Abn logo
Jul 13 2020 @ 22:24PM

‘ఒకేఒక్కడు’: నా పదవిలో ఒక్కరోజు ఉండమంటున్న కలెక్టర్

యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన చిత్రం ‘ఒకేఒక్కడు’ని అందరూ చూసే ఉంటారు. గ్రేట్ దర్శకుడు శంకర్ రూపొందించిన ఆ సినిమా ఇప్పటికీ ఏదో ఒక చోట వినబడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఉండే కంటెంట్ అలాంటిది మరి. ముఖ్యంగా విలన్ రఘువరన్ తన ముఖ్యమంత్రి పదవిలో అర్జున్‌ని ఒక్క రోజు ఉండాలని కోరే సీన్.., ఆ తర్వాత ఒక్కరోజులో అర్జున్ చేసే పనులు ప్రేక్షకులను ఆ సినిమాకు అతుక్కుపోయేలా చేస్తాయి. అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లాకు చెందిన కలెక్టర్ కూడా సేమ్ టు సేమ్ రఘువరన్‌లా తన పదవిలో ఒక్కరోజు ఉండి చూడండి అని జిల్లా ప్రజలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు.


ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్.. ఆ జిల్లా ప్రజలకు ‘ఒకేఒక్కడు’ సినిమాని గుర్తుకు తెచ్చుకునేలా చేస్తున్నారు. ఒంగోలులో ఆయన వర్తకులతో తాజాగా ఓ రివ్యూ మీటింగ్‌ను నిర్వహించారు. కరోనా కట్టడిలో తనకంటే మంచిగా పనిచేసే వ్యక్తి ఉంటే ఒక రోజు కలెక్టర్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తానని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను తాను అమలు చేస్తున్నానని చెబుతూ.. ఇలాంటి సమయంలో కలెక్టర్‌గా పనిచేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన ఇచ్చిన ఆఫర్‌పై సోషల్ మీడియాలో పలువురు కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement