హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై.. సుప్రీంకు సర్కారు

ABN , First Publish Date - 2021-09-15T09:28:08+05:30 IST

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీవోపీ) గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది.

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై.. సుప్రీంకు సర్కారు

  • స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ 
  • మంత్రి తలసానితో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రతినిధుల భేటీ 
  • సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ


న్యూఢిల్లీ/బేగంపేట, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీవోపీ) గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కరస్పాండెంట్‌గా న్యాయవాది, సోషల్‌ వర్కర్‌ మామిడి వేణుమాధవ్‌ను పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు మాసబ్‌ ట్యాంక్‌లోని కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ను కలిశారు. 


హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ విగ్రహాలను నిమజ్జనం చేసే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని వారికి తలసాని హామీ ఇచ్చారు. హైకోర్టు తీర్పు వెలువడగానే సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష జరిపి తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని, సానుకూలమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావు తదితరులు ఉన్నారు. కాగా,  హైకోర్టుతీర్పు నేపథ్యంలో ఉత్సవాల నాలుగో రోజు వరకూ అధికారికంగా పీవోపీ విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయలేదు. మంగళవారం మాత్రం ఎన్టీఆర్‌ మార్గంలో 4 క్రేన్లను ఉపయోగించి రాత్రి పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయడం కనిపించింది.

Updated Date - 2021-09-15T09:28:08+05:30 IST