట్టారు. ఈ ఖనిజాన్ని తరలించడానికి క్వారీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం జల్దాం వరకు 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించారు. అప్పటికే ఉన్న కాలిబాటను 20-30 అడుగుల మేర వెడల్పు చేశారు. దీనికోసం ఐదు కిలోమీటర్ల మేర విస్తరించిన ఫారెస్టును గుల్లచేశారు. రెవెన్యూ, అటవీ శాఖల అనుమతులు లేకుండా ఆరేడు వేల వృక్షాలను నరికివేశారు. 


ద్వివేది ఇప్పుడేమంటారు?

మైనింగ్‌ పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతోందని, వేలాది చెట్లను నరికివేశారని, అడ్డగోలుగా రహదారిని ఏర్పాటు చేశారని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వరస కథనాలు ప్రచురించింది. లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తరలిస్తున్నారని గిరిజనులు ఆందోళన చెందుతున్నారని, మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోందని వెలుగులో తీసుకొచ్చింది. అయితే, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వార్తలు రాశారంటూ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. పరువునష్టం జరిగిందని ‘ఆంధ్రజ్యోతి’పై అక్కసు వెళ్లగక్కారు. తప్పులేం జరగలేదని తేల్చేశారు. విచారణ కూడా అక్కరలేదన్నారు. ఇప్పుడు అవే అంశాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విచారణకు ఆదేశించింది. గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వం వహిస్తున్న గనుల శాఖ సీనియర్‌ అధికారిని కూడా ఈ విచారణ కమిటీలో ఉండాలని ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఆ అధికారి ఎవరో గుర్తించి ఈ కమిటీలో పనిచేయాల్సిందిగా ఉత్తర్వులు ఇవ్వాల్సింది గనుల శాఖనే. మరి ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఇప్పుడేమంటారు? ట్రిబ్యునల్‌ చర్యపై ఎలా స్పందిస్తారు? మైనింగ్‌, పర్యావరణ విధ్వంసానికి సంబంధించిన ఫిర్యాదులో మా జోక్యం అవసరమని ఎన్‌జీటీ  చెప్పిన దానిపై ఏమంటారు? విచారణను స్వాగతిస్తారా? పరువు తీశారని కేసులేస్తామంటారా? 


చెట్టుకు రూ. ఐదు వేలు..

విశాఖ జిల్లా నాతవరం మండలం తొరడలో లేటరైట్‌ మైనింగ్‌ కోసం కిల్లో లోవరాజు అనే వ్యక్తి సుమారు పదేళ్ల క్రితం దరఖాస్తు చేసుకొన్నారు. అన్ని ప్రక్రియల అనంతరం అధికారులు ఆయనకు లీజు మంజూరుచేశారు. సుమారు 19 హెక్టార్లలో 2016-17లో తవ్వకాలు ప్రారంభించి తొమ్మిది నెలల్లో మూడు లక్షల టన్నుల లేటరైట్‌ను ఆ క్వారీలో వెలికితీశారు. సుందరకోటకు చెందిన ఓ గిరిజనుడు మైనింగ్‌లో నిబంధనలు ఉల్లంఘించారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ఖనిజం రవాణాకు 1.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం కోసం దాదాపు మూడు వేల చెట్లు కొట్టివేశారని ఫిర్యాదు చేశారు. కొట్టేసిన చెట్ల ఫొటోలను హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన హైకోర్టు.. తక్షణమే మైనింగ్‌ నిలిపివేయాలని 2018లో ఆదేశించింది. అంతేకాక క్వారీ చుట్టూ ప్రహరీగోడ నిర్మించి, వన్యప్రాణులకు ముప్పు లేకుండా పగటిపూట మాత్రమే క్వారీ తవ్వకాలు చేపట్టాలని సూచించింది. రోడ్డు నిర్మాణం కోసం నరికివేసిన చెట్లకు ఒక్కో చెట్టుకు రూ.ఐదు వేలు వంతున మొత్తం రూ.1.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఇంతలో  కాలుష్య నియంత్రణ మండలి, గనుల శాఖ, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. క్వారీలో తనిఖీలు చేసి, నిబంధనలు ఉల్లంఘించారంటూ మైనింగ్‌ని నిలిపివేశారు. తాజా ట్రైబ్యునల్‌ ఆదేశాలతో స్థానిక గిరిజనులు అప్పటి ఉదంతాన్ని గుర్తు చేసుకొంటున్నారు. ఇప్పుడూ తమకు అలాంటి న్యాయం అందించాలని కోరుకుంటున్నారు. 

Updated Date - 2021-07-31T08:00:13+05:30 IST