మరోసారి జైలు శిక్ష తప్పదు

ABN , First Publish Date - 2021-06-19T09:01:42+05:30 IST

‘‘కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న అధికార పార్టీ నేతలకు మరోసారి జైలు శిక్ష తప్పదు. దొడ్డిదారి జీవోలతో నన్ను అధికార పార్టీ ఏమీ చేయలేదు

మరోసారి జైలు శిక్ష తప్పదు

దొడ్డిదారి జీవోలతో ఏమీ చేయలేరు : అశోక్‌ 


విజయనగరం, నెల్లిమర్ల, జూన్‌ 18: ‘‘కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న అధికార పార్టీ నేతలకు మరోసారి జైలు శిక్ష తప్పదు. దొడ్డిదారి జీవోలతో నన్ను అధికార పార్టీ ఏమీ చేయలేదు. హైకోర్టు తీర్పుతో అది తేటతెల్లం అయ్యింది. కక్షతోనే మాన్సాస్‌ ట్రస్ట్‌, విద్యా సంస్థలపై అధికార పార్టీ దాడికి దిగింది’’ అని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త హోదాలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం రామస్వామిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు.


ఈ సందర్భంగా అశోక్‌ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం వచ్చిన పదవులతో రాగద్వేషాలు లేకుండా అభివృద్ధి, సంక్షేమానికి పాటు పడాలని హితవు పలికారు. పదవులు శాశ్వతం కాదన్నారు. తనను ఎనిమిదిసార్లు ఎంఎల్‌ఎగా, ఒకసారి ఎంపీగా ప్రజలు గెలిపించారని అన్నారు. రెండుసార్లు ఓడించారన్నారు. అయినా చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు. హిందూ మతాన్ని చిన్నచూపు చూస్తూ, డబ్బును ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. రూ.43 వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి జగన్‌, మరో నేత జైలు పాలయ్యారని, మళ్లీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. కొంతమంది అధికారులు కూడా అధికార పార్టీకి వంత పాడి జైలు పాలయ్యారని, అధికారులు జైలుకు వెళ్లాలని తాను కోరుకోవడం లేదన్నారు. రామతీర్థంలోని విగ్రహం ధ్వంసం కేసులో ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. 


నిధుల మళ్లింపులో... ఏది నిజం?

దేవదాయ శాఖ నిధులను, వాహన మిత్ర చెల్లింపులకు మళ్లించారన్న వార్త రాజకీయ దుమారాన్ని రేపుతోంది. మంత్రి వెలంపల్లి అవన్నీ ఒట్టి  ఆరోపణలేనంటూ కొట్టిపారేశారు. దీనిపై కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు శుక్రవారం ట్విటర్‌లో స్పందించారు. వెల్లంపల్లి వ్యాఖ్యల వార్తను ఒక వైపు, దేవదాయ శాఖ నుంచి రూ.49 లక్షలను వైఎ్‌సఆర్‌ వాహన మిత్రకు మళ్లిస్తూ జారీ చేసిన జీవోను మరోవైపు పోస్ట్‌ చేశారు. ‘ఏది వాస్తవం? ఏది అవాస్తవం?’ అంటూ అశోక్‌ ప్రశ్నించారు.

Updated Date - 2021-06-19T09:01:42+05:30 IST