లక్షమందికి పింఛన్లు.. పత్రాలను పంపిణీ చేసిన CM

ABN , First Publish Date - 2021-11-26T14:15:04+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన డీఎంకే.. వివిధ వర్గాలకు చెందిన లబ్ధ్దిదారులకు పింఛన్ల పంట పండించింది. ఏకంగా 1 లక్షా 147 మందికి పింఛన్లు అందించాలని నిర్ణయించింది. ఆ మేరకు కొంతమంది

లక్షమందికి పింఛన్లు.. పత్రాలను పంపిణీ చేసిన CM

చెన్నై: రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన డీఎంకే.. వివిధ వర్గాలకు చెందిన లబ్ధ్దిదారులకు పింఛన్ల పంట పండించింది. ఏకంగా 1 లక్షా 147 మందికి పింఛన్లు అందించాలని నిర్ణయించింది. ఆ మేరకు కొంతమంది లబ్ధ్దిదారులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పింఛను మంజూరైనట్లు తెలిపే పత్రాలను లాంఛనంగా అందించారు. సచివాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీరికి ఆయా జిల్లా కలెక్టర్లు, అధికారులు పింఛను మంజూరు పత్రాలు పంపిణీ చేసేలా ముఖ్యమంత్రి పదిమంది లబ్దిదారులకు పత్రాలను అందజేశారు. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధుల పింఛను పథకం, ఇందిరాగాంధీ దివ్యాంగుల పింఛను పథకం, వితంతువుల పింఛను పథకం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పింఛను పథకాల కింద కొత్తగా దరఖాస్తులు చేసుకున్నవారికి ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేసినట్టు స్టాలిన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీ ఇరైఅన్బు, అదనపు ప్రధాన కార్యదర్శి ఫణీందర్‌రెడ్డి, రెవెన్యూ, విపత్తుల నివారణ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ జయంత్‌ తదితరులు పాల్గొన్నారు.


అన్నా జయంతికి 700 మంది ఖైదీల విడుదల

డీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 700 ఖైదీలను విడుదల చేయనున్నట్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల్లో అన్నాదురై జయంతి సందర్భంగా సుదీర్ఘకాలం యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను వారి సత్ప్రవర్తనను బట్టి విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. ఈ మేరకు త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఖైదీల ముందస్తు విడుదల చట్టం ప్రకారం, వారి సత్ప్రవర్తనల ఆధారంగా అన్నాదురై 113వ జయంతి (వచ్చే యేడాది సెప్టెంబర్‌ 15) ని పురస్కరించుకుని ఖైదీలను విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. పుళల్‌ సెంట్రల్‌ జైలు సహా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో సుదీర్ఘకాలం యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న 700 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వివరించింది. 

Updated Date - 2021-11-26T14:15:04+05:30 IST