Abn logo
Sep 19 2021 @ 03:03AM

వ్యాక్సినేషన్‌లో రికార్డుతో ఓ పార్టీకి జ్వరం వచ్చింది

  • ఒకేరోజు 2.5 కోట్ల డోసులపై ప్రధాని హర్షం
  • గోవా హెల్త్‌ వర్కర్లతో  ఆన్‌లైన్‌ సంభాషణ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: తన 71వ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17వ తేదీ ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 2.5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు వేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. సంపన్న దేశాలు కూడా ఇంతటి విజయాన్ని సాధించలేకపోయాయన్నారు. ప్రపంచ రికార్డు సృష్టించిన వైద్యులను, వైద్యసిబ్బందిని, ప్రజలను అభినందించారు. గోవా జనాభాలో అర్హులైన 100ు మందికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేసిన సందర్భంగా అక్కడి ఆరోగ్య కార్యకర్తలు, లబ్ధిదారులతో ప్రధాని శనివారం ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఇదే సందర్భంలో ఏ పార్టీ పేరు ప్రస్తావించకుండా విమర్శించేవారికి చురకలంటించారు. వ్యాక్సిన్‌ సైడ్‌ఎఫెక్ట్‌గా జ్వరం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు. దేశంలో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్‌ వినియోగించినదానికి అద్భుతమైన స్పందనగా ఒక రాజకీయ పార్టీ జ్వరం వచ్చిన అనుభూతి పొందిందని పేర్కొన్నారు.


రోజూ పుట్టినరోజు జరుపుకోవాలి: కాంగ్రెస్‌

నిన్న ఒకే రోజు 2.5 కోట్ల టీకాలు వేయడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం సంతోషం వ్యక్తం చేస్తూ శనివారం ట్వీట్‌ చేశారు. ప్రధాని ప్రతిరోజూ పుట్టిన రోజు జరుపుకోవాలన్నారు. ప్రధాని పుట్టిన రోజు డిసెంబర్‌ 31 అయితే ఈ టీకాల కోసం అప్పటివరకు వేచి ఉండాలా? అని అడిగారు. దేశంలో 21 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారన్నారు.  వయోజనుల్లో మూడింట ఒక వంతు మందికి ఇంకా మొదటి డోసు వ్యాక్సిన్‌ అందలేదని పేర్కొన్నారు.  టీకాలు ఇవ్వడంలో దేశానికి ఇంతటి వేగం కావాలని మరో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు.