మాస్టర్‌ ప్లాన్‌కు ఎసరు!

ABN , First Publish Date - 2020-07-08T21:22:44+05:30 IST

పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న..

మాస్టర్‌ ప్లాన్‌కు ఎసరు!

వంద అడుగుల రహదారి కుదింపు

పేదలకు పట్టాలు ఇచ్చేందుకు కసరత్తు

అధికారుల నిర్ణయం వివాదాస్పదం


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం రైతులను లక్ష్యంగా పెట్టుకుంది. తాడేపల్లిగూడెంలో మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా రహదారిని కుదించి పట్టాలు ఇచ్చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నం వివాదాస్పదం అవుతోంది. రహదారికి ఇరు వైపులా ఉన్న రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధికారుల చర్యల వల్ల భవిష్యత్తుల్లో అత్యంత విలువైన తమ భూముల ధరల పతనం కానున్నాయన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.


పలువురికి లేఅవుట్‌ అనుమతి ఇచ్చినప్పుడు వంద అడుగుల మేర రహదారి ఉందని చూపిన మున్సిపాలిటీ ఇప్పుడు దానిని 40 అడుగులకు కుదించి పేదలకు ఇళ్ల పట్టాలు అందించే ఆలోచన చేస్తోంది. తాడేపల్లిగూడెం గణేష్‌నగర్‌ జంక్షన్‌ నుంచి శశి ఇంజనీరింగ్‌ కళాశాల మీదుగా జాతీయ రహదారి వరకు వంద అడుగుల రహదారి మాస్టర్‌ప్లాన్‌లో ఉంది. గణేష్‌ నగర్‌ జంక్షన్‌ నుంచి ఎయిర్‌స్ట్రిప్‌ వరకు పుంత రహదారి అక్కడ నుంచి బైపాస్‌ జాతీయ రహదారి వరకు వంద అడుగులకుపైనే రహదారి ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉంది.


దీనికి ఆనుకుని గతంలో పలు లే అవుట్‌లకు అనుమతి ఇచ్చారు. దీంతో అనేక మంది స్థలాలు కొనుగోలు చేసుకున్నారు. భవనాలు నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు అదే రహదారిని కుదించి ఇళ్ల పట్టాలు ఇస్తే స్థలాలు కొనుగోలు చేసినవారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ రహదారికి ఆనుకుని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఏపీ నిట్‌ ఏర్పాటైంది. బాలికల ఉన్నత పాఠశాల అదే రహదారికి ఆనుకుని ఉంది.


విద్యాహబ్‌గా రూపాంతరం చెందుతున్న ప్రాంతంలో విశాలమైన రహదారిని కుదించి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. జిల్లా కలెక్టర్‌ అనుమతి ఇవ్వడం వల్లే రహదారి కుదించి పట్టాల కోసం చర్యలు తీసుకుంటున్నామన్నది అధికారులు చెబుతున్నారు. అధికారుల చర్యలకు వ్యతిరేకంగా మాస్టర్‌ ప్లాన్‌ రహదారికి ఇరువైపులా ఉన్న కొందరు రైతులు, లే అవుట్‌ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. 

Updated Date - 2020-07-08T21:22:44+05:30 IST