శతశాతం ధాన్యం కొనుగోలు అవాస్తం

ABN , First Publish Date - 2022-01-29T06:16:31+05:30 IST

రైతుల నుంచి నూరుశాతం ధాన్యం కోనుగోలు చేస్తున్నారన్న ప్రకటనల్లో వాస్తవం లేదని సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వ లక్ష్యానికి అధికారులే తూట్లు పొడుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

శతశాతం ధాన్యం కొనుగోలు అవాస్తం
సమావేశంలో వ్యవసాయ శాఖ లోపాలను ప్రశ్నిస్తున్న సర్పంచ్‌

మండల సమావేశంలో సభ్యుల ధ్వజం

వ్యవసాయ శాఖ లోపాలపై నిలదీత

సమాధానం చెప్పలేకపోయిన ఏవో


రావికమతం, జనవరి 28: రైతుల నుంచి నూరుశాతం ధాన్యం కోనుగోలు చేస్తున్నారన్న ప్రకటనల్లో వాస్తవం లేదని సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వ లక్ష్యానికి అధికారులే తూట్లు పొడుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పైల రాజు అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్షలో ఏవో అరుణాకుమారి మాట్లాడుతుండగా, ఈ ఏడాది ధాన్యం కోనుగోలు విషయంలో రైతుల గోడును ఎవరూ పట్టించుకోలేదని గంపవానపాలెం సర్పంచ్‌ రొంగలి రామకృష్ణ నిలదీశారు. వ్యవసాయాధికారులు, ఆర్బీకేలు, పీఏసీఎస్‌ల ఉద్యోగుల దృష్టికి తీసుకు వెళుతున్నా ఏవో సాకులు చెబుతూ రైతులను ముప్ప తిప్పలు పెడుతున్నారని రామకృష్ణ దుయ్యబట్టారు. దీనికి మరి కొంత మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు గొంతు కలపడంతో సభలో ఉన్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అవాక్కయ్యారు. ఈ క్రమంలో ఆయన నోట మాట రాలేదు. ఇక్కడ వ్యవసాయాధికారి ఎప్పుడూ అందుబాటులో ఉండరని సభ్యులు మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే కల్పించుకుని, మండలంలో ఖరీఫ్‌లో ఎంత వరి సాగు జరిగింది, రైతుల నుంచి ఎంత ధాన్యం కోనుగోలు చేశారో వివరాలు తెలపాలని ఏవోను ఎమ్మెల్యే ఆదేశించారు. దీనికి ఆమె సమాధానం చెప్పలేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కోనుగోలు సమాచారం కూడా తెలియకపోతే ఎలా? మీరేం చేస్తున్నారు? అని నిలదీశారు. అధికారులు నిబద్ధతతో పనిచేయకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. టి.అర్జాపురం గ్రామ సచివాలయ భవనం పూర్తయినా ప్రారంభించకపోవడంతో లక్షలాది రూపాయల అద్దె చెల్లిస్తూ చాలీచాలని భనంతో కాలం వెల్లదీయాల్సి వస్తున్నదని సర్పంచ్‌ మడగల ఫాల్గుణ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ నిఽధలు అద్దెకే చెల్లిస్తుంటే, అభివృద్ధి చేయడానికి సొమ్ములు ఉండడం లేదని వాపోయారు. సమస్యను ఎమ్మెల్యేతో పాటు అధికారులను కోరుతున్నా ప్రతిపక్ష సర్పంచ్‌ననే వివక్షతో ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇంటి నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్న తొమ్మిది మంది వృద్ధుల పింఛన్లు నిలిపి వేశారని, వాటిని పునరుద్ధరించాలని ఎన్నిమార్లు కోరినా పట్టించుకోలేదని సర్పంచ్‌ ఫాల్గుణ ఆరోపించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ తలారి రమణమ్మ, వైస్‌ ఎంపిపీలు దంట్ల వెంకటరమణ, ఎం.భవానీప్రసాద్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బంటు సన్యాసినాయుడు, ఎంపీడీవో రామచంద్రమూర్తి, మండల ఇంజనీరింగ్‌ అధికారి సుమతి, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జులు గుమ్ముడు సత్యదేవా, పతివాడ చిన్నంనాయుడులను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T06:16:31+05:30 IST