లాక్‌డౌన్‌ విధించి వంద రోజులు

ABN , First Publish Date - 2020-07-02T09:46:38+05:30 IST

జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రకటనకు రెండు రోజుల ముందు విజయవాడ వన్‌టౌన్లో ఒక్క కేసు నమోదయింది.

లాక్‌డౌన్‌ విధించి  వంద రోజులు

(విజయవాడ, ఆంధ్రజ్యోతి):  జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రకటనకు రెండు రోజుల ముందు విజయవాడ వన్‌టౌన్లో ఒక్క కేసు నమోదయింది. మార్చి నెలాఖరు వరకు జిల్లాలో ఆరు పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. తర్వాత ఢిల్లీలోని మర్కజ్‌ వెళ్లొచ్చినవారిలో ఎక్కువ మందికి, వారి ద్వారా మరికొందరికి వైరస్‌ వ్యాప్తించింది. అయినా మే 21 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. మే 21వ తేదీ నాటికి జిల్లాలో మొత్తం 396 కేసులు  నమోదయ్యాయి.


ఆ తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో కరోనా మహమ్మారి కట్టలు తెంచుకుంది. మే నెలాఖరుకు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 500కు చేరుకోగా, జూన్‌లో కరోనా విశ్వరూపమే చూపించింది. ఈ ఒక్క నెలలోనే 832 కేసులు నమోదయ్యాయి. ఇటీవల పదిహేను రోజులుగా ప్రతి రోజూ జిల్లాలో 50 నుంచి 100 వరకు పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో కరోనా వ్యాప్తి ఎవరూ అరికట్టలేని ప్రమాదకర స్థాయికి చేరిపోయింది. బుధవారానికి జిల్లాలో 1519 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోపక్క మరణాల రేటు కూడా పెరిగిపోతోంది. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు జిల్లాలో 66 మంది కరోనా కారణంగా మరణించారు. 


కొత్తగా మరో 52 మందికి  వైరస్‌.. ముగ్గురు మృతి  

జిల్లాలో బుధవారం ఒక్కరోజే 52 మందికి కరోనా వైరస్‌ సోకింది. మరో ముగ్గురు వ్యక్తులు కరోనా వల్ల మరణించారు. వీరితో కలిపి జిల్లాలో పాజిటివ్‌ కేసులు 1519కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య అధికారికంగా 66కి చేరుకుంది. ఇప్పటివరకు 614 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. 839 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-07-02T09:46:38+05:30 IST