మరోసారి ప్రజా పోరాటం

ABN , First Publish Date - 2020-09-17T06:27:43+05:30 IST

హైదరాబాద్‌ సంస్థానంలో ఏడవ నిజాం నవాబు హయాంలో జమీందారు, జాగీర్దార్‌, దేశ్‌ముఖ్‌, పటేల్‌, పట్వారి, భూస్వామ్య వ్యవస్థ బలంగా వేళ్లూనుకొని ఉండేది...

మరోసారి ప్రజా పోరాటం

కార్పొరేటీకరణకు, ప్రైవేటీకరణకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. ప్రజల హక్కులను కాలరాస్తున్నాయి. ప్రశ్నించే గొంతుకను నొక్కి వేస్తున్నాయి. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భంగా అణగారిన ప్రజలు ఐక్యమై ప్రజారాజ్యాన్ని స్థాపించేందుకు సన్నద్ధం కావాలి. అదే ఉద్యమకారులకు ఇచ్చే నిజమైన నివాళి.


హైదరాబాద్‌ సంస్థానంలో ఏడవ నిజాం నవాబు హయాంలో జమీందారు, జాగీర్దార్‌, దేశ్‌ముఖ్‌, పటేల్‌, పట్వారి, భూస్వామ్య వ్యవస్థ బలంగా వేళ్లూనుకొని ఉండేది. ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. విద్య లేదు. వృత్తులు మాత్రం నిండుగా ఉండేవి. దొరల గడీల ముందు ముష్కరులు, దొర గుండాలు ఎల్లప్పుడు దొరకు కాపలా ఉండేవారు. ప్రతి వ్యక్తి దాసోహం అవ్వాల్సిందే. నిజాం నవాబ్‌ రాజ్యాన్ని నిలబెట్టేందుకు మతపరమైన విషప్రచారం చేసేందుకు ఖాసిం రజ్వీ నాయకత్వాన రజాకార్లు ప్రయత్నం చేశారు. భూస్వాములతో కలిసి గ్రామాల మీద పడి ప్రజలను లూటీలు, హత్యలు చేశారు. మహిళలు, యువతులు కంటపడితే అత్యాచారం లాంటి దురాగతాలకు పల్లెలు నిలయంగా మారాయి. ఆ పరిస్థితుల్లో కొద్దిమంది చైతన్యవంతమైన యువకుల్లో, నిజాంకు ఎందుకు భయపడాలి. వణుకుతూ చేతులు కట్టుకొని బానిసగిరి ఎందుకు చేయాలనే ఆలోచనల పరంపర సాగేది. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. తెలంగాణ రణరంగంగా మారింది. ఎట్టకేలకు 17 సెప్టెంబర్‌ 1948న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైంది.


నిజాం కాలంలో కుచ్చుటోపీలు పెట్టుకున్న దొరలంతా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుని ఖద్దరు టోపీలు పెట్టుకున్నారు. తిరిగి గ్రామాల్లో మరో రూపంలో గత నిజాం కాలం కంటే మరింత ఎక్కువగా కేంద్ర బలగాలను మోహరించడంతో పోలీస్‌ యాక్షన్‌ కఠినంగా అమలు జరిగింది. కమ్యూనిస్టుల అంతమే సాయుధ దళాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఆత్మరక్షణ ఉద్యమం సాగింది. అనేక తర్జనభర్జనల పిదప 1951 అక్టోబర్‌ 21న సాయుధ పోరాట విరమణ జరిగింది. కమ్యూనిస్టులకు ప్రజాబలం లేదని చెప్పేందుకు జరిగిన యత్నాలను ప్రజలు తుత్తునియలు చేశారు. 1952లో హైదరాబాద్‌ స్టేట్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జైళ్లలో ఉన్న కమ్యూనిస్టు యోధులకు బ్రహ్మరథం పట్టి భారీ మెజారిటీతో గెలిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీతో నల్లగొండ నుంచి రావి నారాయణరెడ్డిని గెలిపించి తెలంగాణ ప్రజలు భారతదేశాన్నే ఆశ్చర్యపరిచారు. 


1956లో ఆంధ్ర-, తెలంగాణ ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా అవతరించడం, తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పాలన అందించడం లేదనే ఆవేదనతో 1953 నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలన్న ఆకాంక్షకు అనుగుణంగా సుదీర్ఘకాలం ప్రత్యేక రాష్ట్ర పోరాటం కొనసాగింది. ఉద్యోగులు, మేధావులు ప్రజలలో అసంతృప్తులు పెరుగుతున్న క్రమంలో 2001లో కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీని పెట్టి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములయ్యారు. తెలంగాణలో సాయుధ పోరాటం జరగకపోతే హైదరాబాద్‌ సంస్థానం మరో పాకిస్థాన్‌గా ఉండేదని కెసిఆర్‌ ఉద్యమ సందర్భంగా కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ప్రజాస్వామ్యం ముసుగులో ఏక వ్యక్తి నియంతృత్వ పాలన సాగుతోంది. తెలంగాణ ప్రజలు కన్న కలలు కల్లమయ్యాయి. భూములు అన్యాక్రాంతానికి అంతే లేకుండా పోయింది. అప్పుడు భూస్వాముల చేతిలో భూములుంటే నేడు రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతిలో బందీ అవుతున్నాయి. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు నామమాత్రంగా మారాయి. ప్రజాస్వామికంగా నిరసనలు తెలిపేందుకు కూడా పాలకులు ఆటంకాలు సృష్టిస్తూ అణచివేస్తున్నారు.


అలనాటి సాయుధ పోరాటాన్ని మెచ్చుకున్న కెసిఆర్‌ ఈనాడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ ప్రభుత్వం సాయుధ పోరాట యోధుల త్యాగాలను శాశ్వతం చేయడం గురించి కనీసం ఆలోచించడం లేదు. కొలువులు రాలేదు, తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది. నీళ్ళు పూర్తిగా రాలేదు. ఆత్మగౌరవ పరిపాలన కనుచూపు మేరలో కనబడడం లేదు. అందుకనే సిపిఐ సాయుధ పోరాట ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీగా సెప్టెంబర్‌ 11 నుంచి 17 వరకు సాయుధ పోరాట వారోత్సవం నిర్వహించడానికి నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో నిబంధనల్ని పాటిస్తూ, ఆనాటి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్లు అర్పించడానికి నిర్ణయించింది. ఇలాంటి తరుణంలో ప్రజల ఆనాటి సామాజిక స్థితిగతులను నెమరువేసుకుని ఈనాటి పాలకుల మాటల గారడీ ఆట కట్టించేందుకు ప్రజాస్వామిక వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు ప్రతిజ్ఞ తీసుకోవాలి. కేంద్రంలో బిజెపి ఎన్డీఎ మరింత మతోన్మాద చర్యలకు పాల్పడుతోంది. మరోవైపు కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తోంది. ప్రజల హక్కులను కాలరాస్తోంది. ప్రశ్నించే గొంతుకను నొక్కి వేస్తోంది. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భంగా అణగారిన ప్రజలు ఐక్యమై ప్రజారాజ్యాన్ని స్థాపించేందుకు సన్నద్ధం కావాలి. అదే ఉద్యమకారులకు ఇచ్చే నిజమైన నివాళి.

చాడ వెంకటరెడ్డి

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

Updated Date - 2020-09-17T06:27:43+05:30 IST