విదేశాల నుంచి యూపీకి వచ్చిన నలుగురికి Covid positive

ABN , First Publish Date - 2021-11-30T14:50:04+05:30 IST

విదేశాల నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో నలుగురికి కొవిడ్ పాజిటివ్ అని తేలింది...

విదేశాల నుంచి యూపీకి వచ్చిన నలుగురికి Covid positive

బృందావనంలో విదేశీయులకు కరోనా కలకలం

లక్నో (ఉత్తరప్రదేశ్): విదేశాల నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో నలుగురికి కొవిడ్ పాజిటివ్ అని తేలింది. కొవిడ్ కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్ట్రియాకు చెందిన 41 ఏళ్ల మహిళ మధుర జిల్లాలోని బృందావన్ నగరానికి వచ్చారు. ఆమెకు జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని వెల్లడైంది. స్పెయిన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాలకు చెందిన మరో ముగ్గురు విదేశీయులకు కూడా కొవిడ్ సోకింది. నలుగురు విదేశీయులు బృందావనం సందర్శనకు వచ్చి తిరుగుప్రయాణంలో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. 


ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతీ ఒక్కరూ బూస్టర్ డోసు వ్యాక్సిన్ పొందాలని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. గత 15 రోజులలో ఆఫ్రికన్ దేశాల నుండి కనీసం 1,000 మంది ప్రయాణికులు ముంబైలో దిగారు.వీరిలో ఇప్పటి వరకు 466 మంది ప్రయాణికుల జాబితాను ఎయిర్‌పోర్ట్ అథారిటీ అందజేసినట్లు ముంబై అధికారులు తెలిపారు. వారిలో ఇప్పటి వరకు కనీసం 100 మంది స్వాబ్ నమూనాలను సేకరించి పరీక్షకు పంపించారు.


దేశంలో సోమవారం 24 గంటల్లో 8,309 తాజా కొవిడ్ -19 కేసులు, 236 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,03,859 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. కొత్త కరోనా వేరియెంట్ ఒమైక్రాన్ చాలా ప్రమాదమని ప్రపంచఆరోగ్య సంస్థ హెచ్చరించింది.                   


Updated Date - 2021-11-30T14:50:04+05:30 IST