మోదీ బర్త్‌డే వేళ ఒక్క రోజే రెండున్నర కోట్ల వ్యాక్సిన్లు!

ABN , First Publish Date - 2021-09-18T00:03:38+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత దేశం సరికొత్త రికార్డును

మోదీ బర్త్‌డే వేళ ఒక్క రోజే రెండున్నర కోట్ల వ్యాక్సిన్లు!

న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత దేశం సరికొత్త రికార్డును సృష్టించింది. శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల వరకు కేవలం ఒక రోజులో రెండు కోట్ల పై చిలుకు వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు ఇచ్చింది. శుక్రవారం రాత్రికి 2.5 కోట్ల డోసులను అందజేసే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాల సందర్భంగా ప్రజలకు టీకాకరణలో రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో బీజేపీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రజలకు ఇచ్చిన పిలుపులో మోదీకి జన్మదిన కానుకను ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ చేయించుకోనివారు టీకా తీసుకుని, మోదీకి జన్మదిన కానుక ఇవ్వాలన్నారు. ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ను మోదీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందని తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి ఒక రోజులో రెండు కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇవ్వడం పూర్తయినందుకు మాండవీయ హర్షం ప్రకటించారు.


ఇదిలావుండగా ప్రధాని మోదీ శనివారం గోవా హెల్త్‌కేర్ వర్కర్లతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంభాషిస్తారు. గోవాలో వయోజనుల్లో నూటికి నూరు శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకోవడం పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కొందరు వ్యాక్సిన్ లబ్ధిదారులు కూడా పాల్గొంటారు. 


కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 79 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. అక్టోబరునాటికి 100 కోట్ల డోసుల టీకాకరణ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 


Updated Date - 2021-09-18T00:03:38+05:30 IST