పోరు బాటలో..

ABN , First Publish Date - 2022-01-11T04:28:29+05:30 IST

సచివాలయ ఉద్యోగులు కదంతొక్కారు. ప్రభుత్వ తీరుపై వీరంతా నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలిరోజు సోమవారం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. విధులకు గైర్హాజరై నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. తొలుత మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం తమకు చేస్తున్న అన్యాయంపై గళమెత్తారు.

పోరు బాటలో..
కలెక్టరేట్‌ ముందు నిరసన తెలియజేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు

కదంతొక్కిన సచివాలయ ఉద్యోగులు

అధికారులకు వినతిపత్రాలు

విధులకు గైర్హాజరు

నల్లబ్యాడ్జీలతో నిరసన

రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ 

ఓటీఎస్‌ ప్రత్యేక డ్రైవ్‌ నిల్‌


సచివాలయ ఉద్యోగులు కదంతొక్కారు. ప్రభుత్వ తీరుపై వీరంతా నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగా తొలిరోజు సోమవారం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. విధులకు గైర్హాజరై నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. తొలుత మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం తమకు చేస్తున్న అన్యాయంపై గళమెత్తారు. ప్రొబేషన్‌ ప్రకటించకుండా అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరసనలో భారీ సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ కలెక్టరేట్‌, జనవరి 10:  

ప్రొబేషన డిక్లేర్‌ చేయాలని, కొత్త పీఆర్‌సీని వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉద్యమించారు. తొలిరోజు సోమవారం మూకుమ్మడిగా జిల్లా అంతటా నిరసనలు తెలిపారు. కలెక్టరేట్‌ వద్దకు సోమవారం ఒకేసారి 550మందికి పైగా సచివాలయ ఉద్యోగులు చేరుకున్నారు. విజయనగరం మండలం, కార్పొరేషన పరిధిలోని 50వార్డు సచివాలయాల్లోని సిబ్బంది హాజరుకావడంతో కలెక్టరేట్‌ రోడ్డు నినాదాలతో దద్దరిల్లింది. అటు జిల్లా వ్యాప్తంగా మండల కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు. దీంతో కార్యాలయాల్లో ఎవరూ కనిపించలేదు. కొంత మంది ఉద్యోగులు బయోమెట్రిక్‌ వేసి నిరసనలో పాల్గొన్నారు. అనేక మంది బయోమెట్రిక్‌ కూడా వేయకుండా నిరసన బాట పట్టారు. ప్రభుత్వం స్పందించే వరకూ నిరసనలను కొనసాగిస్తామని ప్రకటించారు. మండల స్థాయిలో ఉన్న అన్ని శాఖల అధికారులకు వినతిపత్రాలు అందించారు. వ్యవసాయం, ఉద్యాన శాఖ, ఫిషరీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, హెల్త్‌, పోలీస్‌ ఇలా 11శాఖలకు చెందిన ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు సమస్యలను విన్నవించారు. మండల స్థాయిలో అధికారులకు... సచివాలయ సిబ్బందికి మధ్య చర్చలు సాగాయి. ఉద్యోగులంతా విధులకు రావాలని ఎంపీడీవోలు కోరారు. లేని పక్షంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని మౌఖిక ఆదేశాలిచ్చినా సిబ్బంది ఖాతరు చేయలేదు. ప్రభుత్వం చేసేదిలేక నాయకులతో రాష్ట్ర స్థాయిలో చర్చలు జరిపేందుకు సాయంత్రం 3గంటలకు పిలుస్తారన్న చర్చ నడిచింది. ఏ సమాచారం లేకపోవడంతో సాయంత్రం వరకూ నిరసనలు కొనసాగించారు. ఇదిలా ఉండగా ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ఓటీఎస్‌ను వేగవంతం చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. సోమవారం నుంచి  ఇది ప్రారంభం కావాలని ముఖ్యమంత్రే నిర్దేశించారు. కానీ సిబ్బంది నిరసన బాటతో ఓటీఎస్‌ ప్రత్యేక డ్రైవ్‌ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. డిజిటల్‌ అసిస్టెంట్లు, కార్యదర్శులు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు ఇలా అందరూ నిరసనలో ఉండడంతో ఓటీఎస్‌ ఎక్కడిదక్కడే ఆగిపోయింది. కలెక్టరేట్‌ వద్దకు భారీగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేరుకోవడంతో కోలాహల వాతావరణం కనిపించింది. ఈ విషయం తెలిసి ముందుగానే పోలీసు శాఖ భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేసింది. కలెక్టరేట్‌ లోపలికి ఎవరినీ అనుమతించలేదు. నాయకుల సూచన మేరకు లోపలకు నలుగురినే అనుమతించారు. కలెక్టర్‌ ఫీల్డ్‌ విజిట్‌లకు వెళ్లిన కారణంగా జేసీకి వినతిపత్రం అందించారు.



Updated Date - 2022-01-11T04:28:29+05:30 IST