ఒక్కొక్కటిగా.. నకిలీలలు

ABN , First Publish Date - 2021-06-20T05:04:48+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మరో అక్రమాల తుట్టె కదిలింది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ద్వారా ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులను అక్రమ పద్ధతిలో భర్తీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎనిమిది నెలల కిందట నోటిఫికేషన్‌ విడుదల కాగా.. రంగంలోకి దిగిన కొందరు వ్యక్తులు తమకు నచ్చిన వ్యక్తులను నియమించారు. అర్హతలేని ధ్రువీకరణాలను తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదుతో విచారణ జరిగింది

ఒక్కొక్కటిగా.. నకిలీలలు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మరో కలకలం

ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పోస్టుల నియామకాల్లో అక్రమాలు

అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదుతో కదిలిన డొంక

విచారణ అనంతరం ఉద్యోగుల తొలగింపు

విజయనగరం రింగురోడ్డు, జూన్‌ 19: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మరో అక్రమాల తుట్టె కదిలింది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ద్వారా ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులను అక్రమ పద్ధతిలో భర్తీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎనిమిది నెలల కిందట నోటిఫికేషన్‌ విడుదల కాగా.. రంగంలోకి దిగిన కొందరు వ్యక్తులు తమకు నచ్చిన వ్యక్తులను నియమించారు. అర్హతలేని ధ్రువీకరణాలను తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదుతో విచారణ జరిగింది. అవినీతి నిర్ధారణ కావడంతో అధికారులు చర్యలకు కూడా ఉపక్రమించారు. 

జిల్లాలో కొద్ది నెలల కిందట ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ద్వారా ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. వందలాదిగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అందరిలాగే టి.కరుణప్రకాష్‌, కె.సంతోష్‌కుమార్‌లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరు ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు చదివినట్లు సర్టిఫికెట్‌ను సృష్టించుకుని దరఖాస్తు చేశారు. వైద్య శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సూచనతో మెరిట్‌ మార్కులు సాధించినట్లు నకిలీ ధ్రువపత్రాలు పొందారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయి. అనంతరం వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చేశారు. నకిలీ మెరిట్‌ ధ్రువ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వారిపై అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తునకు ఆదేశించిన వైద్య శాఖ అధికారులకు దిమ్మదిరిగిపోయింది. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది వారిలో ఒకరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ విభాగంలో పనిచేస్తుండగా.. మరొకరు ఘోషా ఆసుపత్రిలో విధుల్లో ఉన్నట్లు గుర్తించారు. లోతుగా విచారించారు. వారి సర్టిఫికెట్లను ఏపీ పారామెడికల్‌ బోర్డుకు పంపించారు. అనంతరం అవి బోగస్‌ సర్టిఫికెట్లుగా వారు నిర్ధారించారు. వాటిని రద్దు చేయాలని.. కలెకర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓకు మెడికల్‌ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే ఉద్యోగులను తొలగించారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో కార్యాలయంలో కీలక సూత్రధారిగా భావించిన వారిపై దర్యాప్తు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సూత్రధారి ఎవరన్నదానిపై ఇటు పోలీస్‌ శాఖ అటు వైద్య ఆరోగ్య శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఇదే విషయాన్ని డీఎంఅండ్‌హెచ్‌ఓ రమణకుమారి వద్ద ప్రస్తావించగా విచారణ జరుగుతోందని ధ్రువీకరించారు. దర్యాప్తు పూర్తయ్యాక మిగిలిన వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉండగా వైద్యఆరోగ్య శాఖలో వరుస అక్రమాలు బయట పడుతున్నాయి. ఇటీవలే నకిలీ ధ్రువపత్రాలు పొంది దీర్ఘకాలిక రోగులకు అందాల్సిన పింఛన్లు పక్కదారి పట్టినట్లు నిర్ధారణ అయింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో నర్సు పోస్టుకు ఎంపికైన ఓ ఉద్యోగి విషయంలోనూ విజయనగరం నుంచే నకిలీ సర్వీస్‌ సర్టిఫికెట్‌ జారీ అయిన విషయం తెలిసిందే. ఇలా వైద్య శాఖలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 




Updated Date - 2021-06-20T05:04:48+05:30 IST