May 7 2021 @ 23:03PM

‘పుష్ప’పై మరో రూమర్.. అంతలేదంటున్న యూనిట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సంచలన దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘పుష్ప’ చిత్రంపై రూమర్స్ అస్సలు ఆగడం లేదు. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే అనేకానేక రూమర్లు హల్‌చల్ చేశాయి. వచ్చిన రూమర్స్ అన్నింటికి చిత్రయూనిట్ సమాధానమిస్తూ.. వచ్చినా.. సరికొత్తగా ఏదో ఒక రూమర్ ఈ సినిమాపై నడుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్నట్లుగా సినీ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు పెడుతున్న పెట్టుబడి తిరిగిరావాలంటే.. ‘బాహుబలి’, ‘కె.జి.ఎఫ్’ మాదిరిగా రెండు పార్టులుగా విడుదల చేయాలనేలా చిత్రయూనిట్ భావిస్తోందని, అందుకు అనుగుణంగా ఇప్పుడు సుకుమార్ మార్పులు, చేర్పులు చేస్తున్నారనేలా వార్తలు మొదలయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని, ఇలాంటి రూమర్స్‌ని కావాలనే ఎవరో క్రియేట్ చేస్తున్నారని చిత్రవర్గాలు తెలుపుతున్నాయి. ‘పుష్ప’ చిత్రం మొత్తం ఒక పార్ట్‌గానే విడుదలవుతుందని, ఇందులో ఎటువంటి సందేహాలు ఉండవని చిత్రవర్గాలు వెల్లడిస్తున్నాయి.