మరణభయంతో మేలే

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

ఒకసారి బుద్ధుడు నాదిక అనే గ్రామానికి వెళ్ళి, అక్కడ ఇటుకలతో నిర్మించిన శాలలో బస చేశాడు. ఆ పరిసర ప్రాంతంలో ఇటుక బట్టీలు ఉన్నాయి. వాటి దగ్గర ఇటుకలు గుట్టగా పోసి ఉన్నాయి.

మరణభయంతో మేలే

ఒకసారి బుద్ధుడు నాదిక అనే గ్రామానికి వెళ్ళి, అక్కడ ఇటుకలతో నిర్మించిన శాలలో బస చేశాడు. ఆ పరిసర ప్రాంతంలో ఇటుక బట్టీలు ఉన్నాయి. వాటి దగ్గర ఇటుకలు గుట్టగా పోసి ఉన్నాయి. కొందరు భిక్షువులు ఒక గుట్ట పక్కగా వస్తున్నారు. ఇంతలో పెద్ద నాగుపాము ఒకటి ఆ గుట్టలోకి దూరింది. ముందు నడుస్తున్న భిక్షువు పెద్దగా అరిచి, వెనక్కి దూకాడు.


‘‘మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ విష పురుగులు ఎక్కువగా ఉంటాయి. ఏ క్షణంలోనైనా మరణం వచ్చి పడుతుంది’’ అన్నాడు ఇంకొక భిక్షువు.

వారు మాట్లాడుకుంటూ బుద్ధుని దగ్గరకు వెళ్ళారు. ఆయనకు నమస్కరించి కూర్చున్నారు. దారిలో జరిగిన విషయం గురించి చెప్పారు.


అప్పుడు బుద్ధుడు ‘‘భిక్షువులారా! మరణానికి సంబంధించిన స్మృతి కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. మహా ఫలాన్ని ఇస్తుంది. మనల్ని ఒక పాము కరవవచ్చు. తేలు కుట్టవచ్చు. మరే విషపు జంతువో పట్టుకోవచ్చు. వీటివల్ల మనకు ప్రాణం పోవచ్చు. అలాగే, నడుస్తూ నడుస్తూ తొలి, రాయిపై పడి, తల పగిలి మరణించవచ్చు. లోయలో పడి చనిపోవచ్చు. ఒక్కొక్కసారి మనం తినే ఆహారమే వికటించవచ్చు. వాత, పిత్త, కఫ దోషాలు ప్రకోపించి ప్రాణాలు తీయవచ్చు. అంతేకాదు, శరీరంలో వేగంగా మార్పులు జరిగి కూడా మృత్యువాత పడవచ్చు. చావు ఏ క్షణంలోనైనా రావచ్చు. రాత్రి పూట కలగవచ్చు, పగటి వేళా జరగవచ్చు. ఇలా మరణం గురించి స్మృతి (మరణానుస్మృతి) కలిగి ఉంటే అది కూడా మనకు మేలు చేస్తుంది. ఎలాగంటే... ఒక వ్యక్తి రాత్రి పడుకున్నప్పుడు, ఆ స్మృతి ఉన్నట్టయితే- ‘నాకు మరణం ఈ రాత్రే కలగవచ్చు. కాబట్టి నేను వదిలించుకోవలసిన పాప కర్మలు, అకుశల ధర్మాలు ఏవైనా ఉన్నాయా?’ అని ఆలోచించుకోవాలి. తనను తాను పరిశీలించుకోవాలి. ఇక ఎక్కువ సమయం లేదు కాబట్టి... ఉత్తేజంతో, అలసట చెందకుండా మనసు నుంచి రాగం, ద్వేషం, మోహం, కోపం, పగ లాంటి అకుశల భావాలను తొలగించుకోవాలి. మంచి గుణాలను పెంచుకోవాలి. ఈ విధంగా... మరణ భయం కూడా మనల్ని తీర్చిదిద్దుతుంది.


మనలోని చెడ్డ గుణాలను వదిలించుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ విధంగానే, ఉదయం లేచిన తరువాత అనేక పనుల మీద రకరకాల ప్రాంతాలకు తిరిగేవారికి కూడా మరణం ఏ క్షణాన్నైనా రావచ్చు. కాబట్టి... అప్పుడు కూడా తనను తాను వేగంగా సంస్కరించుకోవాలి. అంటే మరణ భయం మనల్ని పగలైనా, రాతైన్రా... ఏ సమయంలోనైనా సంస్కరిస్తుంది. అలా సంస్కరించుకున్నవాడు, కుశలధర్మాలు కూడుకున్నవాడు ‘నేను ఈ రాత్రి చనిపోయినా, ఈ పగలు చనిపోయినా నాకు అంతరాయం కలిగించేవి, నేను వదిలిపెట్టాల్సిన దుష్ట కర్మలు, అకుశల ధర్మాలు ఏవీ నాకు లేవు’ అనుకుంటాడు. అలాంటి వాడు పగలూ, రాత్రీ సంతోషంగా, సుఖంగా బతుకుతాడు’’ అని చెప్పాడు.


‘నాకు మరణం ఈ రాత్రే కలగవచ్చు. కాబట్టి నేను వదిలించుకోవలసిన పాప కర్మలు, అకుశల ధర్మాలు ఏవైనా ఉన్నాయా?’ అని ఆలోచించుకోవాలి.

బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2022-01-28T05:30:00+05:30 IST