వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN , First Publish Date - 2022-02-18T05:21:02+05:30 IST

రెగ్యులర్‌ తరగతుల నిర్వహణ సాఫీగా సాగుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో జిల్లాలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు.

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

- ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి

- అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

    గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 17 : రెగ్యులర్‌ తరగతుల నిర్వహణ సాఫీగా సాగుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో జిల్లాలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. ఇందుకోసం రూపొందించిన 40 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. యాక్షన్‌ప్లాన్‌ బుక్‌లెట్‌ను పట్టణంలోని బాలభవన్‌ ఆడిటోరియంలో గురువారం ఆయన విడుదల చేశారు. ఈ యాక్షన్‌ప్లాన్‌ ఆధారంగా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని, వెనుకబడిన వారిని గుర్తించి, అవసరమైతే అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు. పరీక్ష ఫలితాల్లో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిలపాలన్నారు. కార్యక్రమంలో డీఈవో ఎండీ సిరాజుద్దీన్‌, సెక్టోరియల్‌ అధికారి హంపయ్య, డీసీఈబీ సెక్రటరీ ప్రతాపరెడ్డి, ఎంఈవో సురేష్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌ శ్రీనివాసులు, కార్యక్రమ నిర్వాహకులు విష్ణు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 


దరఖాస్తుల ఆహ్వానం

గద్వాల క్రైం : హకీంపేట (హైదరాబాద్‌), అదిలాబాద్‌, కరీంనగర్‌లో ఉన్న క్రీడాపాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడు తూ క్రీడా పాఠశాలల్లో నాలుగు, ఐదు తరగతులలో ప్రవేశానికి బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. నాలుగో తరగతిలో ప్రవేశానికి ఎనిమిది నుంచి తొమ్మిది ఏళ్లు, ఐదవ తరగతిలో ప్రవేశానికి తొమ్మిది నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు అర్హులని తెలిపారు. వారు జనన ధ్రువీ కరణ, కులం, ఆదాయ ధ్రువపత్రాలతో సంబంధిత మండల విద్యాధికారికి ఈ నెల 19 లోగా దరఖాస్తులను సమర్పించాలని చెప్పారు. 800 మీటర్ల పరుగు, హైజంప్‌ తదితరాల్లో ఎంపిక పోటీలు ఉంటా యని తెలిపారు. మండల స్థాయి ఎంపిక పోటీలు ఈ నెల 20న నిర్వహిస్తారని, వాటిలో అర్హత సాధించిన వారు జిల్లా స్థాయికి ఎంపికవుతారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎంపీ రమేష్‌ బాబు, జిల్లా విద్యాధికారి సిరాజుద్దీన్‌ ఉన్నారు.


ప్లాట్ల వేలంపై నేడు ప్రీ బిడ్‌ సమావేశం

గద్వాల అర్బన్‌ : రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ అంబర టౌన్‌షిప్‌లో మిగిలిన ప్లాట్ల బహిరంగ వేలానికి సంబంధించి 18న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌, రాజీవ్‌ స్వగృహ నోడల్‌ అధికారి శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న జారీ చేసిన వేలం నోటిఫికేషన్‌లో ప్లాట్‌ ధర గజానికి ఎనిమిది వేల రూపాయలుండగా, ప్రభుత్వం రూ.5,500లకు తగ్గిం చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేయనున్న అవగాహన సదస్సును పోటీదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చేనెల 14, 15, 16వ తేదీల్లో ప్లాట్ల బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. 


Updated Date - 2022-02-18T05:21:02+05:30 IST