మళ్లీ మొదలయిన వాన

ABN , First Publish Date - 2021-11-29T07:07:50+05:30 IST

జిల్లాలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఆదివారం ఉదయం నుంచే భారీ వర్షాలు పడ్డాయి.

మళ్లీ మొదలయిన వాన

 చిత్తూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఆదివారం ఉదయం నుంచే భారీ వర్షాలు పడ్డాయి. ఈ పరిణామంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పది రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు ఇప్పటికే జిల్లా అతలాకులతలమైంది. చెరువులు, జలాశయాలన్నీ నిండిపోయాయి. రహదారులు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. చిత్తూరు, తిరుపతి నగరాల్లోని లోతట్టు కాలనీలు ఇంకా నీళ్లల్లోనే మగ్గుతున్నాయి. గల్లంతైనవారి ఆచూకీ లభించడం కూడా కష్టంగా మారిన క్రమంలో మళ్లీ వానలు మొదలయ్యాయి. గుడిపాల మండలం ముటుకూరుపల్లె వద్ద చిత్తూరు- వేలూరు జాతీయ రహదారిపై నుంచి ఆదివారం రాత్రి వరదనీరు ఎక్కువగా ప్రవహించడంతో రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను యాదమరి నుంచి మళ్లించారు. నగరి మండలంలో తెరణి గ్రామం వద్ద బ్రిడ్జి తెగిపోయింది. శ్రీకాళహస్తి మండలం కలవగుంట పంచాయతీలోని కాండ్రగుంట చెరువు తెగింది. పిచ్చాటూరు మండలం కీలపూడి దళితవాడ, నాగలాపురం మండలం పడమటి దళితవాడలోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. వాగులు, వంకలు మరింత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు మండలాల్లో వరి పంటలు, నారు మడులు నీట మునిగి పనికిరాకుండా పోయాయి. కొన్నిచోట్ల భూములు కోతకు గురయ్యాయి. వర్షాలతో శనివారం రాత్రి తిరుపతి నగరంలో ఓ పాత భవనం కుప్పకూలింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న పాత భవనాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. సోమవారం కూడా భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. 


జలాశయాల పరిశీలన 

జిల్లాలో వరద పరిస్థితులను అంచనా వేయడానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, కలెక్టర్‌ హరినారాయణన్‌ తదితర అధికారులు ఆదివారం పలు జలాశయాలను, అక్కడి ప్రమాదకర పరిస్థితులను పరిశీలించారు. కేవీబీపురం మండలంలోని కాళంగి, పిచ్చాటూరులోని అరణియార్‌, తిరుపతిలోని కళ్యాణిడ్యాం, రామచంద్రాపురంలోని రాయలచెరువులను చూశారు. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


‘స్పందన’ కార్యక్రమం రద్దు

చిత్తూరు: జిల్లాలో వర్షాల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు  చేసినట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులందరూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ప్రజలెవరూ కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.


జిల్లా అంతటా వర్షం 

చిత్తూరు సెంట్రల్‌: జిల్లాలో శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు అన్ని మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా సత్యవేడు మండలంలో 57మి.మీ, అత్యల్పంగా బైరెడ్డిపల్లె మండలంలో 0.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా... బీఎన్‌కండ్రిగలో 38.2 మి.మీ, వరదయ్యపాళ్యంలో 35.2, శాంతిపురంలో 27, నాగలాపురంలో 20.6, తొట్టంబేడులో 19.4, వడమాలపేటలో 18.8, సోమలలో 18, శ్రీకాళహస్తిలో 17.6, కేవీబీపురంలో 16.8, రామకుప్పంలో 16.6, ఎర్రావారిపాళ్యంలో 14.6, నిండ్రలో 13.6, రొంపిచెర్లలో 12.2, విజయపురంలో 11.8, గుడుపల్లెలో 11.4, ఏర్పేడులో 11.2, కుప్పంలో 10.8, పెద్దమండ్యంలో 10.6, బి.కొత్తకోట, నారాయణవనంలో 10.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. మిగిలిన మండలాల్లో అంతకంటే తక్కువ వర్షం కురిసింది.


నేడు విద్యాసంస్థలకు సెలవు 

చిత్తూరు(సెంట్రల్‌): వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు డీఈవో పురుషోత్తం తెలిపారు. తమ ఆదేశాలు అతిక్రమించి, విద్యాసంస్థలు నిర్వహిస్తే తాము తీసుకునే చర్యలకు బాధ్యులు కావాల్సిఉంటుందని హెచ్చరించారు.

Updated Date - 2021-11-29T07:07:50+05:30 IST